close
Array ( ) 1

తాజా వార్తలు

కోహ్లీని అడ్డుకో.. బుమ్రాను విస్మరించు!

ఇద్దరు మ్యాచ్‌ విజేతలపై సందేహాలు రేకెత్తించిన న్యూజిలాండ్‌ పర్యటన

ఒక పర్యటన.. మూడు సిరీసులు.. ఇద్దరు విజేతలపై సందేహాలు రేకెత్తించాయి. ఒకరేమో పరుగుల యంత్రం. మరొకరేమో పేసుగుర్రం. అతడి నిలకడకు బౌలర్లు వణుకుతారు. ఇతడి తెలివితేటలకు బ్యాటర్లు బెదురుతారు. అతడు త్వరగా ఔటవ్వాలని.. ఇతడి బౌలింగ్‌ త్వరగా ముగియాలని కోరుకుంటారు. ఫార్మాట్‌ ఏదైనా పర్యటన ఎక్కడైనా వీరిద్దరిపైనే ఎడతెగని చర్చ. ఎక్కువ దృష్టి. అలాంటిది! తొలిసారి ఈ ద్వయం ప్రదర్శనపై ఎక్కడో చిన్న అనుమానం! కాసింత అసంతృప్తి! ఎందుకు???


ఇద్దరూ ఇద్దరే

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ మరోపేరు ‘పరుగుల యంత్రం’. జీవనదిలా సాగే పరుగుల ప్రవాహం. బంతిపై దూకుడు. ఎవరికీ లేనంత నిలకడను చూసి అసలతడు మానవమాత్రుడేనా? లేక మానవాతీతుడా? అని క్రికెట్‌ దిగ్గజాలే ఆశ్చర్యపోయారు. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కొన్నాళ్లకే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బౌలర్‌గా ఎదిగాడు జస్ప్రీత్‌ బుమ్రా. తక్కువ రన్నప్‌. తికమకపెట్టే బౌలింగ్‌ శైలి. వికెట్‌ ఏదైనా త్వరగా లెంగ్త్‌లు అందిపుచ్చుకొనే వైనం. మ్యాచ్‌ను రాకెట్‌ వేగంతో అర్థంచేసుకొని బంతితో దాడిచేసే తన తెలివితేటలతో ఒకప్పటి ‘వెస్టిండీస్‌ చతుష్టయం’లో చేరే అర్హతలున్న పేసర్‌గా గుర్తింపు పొందాడు. కోహ్లీతో సమానంగా మ్యాచ్‌ విజేత అనిపించుకున్నాడు. రెండేళ్లుగా టీమ్‌ఇండియా విజయాల్లో ఈ జోడీదీ కీలక పాత్ర! అలాంటిది ఒకే ఒక్క పర్యటన వీరిపై సందేహాలు రేకెత్తించింది.


ఆ చప్పట్లు ఏవి?

45, 11, 38, 11, 51, 15, 9, 2, 19.. ఇవీ న్యూజిలాండ్‌ పర్యటనలో విరాట్‌ స్కోర్లు. దాదాపు 20 ఇన్నింగ్స్‌ల్లో అతడి బ్యాటు నుంచి ఒక శతకం రాకపోవడం విస్మయమే. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఎదురయ్యే బౌలర్‌ ఎవరైనా పరుగుల సునామీ సృష్టించడం కోహ్లీ అలవాటు. అవమానాలు ఎదుర్కొన్న ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో వరుస శతకాలతో చప్పట్లు కొట్టించుకున్నాడు. కివీస్‌ గడ్డపై ఈ సారి మాత్రం ఆ పని చేయించలేకపోయాడు. ఓడిపోయే మ్యాచులో శతకం కన్నా గెలిచే మ్యాచులో చేసే 40 పరుగులకే విలువెక్కువ అన్నది అతడి నైజం. అది నిజమేనని విశ్లేషకులు అంగీకరిస్తున్నారు. శతకాలతో విరుచుకుపడితేనే కదా గెలుపు తలుపు తట్టేది అని వారే తిరిగి ప్రశ్నిస్తుండటం గమనార్హం.


‘కోహ్లీని అడ్డుకో’ వ్యూహం

ఎప్పుడూ దూకుడుగా కనిపించే విరాట్‌ ఈ పర్యటనలో అంత హుషారుగా కనిపించలేదు. సరైన సన్నద్ధత లేకపోవడమే ఇందుకు కారణమేమో అనిపిస్తోంది. ఆస్ట్రేలియా సిరీస్‌ అవ్వగానే న్యూజిలాండ్‌ విమానం ఎక్కేసింది టీమ్‌ఇండియా. సేదతీరేందుకు, సాధనకు సమయమే చిక్కలేదు. సుదీర్ఘంగా ఆడటం అతడిపై ప్రభావం చూపిస్తోందన్న అనుమానాలు వస్తున్నాయి. మానసికంగా దృఢంగా ఉంటేనే క్రీజులో బాగా ఆడగలమని విరాట్‌ నమ్మకం. న్యూజిలాండ్‌లో అతడి బ్యాటింగ్‌ దాన్ని ప్రతిబింబించలేదు! కివీస్‌ పేసర్లు మూకుమ్మడి ఆఫ్‌సైడ్‌ ఆఫ్‌స్టంప్‌ బంతుల్ని స్వింగ్‌ చేస్తూ అతడి ‘బ్రేకింగ్‌ పాయింట్‌’ను స్పర్శించారు. అరంగేట్రం చేసిన జేమీసన్‌తో కలిసి సౌథీ, బౌల్ట్‌ ‘అడ్డుకో వ్యూహం’ని పక్కగా అమలు చేశారు. 7 సార్లు అతడిని క్యాచ్‌ఔట్‌ చేశారు. స్పిన్నర్లు సైతం అతడి బలహీనతను సొమ్ము చేసుకున్నారు. ఇష్‌ సోధి వేసిన లెగ్‌ బ్రేక్‌కు స్టంప్స్‌ ఎగరడాన్ని విరాటే నమ్మలేకపోయాడు. ఇలా కీలకమైన కోహ్లీని కుదురుకోకుండా చేసి భారత్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టేశారు కివీలు.


లయ అందుకున్నాడా లేదా?

గాయం తర్వాత జస్ప్రీత్‌ బుమ్రా లయ అందుకున్నాడో లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. టీ20 సిరీస్‌లో 1/31, 1/21, 0/45, 1/20, 3/12 గణాంకాలు చూసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎకానమీ బాగుందని భావించారు. అయితే కీలకమైన మూడో పోరులో వికెట్‌ ఇవ్వకుండా అతడి బౌలింగ్‌ను బాదడం కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఆత్మవిశ్వాసాన్ని మరోస్థాయికి చేర్చింది. అందుకే వారో పక్కా ప్రణాళిక అమలు చేశారు. వన్డే సిరీసులో వికెట్‌ ఇవ్వలేదు. దాంతో 30 ఓవర్లు విసిరిన ఈ పేసుగుర్రం 0/53, 0/64, 0/50తో నివ్వెరపరిచాడు. తొలి టెస్టులో 88 పరుగులిచ్చి 1 వికెట్టే తీశాడు. అదీ తొలి ఇన్నింగ్స్‌ ఆఖర్లో కావడంతో బుమ్రా లయపై సందేహాలు మళ్లీ ఊపందుకున్నాయి. అతడి బౌలింగ్‌లో తప్పులేదని, ప్రమాదకరమైన బంతులు విసురుతున్నాడని ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు అంటున్నారు. కానీ 3 వన్డేల్లో కనీసం ఒక్క వికెటైనా ఎందుకు తీయలేదన్నదే ప్రశ్న.


‘బుమ్రాను విస్మరించు’ వ్యూహం

ఎన్నో మ్యాచుల్ని అలవోకగా గెలిపించిన బుమ్రా సామర్థ్యంపై కేవలం ఒక్క సిరీసుకే విశ్వాసం కోల్పోవడం అనైతికం! అతడిపై మరింత నమ్మకం ఉంచాల్సిన తరుణమిది. తన ప్రదర్శనపై అన్ని కోణాల్లో విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ పర్యటనకు వెళ్లినా కొన్ని రోజులు ముందు అక్కడి పిచ్‌లు, వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయడం బుమ్రా అలవాటు. ఆ తర్వాత కఠిన సాధన  చేస్తాడు. కివీస్‌ పిచ్‌లపై లెంగ్త్‌లు దొరకబుచ్చుకోవడంలో తడబాటు కనిపించడం సన్నద్ధత బాగాలేదని చెబుతోంది. చురుకైన ఈ పేసుగుర్రం అక్కడి వాతావరణం, పరిస్థితులను ఉపయోగించుకోలేక పోయాడు. ఇక కోహ్లీని అడ్డుకున్నట్టే బుమ్రాపైనా విలియమ్సన్‌ బృందం ‘విస్మరించు’ వ్యూహం అమలు చేసింది. తికమక పెట్టే అతడి బౌలింగ్‌ను విస్మరించింది. పరుగులు రాకున్నా సరే వికెట్లు ఇవ్వలేదు. మిగతా వారిపై దాడి చేసింది. ‘బుమ్రా అద్భుతం. అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టం. అనుభవం తక్కువున్న బౌలర్లే మా లక్ష్యం’ అన్న రాస్‌టేలర్‌ మాటలే ఇందుకు ఉదాహరణ.


అదే పదివేలు

ఆటలో గెలుపోటముల మాదిరిగానే ఆటగాళ్లు ఫామ్‌ కోల్పోవడం, గాయాల పాలవ్వడం అత్యంత సహజం. విజేతలైన కోహ్లీ, బుమ్రా అస్థిరత్వం, ఒడుదొడుకులు ఈ ఒక్క పర్యటన వరకే పరిమితం కావాలని అందరూ కోరుకుంటున్నారు. వారు తిరిగి పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఎండ, వాన, చలికాలం ఉన్నట్టే ఆటగాళ్ల కెరీర్లోనూ అత్యుత్తమంగా ఆడుతున్న కాలం, ఆడని కాలం ఉంటాయి. తనపై వచ్చిన విమర్శలకు తెరవేయడం కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య. కానీ బుమ్రా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం ఇదే తొలిసారి. అన్ని జట్లూ కివీస్‌ తరహాలోనే అతడిపై ‘విస్మరించు’ వ్యూహం అమలు చేస్తే పరిస్థితి ఏంటన్నదే అర్థం కావడం లేదు. ఏదేమైనా వారు త్వరగా ఈ గడ్డుకాలాన్ని అధిగమిస్తే అదే టీమ్‌ఇండియాకు పదివేలు!!!

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.