French Open: జకోవిచ్‌కే కోచింగ్‌ ఇచ్చిన కుర్రాడు!
close

తాజా వార్తలు

Published : 14/06/2021 13:33 IST

French Open: జకోవిచ్‌కే కోచింగ్‌ ఇచ్చిన కుర్రాడు!

వ్యూహాలు చెబుతూ ప్రేరణనిచ్చాడన్న నొవాక్‌

(ఫైనల్‌ గెలిచాక ఓ కుర్రాడితో మాట్లాడుతున్న జకో)

ఇంటర్నెట్‌ డెస్క్‌: రొలాండ్‌ గారోస్‌లో ఓ యువ అభిమాని ముచ్చట తీర్చాడు నొవాక్‌ జకోవిచ్‌. మ్యాచ్‌ సాంతం ఉత్సాహ పరిచిన ఆ కుర్రాడికి తన రాకెట్‌ను బహుమతిగా ఇచ్చాడు. నిజానికి ఆ కుర్రాడు తనకు కోచింగ్‌ ఇచ్చాడని తెలిపాడు. అతడి వల్లే విజేతగా నిలవడంతో కృతజ్ఞత చూపించానని వెల్లడించాడు!

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో హోరాహోరీగా సాగిన ఫైనల్లో 6-7 (6/8), 2-6, 6-3, 6-2, 6-4తో స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ను ఓడించాడు నొవాక్‌. తొలిరెండు సెట్లు చేజారినా.. సిట్సిపాస్‌ జోరుమీదున్నా.. భలేగా పుంజుకున్నాడు. సుదీర్ఘ ర్యాలీలతో మూడో సెట్‌ గెలిచిన అతడు మ్యాచ్‌లో నిలబడ్డాడు. తర్వాతి రెండు సెట్లను వరుసగా కైవసం చేసుకొని రెండోసారి విజేతగా ఆవిర్భవించాడు. ఓపెన్‌ శకంలో అన్ని గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు రెండుసార్లు అందుకున్న ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

నిజానికి మ్యాచ్‌ సాంతం స్టాండ్స్‌లోని ఆ కుర్రాడు తనకెంతో మద్దతుగా నిలిచాడని నొవాక్‌ అన్నాడు. కోచింగ్‌ ఇస్తూ వ్యూహాలు చెబుతూ తనలో ప్రేరణ నింపినట్టుగా అనిపించిందని పేర్కొన్నాడు. ఆ రాకెట్‌ అందుకొనేందుకు అతడు అర్హుడిగా భావించానని తెలిపాడు.

‘మ్యాచ్‌ పూర్తయ్యేంత వరకు అతడి మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నేను వరుసగా రెండు సెట్లు ఓడినప్పుడు అతడు నన్ను ప్రోత్సహించాడు. నిజానికి అతడు కొన్ని వ్యూహాలు సైతం చెప్పాడు. సర్వీస్‌ నిలబెట్టుకో, తొలి బంతిని సులభంగా ఆడు, ఆ తర్వాత ఆధిపత్యం వహించు.. సిట్సిపాస్‌కు బ్యాక్‌హాండ్‌ ఇవ్వు అంటూ కోచింగ్‌ ఇచ్చాడు. ఇది నాకు ముద్దుగా అనిపించింది. అందుకే మ్యాచ్‌ తర్వాత రాకెట్‌ ఇచ్చేందుకు అతడే అర్హుడని అనిపించింది. నాకు మద్దతిచ్చినందుకు అతడి పట్ల కృతజ్ఞత చాటుకున్నా’ అని జకోవిచ్‌ అన్నాడు. రాకెట్‌ అందుకోగానే ఆ కుర్రాడు పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. ఆనందంతో ఎగిరి గంతులేశాడు!




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని