2021 చెన్నై చెయ్యాల్సిందేమిటి? 
close

తాజా వార్తలు

Updated : 03/04/2021 12:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2021 చెన్నై చెయ్యాల్సిందేమిటి? 

గతేడాది పూర్తిగా విఫలమైన ధోనీసేన..

(Photo: CSK Twitter)

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఒకటి. ముంబయి ఇండియన్స్‌ తర్వాత అత్యధిక టైటిళ్లు సాధించిన ఏకైక జట్టు‌. మెగా లీగ్‌ ఆరంభ సీజన్‌ నుంచి ఏటా కనీసం ప్లేఆఫ్స్‌ చేరిన నిలకడైన టీమ్‌. కానీ, గతేడాదే దారుణ ఫలితాలు చవిచూసి చతికిల పడింది. ఐపీఎల్‌లో ఎన్నడూ లేనివిధంగా ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే 14వ సీజన్‌లో తిరిగి పూర్వ వైభవాన్ని సాధించాలంటే ధోనీసేన ఏం చేయాలి. దాని ముందున్న సవాళ్లు, అవకాశాలు ఏమిటి?


చిన్న తలా చేరిక..

(Photo: CSK Twitter)

గతేడాది వ్యక్తిగత కారణాలతో సురేశ్‌ రైనా లాంటి కీలక ఆటగాడు జట్టుకు దూరమయ్యాడు. దాంతో బ్యాటింగ్‌ విభాగం పూర్తిగా తేలిపోయింది. దానికి తోడు టాప్‌ఆర్డర్‌లో సరైన బ్యాటింగ్‌ కాంబినేషన్‌ కరవై ఇబ్బందులు పడింది. ఆపై కొత్తగా వచ్చిన రుతురాజ్‌ గైక్వాడ్‌ మొదట విఫలమైనా తర్వాత ఫర్వాలేదనిపించాడు. దాంతో ఈసారి డుప్లెసిస్‌తో కలిసి అతడు బాగా ఆడతాడనే నమ్మకంతో ఉంది సీఎస్కే. ఓపెనర్ల తర్వాత రైనా ఎంతటి విలువైన బ్యాట్స్‌మెనో అందరికీ తెలిసిందే. ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అలాంటి రైనా మళ్లీ పచ్చ జెర్సీ తొడిగాడంటే చెన్నైకు పరుగుల పండగే. తర్వాత వచ్చే అంబటిరాయుడు, ధోనీ, రవీంద్ర జడేజా, సామ్‌కరన్‌ భారీ స్కోర్లు చేయగలిగితే సీఎస్కేకు తిరుగుండదు.


ఏజ్‌బార్‌ ఆటగాళ్లు..

(Photo: CSK Twitter)

సీఎస్కేకు ఇప్పటివరకు ప్రధాన బలం అనుభవజ్ఞులు కలిగిన ఆటగాళ్లు ఉండటమే. ధోనీలాంటి అత్యుత్తమ సారథి నేతృత్వంలో ఆ జట్టు ఎన్నో ఘన విజయాలు సాధించింది. అందులో వయసుపైబడిన ఆటగాళ్ల ప్రదర్శనే కీలకం. దాంతో దీనికి ‘డాడీస్‌ టీమ్‌‌’ అనే ప్రత్యేక గుర్తింపు దక్కింది. అయితే, వీళ్లే ఇప్పుడా జట్టుకు భారంగా మారారు. మునుపటిలా వేగంగా ఆడలేకపోతున్నారు. అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్నారు. కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ సైతం గత సీజన్‌లో సరిగా హిట్టింగ్‌ చేయలేకపోయాడు. అత్యుత్తమ మ్యాచ్‌ ఫినీషర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న అతడే సరిగ్గా ఆడకపోతే ఇక మిగిలిన ఆటగాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


గాయాల బెడద..

(Photo: CSK Twitter)

మరోవైపు చెన్నైలో రవీంద్ర జడేజా, డ్వేన్‌బ్రావోలాంటి ఆల్‌రౌండర్లు ఎంత ముఖ్యమైన ఆటగాళ్లో మనకు తెలిసిందే. స్పిన్‌పిచ్‌ అయితే జడ్డూ, ఫాస్ట్‌ పిచ్‌ అయితే బ్రావో ప్రధాన బౌలర్లకు ఏమాత్రం తీసిపోరు. వాళ్లతో పోటీపడి మరీ వికెట్లు తీస్తారు. అలాగే బ్యాటింగ్‌లోనూ తమదైన ముద్ర వేశారు. జట్టు విజయాల్లో ఎన్నో సందర్భాల్లో విలువైన పరుగులు సాధించారు. అయితే, ఈ సీజన్‌కు ముందు వారిద్దరూ గాయాలబారిన పడటమే ఇప్పుడా జట్టును కంగారు పెట్టించే విషయాలు. ప్రస్తుతం జడ్డూ, బ్రావో కోలుకున్నా రాబోయే మెగా ఈవెంట్‌లో ఎలా ఆడతారో చూడాలి. ఒకవేళ పూర్తిగా కోలుకొని మునుపటిలా మంచి ప్రదర్శన చేస్తూ ఆడితే ఫర్వాలేదు. కానీ, గాయాలు తిరగబెడితే మాత్రం సీఎస్కేకు కష్టాలు తప్పకపోవచ్చు.


ముందున్న సవాళ్లు..

(Photo: CSK Twitter)

గతేడాది చెన్నై వైఫల్యానికి ముఖ్య కారణం బ్యాటింగ్‌ వైఫల్యమే. ఇప్పుడు దాన్ని అధిగమించాలంటే.. సీజన్‌ ఆరంభం నుంచే టాప్‌ ఆర్డర్‌ రాణించాలి. లేదంటే మరోసారి చతికిల పడక తప్పదు. అయితే ఈసారి ట్రేడింగ్‌ పద్ధతిలో చెన్నై.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రాబిన్‌ ఉతప్పను తీసుకుంది. అతడిని ఎక్కడ ఆడిస్తుందో తెలియని పరిస్థితి. మరోవైపు టెస్టు బ్యాట్స్‌మన్‌ చెతేశ్వర్‌ పుజారాను వేలంలో కొనుగోలు చేసింది. సహజంగా పుజారా ధాటిగా ఆడకపోయినా చెన్నై అతడిని కొనుగోలు చేసిందంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అదేంటో తెలియాల్సి ఉంది. ఇక బౌలింగ్‌ విభాగంలో దీపక్‌ చాహర్‌, సామ్‌కరన్‌, బ్రావో, లుంగి ఎన్గిడి, మిచెల్‌ శాంట్నర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మోయిన్‌ అలీ, రవీంద్ర జడేజా, కృష్ణప్పగౌతమ్‌ లాంటి ఆటగాళ్లతో పేపర్‌ మీద బలంగా ఉంది. కానీ, ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు తటస్థ వేదికల్లో జరుగుతుండడంతో పిచ్‌ను బట్టి బౌలర్లను ఎంచుకునే పరిస్థితి ఏర్పడింది. దాంతో తుది జట్టులో ఎవరుంటారనేది కీలకంగా మారనుంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని