
తాజా వార్తలు
రోహిత్ విషయంలో కోహ్లీ అలా చేయాలి:గంభీర్
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టును ఎంపిక చేసినప్పటి నుంచి టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గాయంపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఫిట్నెస్తో లేడని తొలుత రోహిత్‌ను ఎంపిక చేయలేదు. కానీ, తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడటంతో అతడిని టెస్టు సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే టీమిండియాతో కలిసి రోహిత్ ఆస్ట్రేలియాకు పయనమవ్వకుండా ఎన్సీఏకు వెళ్లాడు. ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని, తొలి రెండు టెస్టులకు అతడు దూరమవుతాడని ఇటీవల బీసీసీఐ తెలిపింది. కాగా, ఆస్ట్రేలియాలో క్వారంటైన్ కఠిన నిబంధనల కారణంగా టెస్టు సిరీస్‌కే పూర్తిగా దూరమవుతాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ గురించి భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మాట్లాడాడు.
రోహిత్ గాయం గురించి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సునిల్ జోషి, ఫిజియో, కోచ్ రవిశాస్త్రి మధ్య సమన్వయం ఉంటే గందరగోళ పరిస్థితి ఎదురవ్వదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ‘‘రోహిత్ శర్మ గురించి ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటే సరిపోతుంది. పరిస్థితులన్ని సాఫీగా సాగుతాయి. ఫిజియో, కోచ్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అతడి గాయం గురించి సమగ్రంగా విశ్లేషించుకోవాలి. అంతేగాక, కోచ్ రవిశాస్త్రి ద్వారా కోహ్లీ ఎప్పటికప్పుడు రోహిత్ గాయం గురించి తెలుసుకోవాలి’’ అని గంభీర్ అన్నాడు.
భారత్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లో శతకాలు సాధించిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను గౌతం గంభీర్ కొనియాడాడు. ‘‘టీమిండియాపై ఎలా సత్తాచాటాలో స్మిత్ తెలుసుకున్నాడు. కానీ అతడిని కట్టడిచేసే విధానాన్ని భారత జట్టు కనుగొనలేదు. కాగా, అతడు 18 ఓవర్లలోనే శతకాన్ని సాధించాడు. 20వ ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చి 38 ఓవర్లోనే సెంచరీ అందుకున్నాడు. అది కూడా వరుసగా రెండు శతకాలు చేయడం సాధారణ విషయం కాదు. అతడు కోహ్లీకి దూరంగా లేడు. వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్‌గా విరాట్ గురించి చెబుతుంటాం. అయితే అతడికి స్మిత్ చాలా దగ్గరగా ఉన్నాడు. కోహ్లీ ఉత్తమ గణాంకాలు కలిగి ఉన్నాడు. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో స్మిత్ ప్రదర్శన గొప్పగా ఉంది’’ అని గంభీర్ తెలిపాడు.
స్మిత్‌ను బోల్తా కొట్టించడానికి ప్రణాళికలు సిద్ధం చేయకపోతే ఈ పర్యటన భారత బౌలర్లకు అత్యంత కఠినంగా సాగుతుందని గంభీర్ అన్నాడు. ఇదే ఫామ్ అతడు టెస్టుల్లో కూడా కొనసాగిస్తే టీమిండియాకు సవాలుగా ఉంటుందని పేర్కొన్నాడు. కాగా, మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాన్బెర్రా వేదికగా చివరి వన్డే బుధవారం జరగనుంది.