ఆఖరి అంకం: చావో.. రేవో!

తాజా వార్తలు

Updated : 19/03/2021 17:20 IST

ఆఖరి అంకం: చావో.. రేవో!

సిరీస్‌పై కన్నేసిన కోహ్లీ, మోర్గాన్‌

ఐదు టీ20ల సమరం ఆఖరి అంకానికి చేరుకుంది. నువ్వా నేనా అన్నట్టు సాగిన సిరీస్‌ 2-2తో సమమైంది. ఉత్కంఠంగా మారిన నిర్ణయాత్మక నాలుగో టీ20లో కోహ్లీసేన విజయ దుందుభి మోగించింది. చివరి టీ20పై ఆసక్తిని అమాంతం పెంచేసింది. ‘స్వేచ్ఛగా-నిర్భయంగా’‌ వ్యూహంతోనే ఇంగ్లాండ్‌పై సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.


లక్ష్యం ‘మెగాటోర్నీ’

సొంతగడ్డపై జరిగే టీ20 ప్రపంచకప్‌నకు జట్టును సిద్ధం చేసుకొనే లక్ష్యంతోనే టీమ్‌ఇండియా ఈ సిరీస్‌ ఆడింది. కొత్తవాళ్లతో ప్రయోగాలు చేపట్టింది. కీలక బృందాన్ని పరీక్షించింది. జట్టు కూర్పు, మేళవింపు, సమతూకం ఎలావుందో పరిశీలించింది. కుర్రాళ్ల కోసం స్వయంగా విరాట్‌ తన స్థానాన్ని త్యాగం చేశాడు. ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ను మూడో స్థానంలో దించాడు. తగిన ఫలితం రాబట్టాడు. విఫలమవుతున్నా సరే రాహుల్‌పై నమ్మకం ఉంచాడు. పంత్‌ను నాలుగో స్థానంలో ఆడించాడు. శ్రేయస్‌ను మిడిలార్డర్‌కు పంపించాడు. అందుకే ఐదో టీ20లోనూ టీమ్‌ఇండియా గెలుపోటములతో సంబంధం లేకుండా బరిలోకి దిగనుంది.


‘ఫైర్‌’ దొరికింది

కొంత కాలంలో టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు తరచూ ఓటమి పాలవుతోంది. ప్రత్యర్థికి భారీ లక్ష్యాలను నిర్దేశించలేకపోతోంది. ఇంగ్లాండ్‌ సిరీస్‌లోనూ అంతే. ఒకటి, మూడో టీ20లో ఓటమి పాలైంది. కొంతవరకు దీనికి పరిష్కారం లభించినట్టైంది. ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌ జట్టుకు ఎక్స్‌-ఫ్యాక్టర్‌గా మారారు. ప్రత్యర్థి బౌలర్‌ ఎంతటివారైనా నిర్భయంగా బంతిని బౌండరీకి పంపించడమే వీరి శైలి. ఫలితంగా భారత జట్టు బ్యాటింగ్‌ డెప్త్‌ పెరిగిందని కోహ్లీ అంటున్నాడు. ‘తొలిమ్యాచ్‌లోనే మూడో స్థానంలో ఆడటం సులువు కాదు. సూర్యను చూసి మేం అవాక్కయ్యాం. అతడు ఆధిపత్యం చెలాయిస్తూ శ్రేయస్‌, హార్దిక్‌, పంత్‌ స్వేచ్ఛగా ఆడేందుకు సాయం చేశాడు. కుర్రాళ్లకు నేను అభిమానిని’ అని అన్నాడు.


రాహుల్‌, రోహిత్‌ బాకీ

బ్యాటింగ్‌ పరంగా టీమ్‌ఇండియాకు తిరుగులేదు! దూకుడైన టాప్‌ ఆర్డర్‌ ఉంది. కానీ ఇంగ్లాండ్‌ పేసర్ల ధాటికి మాత్రం విలవిల్లాడింది. ఇందుకు జట్టు యాజమాన్యం పరిష్కారం కనుగొంది. ఏ బౌలర్‌పై దాడికి దిగాలో ముందుగానే నిర్ణయించుకొని ఎదురుదాడి చేస్తోంది. మూడో టీ20లో ఇదే కనిపించింది. ఆటగాళ్లు బౌండరీతోనే పరుగుల ఖాతా ఆరంభించేందుకు ప్రయత్నించారు. రాహుల్‌ కాస్త ఆత్మవిశ్వాసం సాధించినట్టే కనిపించాడు! ఏదేమైనా రోహిత్‌, రాహుల్‌ భారీ ఇన్నింగ్సులు బాకీ పడ్డారు. కోహ్లీ, సూర్య, పంత్‌, శ్రేయస్‌ ఫామ్‌లో ఉన్నారు. హార్దిక్ ‌పాండ్య మెరుపులు పెరగాలి. ఆఖరి టీ20లో ఆల్‌రౌండర్‌ రాహుల్‌ తెవాతియా అరంగేట్రం చేసే అవకాశముంది. ఇంగ్లాండ్‌ వైపు విధ్వంకర బ్యాటర్లున్న సంగతి తెలిసిందే. కానీ జేసన్‌ రాయ్‌, డేవిడ్‌ మలన్‌, బెయిర్‌ స్టో, మోర్గాన్‌ అర్ధశతకాలు చేయలేదు. వీరంతా చెలరేగాలని భావిస్తున్నారు.


వికెట్లూ తీయాలి

ఉపఖండం పిచ్‌లపై ఇంగ్లాండ్‌ ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగడం విస్మయం కలిగిస్తోంది. మరోవైపు టీమ్‌ఇండియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల వ్యూహం అనుసరిస్తోంది. మార్క్‌వుడ్‌, ఆర్చర్‌, జోర్డాన్‌ భీకరమైన వేగంతో బంతులు వేస్తూ ఆ జట్టును ఆదుకుంటున్నారు. కోహ్లీసేనలో భువీ, శార్దూల్‌, సుందర్‌ ఫర్వాలేదనిపిస్తున్నారు. హార్దిక్‌ పూర్తి స్థాయిలో వీరికి అండగా ఉంటున్నాడు. కానీ వికెట్లు తీయడంలో కొన్నిసార్లు సమష్టిగా వెనకడుగు వేస్తున్నారు. పరుగులు నియంత్రిస్తున్న భువీ వికెట్లూ తీస్తే బాగుంటుంది. హార్దిక్‌ బంతితో మరింత బాధ్యత తీసుకోవాలి. రాహుల్‌ చాహర్‌ ఫర్వాలేదనిపించాడు. చాహల్‌ ఫామ్‌ తెచ్చుకోవాలి. రాహుల్‌ తెవాతియా ఏం చేస్తాడో చూడాలి!

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని