
తాజా వార్తలు
సమయం కోసం వేచిచూశా: అక్షర్ పటేల్
(Pic:BCCI Twitter)
ఇంటర్నెట్‌డెస్క్: ఇంగ్లాండ్‌తో జరిగిన పింక్‌బాల్ టెస్టులో అక్షర్ పటేల్ 11/70 అత్యుత్తమ ప్రదర్శన చేయడం ద్వారా తన రెండో టెస్టులోనే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. ఇదంతా ఆత్మవిశ్వాసంతోనే సాధ్యమైందని గుజరాత్ ఆల్‌రౌండర్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు అనంతరం టీమ్ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా పటేల్ పలు విషయాలు పంచుకున్నాడు. మూడేళ్లుగా తాను టీమ్ఇండియాకు దూరంగా ఉన్నానని, ఆ సమయంలో తన ఆటలో మెరుగుపడాల్సిన అంశాలపై దృష్టిసారించానని చెప్పాడు.
‘నేను టీమ్ఇండియాకు మూడేళ్లుగా దూరంగా ఉన్నా. ఆ సమయంలో నా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలపై బాగా కష్టపడ్డా. అదే సమయంలో జట్టుకు దూరంగా ఉండటంపై స్నేహితులు, తెలిసిన వాళ్లు అనేక మంది అడిగేవారు. బాగా ఆడుతున్నా టీమ్ఇండియాలో ఎందుకు లేవని ప్రశ్నించేవాళ్లు. అవి నిత్యం నాకు గుర్తుకొచ్చేవి. అలాంటప్పుడే సరైన సమయం కోసం వేచి చూడాలని నాకు నేను సర్దిచెప్పుకొన్నా. ఎప్పుడు అవకాశం వచ్చినా 100 శాతం అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉండాలనుకున్నా’ అని అక్షర్ తన అనుభవాలను గుర్తుచేసుకున్నాడు.
ఇక పాండ్య టెస్టు క్రికెట్ ఆడటం తేలికేనా అని అడిగిన ప్రశ్నకు.. అక్షర్ ఇలా చెప్పుకొచ్చాడు. ‘నన్ను ఈ ప్రశ్న చాలా మంది వేశారు. అన్నీ మనకు అనుకూలంగా జరుగుతున్నప్పుడు బాగుంటుంది. కానీ ఏదైనా అవకాశం చేజారితే.. అసలు పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది’ అని స్పష్టంగా తన ఆలోచనా విధానాన్ని బయటపెట్టాడు. ఇక ఈ పింక్‌బాల్ టెస్టు తనకు రెండోదని, మొతేరాలో తొలిదని అక్షర్ పేర్కొన్నాడు. సొంత మైదానంలో అభిమానుల ముందు అత్యుత్తమ ప్రదర్శన చేయడం ప్రత్యేకంగా ఉందన్నాడు. ఇక రాబోయే మ్యాచ్‌లోనూ ఇలాగే మరిన్ని వికెట్లు తీయాలని ఉందన్నాడు. కాగా, ఇంటర్వ్యూ మధ్యలో కెప్టెన్ విరాట్ కోహ్లీ కలగజేసుకొని.. ‘బాపూ నీ బౌలింగ్ అద్భుతంగా ఉంది’ అని గుజరాతీలో కొనియాడాడు.