close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 18/02/2020 09:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆమె లేదు.. భారత్‌ ప్రపంచకప్‌ ముద్దాడేనా?

మిథాలీ లేని టీమ్‌ఇండియా పరిస్థితి ఏంటి? 

ఆమె ప్రశాంతతకు మారు పేరు. ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఆమె నాయకురాలు. ఆమె మార్గదర్శి. మహిళల జట్టుకు గెలుపోటములు, వెలుగు నీడలు, పరువు ప్రతిష్ఠలు, హర్షాతిరేకాలు ఆమెతోనే మొదలయ్యాయి. ఆరు పొట్టి ప్రపంచకప్పుల్లో జట్టును సారథిగా, మార్గనిర్దేశకురాలిగా ఆమె నడిపించింది. సుదీర్ఘ కాలంగా కంటున్న తన కల కోసం గతేడాది విశ్రమించింది. ఆ ధీర వనితే మిథాలీ రాజ్‌. మరి ఆ పెద్దదిక్కు లేని మహిళల జట్టు 2007లో ధోనీసేనలా అద్భుతం చేసేనా? ప్రపంచకప్‌ను ముద్దాడేనా??? 


అనుభవం అపారం

భారత క్రికెట్‌ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు మిథాలీ రాజ్‌. 20 ఏళ్ల కెరీర్‌లో ఆమె ఘనతలు అందరికీ తెలుసు. 10 టెస్టులు, 209 వన్డేలు, 89 టీ20ల అనుభవానికి ఆమె ప్రతిరూపం. అంతర్జాతీయ క్రికెట్లో రికార్డుల రారాణి. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌వుమన్‌. అన్ని ఫార్మాట్లలో 9000+ పరుగులు చేసి ఔరా అనిపించింది. అందుకే ఆమెను విదేశీ క్రికెటర్లు సైతం ఎంతో గౌరవిస్తారు. సుదీర్ఘ అనుభవమున్న మిథాలీ తమకు ఆదర్శమని చెబుతారు. 14 ఏళ్లకే జాతీయజట్టుకు ఎంపికైన ఈ హైదరాబాదీ అరంగేట్రంలోనే శతకం బాదేసి సంచలనం సృష్టించింది. 32 టీ20ల్లో సారథ్యం వహించి 17 విజయాలు అందుకుంది. 132 వన్డేల్లో నాయకత్వం వహించగా విజయాల శాతం 41.34. ఇక వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియాను రెండుసార్లు ఫైనల్‌కు చేర్చింది. భారత మహిళల క్రికెట్‌ సారథుల్లో ఇలాంటి ఘనత, నిలకడ మరెవ్వరికీ లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎనిమిది ఐసీసీ టోర్నీ ఫైనళ్లు ఆడిన మిథాలీ లేకపోవడంతో హర్మన్‌ప్రీత్‌ సేనకు లోటే. మరెందుకు ఆమె వీడ్కోలు పలికింది?


వీడ్కోలు ఎందుకంటే?

తన 20 ఏళ్ల కెరీర్‌లో ఒక్కసారైనా ప్రపంచకప్‌ను ముద్దాడాలన్న కోరికతో మిథాలీ 2018 టీ20 ప్రపంచకప్‌ కోసం కరీబియన్‌ దీవుల్లో అడుగుపెట్టింది. ఓ మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో ఆడింది. పాక్‌, ఐర్లాండ్‌పై ఓపెనర్‌గా అర్ధశతకాలు బాదేసింది. గాయంతో ఆసీస్‌ మ్యాచ్‌కు ఆమెకు విశ్రాంతినిచ్చారు. కీలకమైన ఇంగ్లాండ్‌తో సెమీస్‌కు ఎంపిక చేయకపోవడంతో తనతో పాటు అందరికీ షాక్‌. కోచ్‌ రమేశ్‌ పొవార్‌ నేతృత్వంలో కుట్ర జరిగిందని, సొంత జట్టుకు తనను దూరం చేశారన్న బాధతో కుమిలిపోయింది. కుంగిపోయింది. నీ సేవలకు విలువ లేదా అని అంతరాత్మ వేసిన ప్రశ్నకు సమాధానం దొరక్క.. నిద్ర లేక.. గుండెల్లో ఉప్పొంగుతున్న బాధను దిగమింగలేక కన్నీరు కార్చింది. ఇదే విషయమై బీసీసీఐకి పంపిన ఈమెయిల్‌ పెద్ద దుమారమే రేపింది. కొత్త కోచ్‌గా రామన్‌ ఎంపికయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకే మిథాలీ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. వన్డే ప్రపంచకప్‌ గెలవాలన్న తన కల కోసం ఫిట్‌గా ఉండేందుకు పొట్టి క్రికెట్‌కు దూరమవుతున్నానని వెల్లడించింది. నిజానికి ఆమె ఈ టీ20 ప్రపంచకప్‌ ఆడగలిగే ఫిట్‌నెస్‌, ఫామ్‌తో ఉంది.


పూడ్చలేని లోటు

దిగ్గజ క్రికెటర్‌ మిథాలీ అనుభవం ప్రస్తుతం టీమ్‌ఇండియాకు అత్యవసరం. హర్మన్‌, స్మృతి, వేద, దీప్తి, శిఖ, పూనమ్‌, తానియా వంటి సీనియర్లు రోడ్రిగ్స్‌, షెఫాలి, రిచా ఘోష్‌, హర్లీన్‌, అరుంధతి వంటి జూనియర్లతో జట్టు కళకళలాడుతోంది. సమతూకం సాధించడంలో విఫలమవుతోంది. ఎందుకంటే నిలకడ లేమి జట్టును వేధిస్తోంది. 2018 నుంచి హర్మన్‌ సేన రెండు ద్వైపాక్షిక సిరీసులు గెలిచి, రెండు ఓడింది. 2019 నుంచి మొన్నటి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో ముక్కోణపు సిరీస్‌ వరకు 10 మ్యాచుల్లో గెలిస్తే 10 మ్యాచుల్లో ఓడటం ఇందుకు మరో ఉదాహరణ. టాప్‌ఆర్డర్లో మంధాన, రోడ్రిగ్స్‌, షెఫాలి విఫలమైతే జట్టు ఒక్కసారిగా కుప్పకూలుతోంది. మిడిలార్డర్‌లో కెప్టెన్‌ హర్మన్‌, వేద కృష్ణమూర్తి అంచనాలు అందుకోవడం లేదు. టాప్‌ ఆర్డర్‌ ఎంత రాణించినా లోయర్‌ ఆర్డర్‌ చేసే 20-30 పరుగులే విజయం అందిస్తాయని కోచ్‌ రామన్‌ అనడమే ఇందుకు ఉదాహరణ. మిథాలీలా 1, 3, 4, 5, 6 స్థానాల్లో ఆడగలిగే సీనియర్‌ బ్యాటర్‌ ఇప్పుడు జట్టుకు లేరు.


ఇప్పుడెలా ఉందంటే?

ఈ ప్రపంచకప్‌లో కఠినమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లున్న గ్రూప్‌లో భారత్‌ ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో సమష్టిగా చెలరేగే ఆ జట్లతో ఆట సులువు కాదు. పక్కా ప్రణాళికతో దూకుడుగా ఆడకపోతే గెలుపు కష్టం. ముక్కోణపు సిరీసు ద్వారా తెలిసింది అదే. మొదట్లో వరుస విజయాలు సాధించిన టీమ్‌ఇండియా ఆ తర్వాత కష్టంగా ఫైనల్‌కు చేరింది. అయితే తుది మ్యాచులో అద్భుతంగా రాణించిన మంధానకు మరెవ్వరూ అండగా నిలవలేదు. భారత అమ్మాయిలు వికెట్ల మధ్య రెండో పరుగుకు ప్రయత్నించకుండా బద్ధకంగా ఉన్నారని మాజీ సారథి డయానా ఎడుల్జీ సైతం విమర్శించింది. సిరీసులో మంధాన టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఆమెతో పాటు హర్మన్‌కు మహిళల బిగ్‌బాష్ ఆడిన అనుభవం ఉండటం సానుకూలం. అటు బంతి, బ్యాటుతో దీప్తిశర్మ ఫామ్‌లో ఉంది. మీడియం పేసర్‌ శిఖా పాండే ఆస్ట్రేలియా పిచ్‌లపై అత్యంత కీలకం. ఒకవైపు మిథాలీ లేని లోటు, మరోవైపు మిడిలార్డర్‌ సమస్యలతో టీమ్‌ఇండియా ఇబ్బంది పడుతోంది. ఈ పరిస్థితుల్లో 2007లో ధోనీసేనలా అంచనాలకు మించి హర్మన్‌సేన ప్రపంచకప్‌ను ముద్దాడితే చరిత్రలో నిలవడం ఖాయం.

-ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.