Womens Cricket: రెండో వన్డేలో ఉత్కంఠ పోరు.. ఆఖరి బంతికి భారత్‌పై ఆసీస్ విజయం

తాజా వార్తలు

Updated : 24/09/2021 20:09 IST

Womens Cricket: రెండో వన్డేలో ఉత్కంఠ పోరు.. ఆఖరి బంతికి భారత్‌పై ఆసీస్ విజయం

మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కోల్పోయిన టీమిండియా

మెకాయ్‌: అయ్యో.. టీమిండియా మహిళల జట్టుకు అదృష్టం కలిసొచ్చినట్లు లేదు. మ్యాచ్‌లో చివరి బంతి వరకు దోబూచులాడిన విజయం ఆఖరుకు ప్రత్యర్థినే వరించింది. ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్‌ సరిగ్గా 50 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని (275 పరుగులు) అతి కష్టంమీద ఛేదించగలిగింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ ఉండగానే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో టీమిండియాపై ఆసీస్‌ తొమ్మిది వికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆఖరి వన్డే మ్యాచ్‌ ఆదివారం జరగనుంది. దీంతో వరుసగా మూడో సిరీస్‌ను భారత్‌ కోల్పోవడం గమనార్హం. ఇంతకుముందు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ చేతుల్లో మిథాలీ సేన పరాజయం పాలైంది. 

సెంచరీ బాదిన మూనీ

భారత్‌ నిర్దేశించిన 275 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ హీలే (0)ను గోస్వామి బౌల్డ్‌ చేసింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వెనుదిరిగినా మరో ఓపెనర్ బేత్‌ మూనీ (125*) చివరి వరకు క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆసీస్‌కు అపూర్వ విజయాన్ని అందించింది. లానింగ్ (6), పెర్రీ (2), గార్డెనర్ (12) విఫలమయ్యారు. తహలియా మెక్‌గ్రాత్‌ (74) అండతో మూనీ ఇన్నింగ్స్‌ను నిర్మించింది. మెక్‌గ్రాత్‌ ఔటైన తర్వాత వచ్చిన క్యారీ (39*)తో కలిసి మూనీ జట్టును విజయ తీరాలకు చేర్చింది. భారత బౌలర్లలో గోస్వామి, మేఘనా సింగ్‌, పూజా, దీప్తి శర్మ తలో వికెట్‌ పడగొట్టారు.

రాణించిన మంధాన

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన మిథాలీసేనకు శుభారంభమే దక్కింది. ఓపెనర్ స్మృతి మంధాన (88), షఫాలీ వర్మ (22) తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. స్వల్ప వ్యవధిలో షఫాలీతోపాటు మిథాలీ (8), భాటియా (3) పెవిలియన్‌కు చేరడంతో టీమిండియా కష్టాల్లో పడింది. అయితే రిచా ఘోష్‌ (44)తో కలిసి మంధాన ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. రిచా, మంధాన ఔటైన తర్వాత వచ్చిన బ్యాటర్లు దీప్తి శర్మ (23), పూజా (29), గోస్వామి (28) ఫర్వాలేదనిపించడంతో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో మెక్‌గ్రాత్ 3, మోలినెక్స్ 2, బ్రౌన్ ఒక వికెట్‌ తీశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని