close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 30/05/2020 10:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కల చెదరగొట్టిన గంగూలీ..!

బంతి, బ్యాటుతో మాయ చేసిన దాదా

ఇంగ్లాండ్‌ కన్న కలలు ఆవిరి 

(ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం)

1999 వన్డే ప్రపంచకప్‌. క్రికెట్‌ పుట్టినిల్లన్న పేరేగానీ అప్పటి వరకు ట్రోఫీని ముద్దాడిందే లేదు. ఆతిథ్యం ఇస్తున్నాం కదా ఈ సారైనా గెలుద్దామన్న పట్టుదలతో బరిలోకి దిగింది ఇంగ్లాండ్‌. ‘సూపర్‌ సిక్స్‌’కు వెళ్దామన్న ఆంగ్లేయుల ఆశలకు దాదా అనూహ్యంగా గండి కొట్టాడు. బంతి, బ్యాటుతో మాయచేసి వారి కలను చెదరగొట్టేశాడు.


జింబాబ్వే గెలుపుతో చావోరేవో

గ్రూప్‌ దశలో వరుసగా శ్రీలంక, కెన్యాపై గెలిచిన ఇంగ్లాండ్‌ జోరుమీదుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో మ్యాచులో మాత్రం 122 పరుగులతో పరాజయం చవిచూసింది. అయితే జింబాబ్వేపై 69 బంతులు మిగిలుండగా విజయం సాధించడం దానిలో ఆత్మవిశ్వాసం నింపింది. సూపర్‌ సిక్స్‌కు అర్హత సాధిస్తామని భావించింది. అనూహ్యంగా పటిష్ఠమైన సఫారీలను జింబాబ్వే మట్టికరిపించడంతో టీమ్‌ఇండియాతో ఆఖరి మ్యాచులో విజయం సాధించక తప్పని పరిస్థితి ఏర్పడింది. సిక్సర్లు బాదడమే  కాదు వికెట్లు తీసే సత్తావున్న గంగూలీ కారణంగా ఓటమి చవిచూసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ రెండు రోజులు (మే 29, 30) జరగడం గమనార్హం.


దాదా, ద్రవిడ్‌ కీలక భాగస్వామ్యం

ఇంగ్లాండ్‌ జట్టుకు అలెక్‌ స్టీవార్ట్‌ కెప్టెన్‌. టీమ్‌ఇండియాకు మహ్మద్‌ అజహరుద్దీన్‌. వేదిక బర్మింగ్‌హామ్‌. టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. డారెన్‌ గఫ్, అలన్‌ ములాలె, మార్క్‌ ఎల్హమ్‌ తలో రెండు వికెట్లు తీసి భారత్‌ను 232/8కి పరిమితం చేశారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సౌరవ్‌ గంగూలీ (40; 59 బంతుల్లో 6×4) అద్భుతంగా ఆడాడు. శఠగోపన్‌ రమేశ్‌ (20) జట్టు స్కోరు 49/1 వద్ద ఔటైనా రాహుల్‌ ద్రవిడ్‌ (53; 82 బంతుల్లో 6×4) సహకారంతో దాదా చెలరేగాడు. సొగసైన కవర్‌డ్రైవ్‌లతో అలరించాడు. ఈ క్రమంలో ఎల్హన్‌ వేసిన 21.2వ బంతిని దాదా స్ట్రెయిట్‌గా ఆడాడు. బంతిని అందుకున్న బౌలర్‌ నేరుగా వికెట్లకు విసిరాడు. అప్పటికి స్టంప్స్‌కు ఆవల ఉన్న గంగూలీ రనౌట్‌ అయి పెవిలియన్‌ చేరక తప్పలేదు. ఆ తర్వాత సచిన్‌ (22; 40 బంతుల్లో 2×4), అజహరుద్దీన్‌ (26; 35 బంతుల్లో 3×4) నిలకడగా ఆడారు. చివర్లో అజయ్‌ జడేజా (39; 30 బంతుల్లో 5×4) మెరుపు ఇన్నింగ్స్‌తో టీమ్‌ఇండియా  కాపాడుకోగల లక్ష్యం సాధించింది.


వర్షంతో ఛేదన వాయిదా

ఛేదనలో ఇంగ్లాండ్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. దేవాశీశ్‌ మహంతి వేసిన నాలుగో ఓవర్‌ తొలి రెండు బంతుల్లో అలెక్‌ స్టీవార్ట్‌ (2), గ్రేమ్‌ హిక్‌ (0)ను పెవిలియన్‌ పంపించాడు. ఆ తర్వాత గ్రాహమ్‌ థోర్ప్‌ (36; 57 బంతుల్లో 7×4)తో కలిసి నాసర్‌ హుస్సేన్‌ (33; 63 బంతుల్లో 3×4) 59 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించాడు. క్రీజులో బలంగా పాతుకుపోతున్న ఈ జోడీని గంగూలీ విడదీశాడు. దాదా వేసిన 19.1వ బంతి తన డిఫెన్స్‌ను ఛేదించి వికెట్లను షేక్‌ చేయడంతో హుస్సేన్‌ దిగాలుగా పెవిలియన్‌ చేరాడు. 20.3వ ఓవర్లో ఉరుములు, వర్షం రావడంతో మ్యాచ్‌ను తర్వాతి రోజు (రిజర్వు)కు వాయిదా వేశారు.


కీలక వికెట్లు తీసిన గంగూలీ

చావోరేవో తేల్చుకోవాల్సిన పోరులో వాతావరణం సైతం ఇంగ్లాండ్‌కు అచ్చిరాలేదు. ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఆతిథ్య జట్టు ఇబ్బంది పడింది. 73/3తో ఆట ఆరంభించిన ఆంగ్లేయులను కొద్దిసేపటికే జవగళ్‌ శ్రీనాథ్‌ దెబ్బకొట్టాడు. గ్రాహమ్‌ థోర్ప్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత కుంబ్లే వరుసగా ఫ్లింటాఫ్‌ (15), హోలియోక్‌ (6)ను పెవిలియన్‌ పంపించాడు. ఈ క్రమంలో కీలకంగా మారిన నీల్‌ ఫెయిర్ ‌బ్రదర్‌ (29; 62 బంతుల్లో 2×4)ను ఔట్‌ చేసేందుకు గంగూలీ రంగంలోకి దిగాడు. తక్కువ ఎత్తులో మీడియం పేస్‌తో వేసిన బంతి నీల్‌ బ్యాటు అంచుకు తగిలి కీపర్‌ మోంగియా చేతుల్లో పడింది. అంతకన్నా ముందు ఎల్హమ్‌ (0)ను 36.5వ బంతికి పెవిలియన్‌ పంపించాడు. అజహర్‌ ఈ క్యాచ్‌ అందుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ కథ ముగిసేందుకు మరెంతో సమయం పట్టలేదు. చివరికి 45.2 ఓవర్లకు 169 పరుగులకు కుప్పకూలింది.నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాదా మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.