close
Array ( ) 1

తాజా వార్తలు

రాహుల్ మెరిశాడు.. పంత్ మురిపిస్తాడా?

పోగొట్టుకున్న చోటే నిలబెట్టుకుంటాడా?

‘‘గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస.. గర్జన కన్నా ఎంతో భయంకరంగా ఉంటుంది’’.. ఈ డైలాగ్‌ టీమ్ఇండియా బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌కు సరిగ్గా సరిపోతుంది. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం టెస్టుల్లో చోటు కోల్పోయిన తర్వాత నుంచి అతడి ఆటతీరులో ఎంతో మార్పు వచ్చింది. ఆటలో కసి మరింత పెరిగింది. పరుగుల ప్రవాహం సృష్టిస్తూ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రారాజుగా ఎదిగాడు. అయితే రాహుల్‌కు గతంలో ఎదురైన పరిస్థితే ఇప్పుడు యువ వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌కు తలెత్తింది. తుదిజట్టులో చోటు కోసం ఎంతగానో నిరీక్షిస్తున్న అతడు.. న్యూజిలాండ్‌ తొలి టెస్టుకు ఎంపిక అవ్వడం దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. అయితే పంత్‌ అవకాశాల్ని రాహుల్‌లా సద్వినియోగం చేసుకుంటాడా? అనేది అందరి మదిలోనూ మెదిలే ప్రశ్న!!


పంత్‌కు మినహా..
టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా కైవసం చేసుకుంటే, వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్‌ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు లెక్క సరిపోయింది. ఇక మిగిలిందీ టెస్టు సిరీసే. అయితే న్యూజిలాండ్‌ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ఎంపికైన భారత జట్టులో అందరూ నీలిరంగు జెర్సీ ధరించి బరిలోకి దిగారు. ఒక్క పంత్‌ మినహా. టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో కైవసం చేసుకున్న తర్వాత మిగిలిన రెండు నామమాత్రపు మ్యాచ్‌లకు పంత్‌ జట్టులోకి వస్తాడనుకున్నారు. కానీ, రాలేదు. ఆ తర్వాత వన్డే సిరీస్‌ను 0-2తో కోల్పోయిన అనంతరం మూడో మ్యాచ్‌కు అయినా అతడికి అవకాశం వస్తుందనుకున్నారు. కానీ, మళ్లీ అదే పరిస్థితి. అప్పుడు కూడా అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక న్యూజిలాండ్‌ పర్యటనలో పంత్‌ బరిలోకి దిగడం దాదాపు అసాధ్యమే అనుకున్నారు. కానీ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో మెరిసి తుది జట్టులోకి వస్తానని అతడు సంకేతాలు పంపాడు. పేసర్లకు అనుకూలించే పిచ్‌పై ప్రత్యర్థులకు దీటుగా సమాధానమిస్తూ అర్ధశతకం బాదాడు.


పోగొట్టుకున్న చోటు నుంచే ఆరంభిస్తాడా?
కెరీర్‌ను పంత్‌ గొప్పగా ఆరంభించినా తర్వాత నిలకడలేమితో నిరాశపరిచాడు. వృద్ధిమాన్‌ సాహా పునరాగమనం చేయడంతో గత ఏడాది అక్టోబర్‌లో టెస్టుల్లో చోటు కోల్పోయాడు. అయినా పరిమిత ఓవర్లలో ఫర్వాలేదనిపించాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మెరవడంతో అతడు గాడిలో పడ్డాడని భావించారు. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో అతడు కంకషన్‌కు గురయ్యాడు. ఇది అతడిని అన్నిఫార్మాట్ల నుంచి దూరం చేసింది. పరిమిత ఓవర్లలో అతడి స్థానంలో రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ చేయడం, వికెట్ల వెనుక, బ్యాటింగ్‌లో రాహుల్‌ సత్తా చాటుతుండటం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపికైనా ఇప్పటివరకు పంత్‌కు ఒక్క అవకాశం కూడా రాలేదు. అయితే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రాణించడంతో వెల్లింగ్టన్‌ టెస్టుకు అతడు ఎంపిక అవ్వడం దాదాపు ఖరారైనట్లేనని కనిపిస్తోంది. దీంతో ఏ ఫార్మాట్‌లో అయితే అతడు తొలుత చోటు కోల్పోయాడో.. అదే ఫార్మాట్‌ నుంచి తుదిజట్టులో వస్తాడని అందరూ భావిస్తున్నారు.


సాహాను కాకుండా పంత్‌నే ఎందుకు?
వెల్లింగ్టన్‌ వేదికగా ఫిబ్రవరి 21న ప్రారంభం కానున్న కివీస్‌ తొలి టెస్టుకు సాహాకు బదులుగా పంత్‌ ఎంపిక అవుతాడని భావిస్తున్నారంతా. దీనికి కారణాలు లేకపోలేదు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రాణించడంతో పాటు పంత్‌కు విదేశీ పిచ్‌లపై మంచి రికార్డు ఉంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో అతడు శతకాలు నమోదుచేశాడు. అంతేకాక పటిష్ఠమైన కివీస్‌ పేస్‌ విభాగాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే పనిని సాహా కంటే పంత్‌ మెరుగ్గా చేయగలడు. దానితో పాటు పంత్‌ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌. కివీస్ జట్టులో ఉన్న ఎడమచేతి వాటం స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌పై అతడు ఒత్తిడి తీసుకురాగలడు. ఈ సానుకూలాంశాలతో పంత్‌ తిరిగి జట్టులోకి వస్తాడని అందరూ భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పంత్‌తోనే జట్టు యాజమాన్యం ఎక్కువ సేపు వికెట్‌కీపింగ్‌ చేయించింది. అయితే వచ్చే అవకాశాల్ని పంత్‌ ఎలా సద్వినియోగం చేసుకుంటాడనేదే అసలు ప్రశ్న. జట్టులో నిలవాలంటే గ్లవ్స్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ పంత్‌ అదరగొట్టాల్సి ఉంది.

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.