close
Array ( ) 1

తాజా వార్తలు

ఇప్పుడైనా బ్యాట్‌ ఝుళిపిస్తారా?

ఆందోళన కలిగిస్తున్న హర్మన్‌ప్రీత్‌ సేన బ్యాటింగ్‌

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫేవరెట్‌ జట్లలో టీమ్‌ఇండియా ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మూడు వరుస విజయాలతో ఆరు పాయింట్లు సాధించిన హర్మన్‌ప్రీత్‌ సేన ఇప్పటికే సెమీస్‌ చేరింది. శనివారం శ్రీలంకతో చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. మరోవైపు లంక రెండు ఓటములతో సెమీస్‌ రేసు నుంచి తప్పుకుంది. భారత్‌తో నామమాత్రపు మ్యాచ్‌లోనైనా గెలవాలని కోరుకుంటోంది.  కాగా,  గత మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించినా ఒక విషయం మాత్రం హర్మన్‌ సేనను కలవరపెడుతోంది. అదే బ్యాటింగ్‌ సమస్య. ఓపెనర్‌ షెఫాలీ వర్మ (29, 39, 46) మినహా ఏ బ్యాట్స్‌వుమెన్‌ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. లంకతో మ్యాచ్‌ ఎలా ఆడినా.. సెమీస్‌లో మెరుగైన బ్యాటింగ్‌ చేయడం అవసరం. లేని పక్షంలో భంగపాటు ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.


షెఫాలీ మెరిసినా.. సీనియర్లు విఫలం

తొలి మ్యాచ్‌లో 132 పరుగులే చేసి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను చిత్తుచేసిన టీమ్‌ఇండియా, రెండో మ్యాచ్‌లో పొరుగు దేశం బంగ్లాపై 142 పరుగులు చేసి విజయం సాధించింది. ఇక గురువారం న్యూజిలాండ్‌తో మూడో మ్యాచ్‌లో 133 పరుగులే చేసినా ఉత్కంఠపోరులో చివరి బంతికి గెలుపొందింది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌ షెఫాలీ మెరిసినా టీమ్‌ఇండియా తక్కువ స్కోర్లే చేసింది. బౌలర్లు సమష్టిగా చెలరేగి జట్టుకు విజయాల్ని అందించారు. ఓపెనర్‌ స్మృతి మంధాన, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌వుమెన్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌కౌర్‌, వేదాకృష్ణమూర్తి లాంటి సీనియర్లు తమ బ్యాట్లకు పనిచెప్పాల్సిన అవసరముంది. ఈ ముగ్గురూ ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో కనీస స్కోర్లు చేయలేకపోయారు. శ్రీలంకతో మ్యాచ్‌ నామమాత్రమే కాబట్టి భారత బ్యాటర్లు స్వేచ్ఛగా చెలరేగాలి. ఇక్కడ రాణిస్తే.. సెమీస్‌, ఫైనల్లో మెరిసే అవకాశముంటుంది. లేదంటే గతేడాది వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీసేనకు సెమీస్‌లో ఎదురైనా సమస్యే మరోసారి పునరావృతం అయ్యే అవకాశం లేకపోలేదు. 


చెలరేగుతున్న బౌలర్లు

మరోవైపు భారత బౌలర్లు నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇప్పటివరకూ టోర్నీలో వీరిదే అత్యుత్తమ ప్రదర్శన. మరీ ముఖ్యంగా స్పిన్నర్లు పూనమ్‌ యాదవ్‌, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌ అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రత్యర్థులను పరుగులు చేయకుండా కట్టడి చేస్తున్నారు. వీరికి తోడు పేసర్‌ శిఖా పాండే కీలకంగా బౌలింగ్‌ చేస్తూ జట్టు విజయాల్లో తన వంతు కృషి చేస్తోంది. మిగతా మ్యాచ్‌ల్లోనూ వీరు ఇలాగే కొనసాగితే భారత మహిళలు తమ కలను సాకారం చేసుకుంటారు.

ఇంటర్నెట్‌డెస్క్‌, ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.