
తాజా వార్తలు
టెస్టు ఛాంపియన్షిప్: భారత్ పరిస్థితేంటి?
ఇంటర్నెట్‌డెస్క్: ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం సాధించడం, పాకిస్థాన్‌ను న్యూజిలాండ్ చిత్తుగా ఓడించడం, శ్రీలంకపై ఇంగ్లాండ్ తొలి టెస్టు గెలవడంతో సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. జూన్‌లో లార్డ్స్ మైదానంలో జరగనున్ను ఫైనల్‌కు ఏ రెండు జట్లు అర్హత సాధిస్తాయని అందరిలోనూ ఉత్కంఠ పెరిగింది. ఈ నేపథ్యంలో ఏ జట్టుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చూద్దాం..
టాప్‌లో భారత్
కరోనా కారణంగా కొన్ని టెస్టులు, సిరీస్‌లు రద్దవ్వడంతో ఫైనల్‌కు విజయాల శాతం ఆధారంగా ఎంపిక చేస్తామని ఐసీసీ తెలిపింది. అంతకుముందు పాయింట్ల ఆధారంగా ఎంపిక చేస్తారని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే గెలుపుశాతం అని ప్రకటించడంతో టీమిండియాకు క్లిష్టపరిస్థితులు ఎదురయ్యాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సిరీస్‌ల్లో అధిక విజయాలు సాధించాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఆసీస్‌పై అద్భుత ప్రదర్శనతో 2-1తో సిరీస్ గెలవడంతో భారత్ గెలుపుశాతం 71.7కి చేరింది. పట్టికలో టాప్‌లో నిలిచింది.
కానీ, ఫైనల్‌కు చేరాలంటే ఇంగ్లాండ్‌తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ భారత్‌కు కీలకం. ఇంగ్లాండ్‌పై 4-0, 3-0, 3-1 లేదా 2-0తో విజయం సాధిస్తే టీమిండియా అర్హత సాధిస్తుంది. ఆ సిరీస్ స్వదేశంలోనే జరగనుండంతో కోహ్లీసేన తప్పక గెలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ చేతిలో 0-3, 0-4తో ఓటమిపాలైతే టెస్టు ఛాంపియన్షిప్ రేసు నుంచి టీమిండియా ఔట్ అవుతుంది.
కివీస్ వెయింటింగ్
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ గురించి ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్ మ్యాచ్‌లు ముగిశాయి. స్వదేశంలో పాకిస్థాన్‌ను చిత్తు చేయడంతో కివీస్ 70 విజయశాతంతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. అయితే గెలుపు శాతం మెరుగ్గా ఉన్నా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా ఆడనున్న మ్యాచ్‌లపై కివీస్ అర్హత ఆధారపడి ఉంది. ఇంగ్లాండ్ అయిదు మ్యాచ్‌ల్లో (శ్రీలకం-1, భారత్-4), ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 3-0 లేదా 2-0తో పైచేయి సాధిస్తే న్యూజిలాండ్ అవకాశాలు దెబ్బతింటాయి. దీంతో ఆ మ్యాచ్‌లు ముగిసేవరకు కివీస్ వెయిట్ చేయాల్సిందే.
ఆసీస్ ముందు సఫారీల సవాల్
పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 69.2%తో మూడో స్థానంలో ఉంది. భారత్ దెబ్బకి టాప్‌లో ఉన్న ఆసీస్ మూడో స్థానానికి పడిపోయింది. అయితే ఫైనల్‌కు చేరుకోవడానికి కంగూరూలకు అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టెస్టుల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు విజయం సాధిస్తే తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. అయితే ఆ సిరీస్‌లో ఓటమి చవిచూడకూడదు. కాగా, సఫారీలు సిరీస్‌ను గెలిస్తే..ఆసీస్ పోరాటానికి ముగింపు పలికనట్లే.
నాలుగో స్థానంలో ఇంగ్లాండ్
65.2 శాతంతో ఇంగ్లాండ్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. శ్రీలకంతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించి, భారత్‌తో జరగనున్న సిరీస్‌లో 3-0, 4-0తో గెలిస్తే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
పోటీలోనే ఉన్న దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా 40 శాతంతో అయిదో స్థానంలో ఉన్నప్పటికీ ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పాకిస్థాన్, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించాలి. ఆ తర్వాత ఇతర జట్ల ఫలితాలపై అవకాశం ఆధారపడి ఉంటుంది. మరోవైపు పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాయి.