దాదాలా ధోనీ.. మహీలా కోహ్లీ చేయలేరు

తాజా వార్తలు

Published : 26/12/2020 02:26 IST

దాదాలా ధోనీ.. మహీలా కోహ్లీ చేయలేరు

మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: విరాట్‌ కోహ్లీ గైర్హాజరీలో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న అజింక్య రహానె తన వ్యక్తిత్వం, శైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌ అన్నాడు. కెప్టెన్సీలో ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుందని, గంగూలీలా ధోనీ, మహీలా కోహ్లీ జట్టును నడిపించలేరని పేర్కొన్నాడు. ప్రశాంతంగా ఉంటూనే జట్టును దూకుడుగా నడిపించవచ్చని రహానెకు సూచించాడు.

‘‘రాత్రికి రాత్రే మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎంతో మంది కెప్టెన్లు వారి ప్రత్యేక శైలితో జట్టును నడిపించారు. అజింక్య రహానె.. విరాట్ కోహ్లీలా కాలేడు. ధోనీలా కోహ్లీ చేయలేడు. అలాగే గంగూలీలా ధోనీ ఉండలేడు. అయినా వాళ్లంతా విజయవంతమైన సారథులు. అయితే రహానె ఒక మార్పు చేయాలి. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి. జట్టు బాధ్యతలు మోస్తున్నాని అందరికీ సందేశాన్ని ఇవ్వాలి’’ అని గంభీర్‌ అన్నాడు.

మైదానంలో భావోద్వేగాలు చూపిస్తేనే దూకుడుగా జట్టును నడిపించినట్లు కాదని, ఫీల్డింగ్‌ మోహరించడంలో, బౌలర్లను మార్చడంలోనూ దూకుడు ఉంటుందని గంభీర్‌ అన్నాడు. ‘‘మైదానంలో ధోనీ భావోద్వేగాలు చూపించడు. దాదా కాస్త ఎమోషనల్ అవుతాడు. కోహ్లీ ఎక్కువగా తన భావోద్వేగాన్ని ప్రదర్శిస్తాడు. కుంబ్లే తన కెప్టెన్సీని దూకుడుగా నిర్వర్తించాడు. ద్రవిడ్‌ తనదైన శైలిలో జట్టును నడిపించాడు. ఫీల్డర్లను మోహరించడం, లక్ష్యాన్ని ఛేదించడంలో తన ప్రత్యేకత చాటుకున్నాడు. కాబట్టి రహానె తన స్టైల్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేదు’’ అని గంభీర్ వెల్లడించాడు.

ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టెస్టు తుదిజట్టులో చోటు సంపాదించిన యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ గురించి గంభీర్‌ మాట్లాడుతూ.. ‘‘గిల్‌కు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించాలి. రోహిత్ తుదిజట్టులోకి వచ్చినా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులతో గిల్‌ను కొనసాగించాలి. ధోనీ సారథ్యంలో రోహిత్‌, కోహ్లీకి అవకాశాలు ఇచ్చినట్లుగా గిల్‌ను మెరుగైన ఆటగాడిగా తీర్చిదిద్దాలి’’ అని వ్యాఖ్యానించాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా భారత్×ఆసీస్ రెండో టెస్టు శనివారం నుంచి ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి

కోహ్లీకి క్షమాపణలు చెప్పా: రహానె

టీమ్‌ఇండియా రెండో టెస్టు జట్టు ఇదే..


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని