
తాజా వార్తలు
కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగిస్తే..!
టీమ్ఇండియా సంస్కృతి నాశనం అవుతుందన్న బ్రాడ్‌హగ్
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా సారథ్య బాధ్యతల నుంచి విరాట్‌ను తప్పించడం మంచిది కాదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్‌హగ్ అన్నాడు. అలా చేయడం భారత సంస్కృతిని నాశనం చేస్తుందని పేర్కొన్నాడు. కెప్టెన్సీ నుంచి తొలగిస్తే విరాట్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని వెల్లడించాడు. ఆసీస్‌పై 2-1 తేడాతో విజయం సాధించిన తర్వాత రహానెకు సారథ్యం అప్పగించాలన్న వ్యాఖ్యలపై అతడు స్పందించాడు.
గతేడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా చేరుకున్న భారత జట్టు వన్డే సిరీసును కోల్పోయింది. ఆ తర్వాత టీ20 సిరీసులో విజయం సాధించింది. ఇక సుదీర్ఘ ఫార్మాట్లోనైతే అద్భుతాలే చేసింది. గులాబి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకు ఆలౌటైన టీమ్ఇండియా ఆ తర్వాత 2-1తో సిరీసు గెలిచింది. పితృత్వ సెలవుల్లో విరాట్ స్వదేశానికి తిరిగి వస్తే మూడు టెస్టులకు అజింక్య రహానె సారథ్యం వహించాడు. సీనియర్ బౌలర్లు గాయపడ్డా జట్టును చక్కగా ముందుకు నడిపించాడు. సమయోచితంగా మార్పులు చేస్తూ ఆకట్టుకున్నాడు. ఘోర ఓటమి కోరల్లోంచి బయటపడి జట్టును విజయతీరాలకు చేర్చిన అజింక్యకు సుదీర్ఘ ఫార్మాట్ బాధ్యతలు అప్పగించాలని వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
‘కెప్టెన్‌గా ఉంటే విరాట్ కోహ్లీ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తాడు. అతడిని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పిస్తే టీమ్ఇండియా సంస్కృతిని నాశనం చేసినట్టు అవుతుంది. అది కోహ్లీ బ్యాటింగ్ పైనా ప్రతికూల ప్రభావం చూపొచ్చు. ఇలా జరగాలని అతడు కోరుకోకపోవచ్చు కానీ, అలా జరిగే అవకాశాల్ని కొట్టిపారేయలేం’ అని బ్రాడ్‌హగ్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.
ఇవీ చదవండి
జీవితంలో ఎప్పుడూ ఇలాంటి జట్టు చూడలేదు
36 ఆలౌట్: ఆ అర్ధరాత్రి ఏం జరిగిందంటే!