
తాజా వార్తలు
భారత్ లక్ష్యం 328
చెలరేగిన సిరాజ్, శార్దూల్
ఇంటర్నెట్‌డెస్క్: బ్రిస్బేన్ వేదికగా భారత్×ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని టీమిండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మహ్మద్ సిరాజ్ (5/73), శార్దూల్ ఠాకూర్ (4/61) సత్తాచాటారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లో స్టీవ్ స్మిత్ (55), వార్నర్ (48) టాప్ స్కోరర్లు. అయితే, భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నప్పటికీ ఆసీస్ వేగంగా పరుగులు సాధించి ఆధిక్యాన్ని పెంచుకుంది.
ఓవర్‌నైట్ స్కోరు 21/0తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (48), హ్యారిస్ (38) తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. అయితే భారత బౌలర్లు పుంజుకుని వరుస ఓవర్లలో ఓపెనర్లను పెవిలియన్‌కు పంపించారు. తర్వాత క్రీజులోకి వచ్చిన లబుషేన్ (25), స్మిత్ వేగంగా పరుగులు సాధిస్తూ తమ ఉద్దేశాన్ని చెప్పారు. కానీ సిరాజ్ ఒకే ఓవర్లో లబుషేన్, వేడ్ (0)ను ఔట్ చేసి ఆసీస్‌ను దెబ్బతీశాడు. దీంతో ఆసీస్ లంచ్ విరామానికి ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేసింది.
అనంతరం గ్రీన్ (37)తో కలిసి స్మిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అయిదో వికెట్‌కు 73 పరుగులు జోడించాడు. అయితే అర్ధశతకం సాధించిన స్మిత్‌ను సిరాజ్ ఔట్ చేయడంతో ఆసీస్ వికెట్ల పతనం మొదలైంది. అయితే క్రీజులోకి వచ్చిన వాళ్లంతా బ్యాటు ఝుళిపిస్తూ స్కోరు సాధించారు. కాగా, సిరాజ్ తన టెస్టు కెరీర్లో ఉత్తమ గణాంకాలు అందుకున్నాడు.
ఇదీ చదవండి
చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్