ఇంగ్లాండ్‌పై కోహ్లీసేన కొత్త మంత్రం!

తాజా వార్తలు

Published : 16/03/2021 01:24 IST

ఇంగ్లాండ్‌పై కోహ్లీసేన కొత్త మంత్రం!

‘స్వేచ్ఛగా.. భయం లేకుండా’ వ్యూహం అమలు

(Images : BCCI)

అహ్మదాబాద్‌: టీమ్‌ఇండియా మళ్లీ గెలుపుబాట పట్టింది. రెండో టీ20లో ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఒకవైపు కుర్రాళ్లు చెలరేగడం మరోవైపు కెప్టెన్‌ కోహ్లీ ఫామ్‌ అందుకోవడం జట్టులో ఆత్మవిశ్వాసం నింపింది. ప్రపంచ నంబర్‌వన్‌ జట్టుపై సిరీస్‌ను కైవసం చేసుకొనేందుకు కోహ్లీసేన ‘స్వేచ్ఛగా.. నిర్భయంగా’ అనే వ్యూహాన్ని అమలు చేయనుంది. మూడో టీ20లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం పెంచుకోవాలన్న పట్టుదలతో కనిపిస్తోంది.


కుర్రాళ్ల దూకుడు

మొదటి టీ20లో తేలిపోయిన కోహ్లీసేన రెండో మ్యాచులో అన్ని విభాగాల్లో అదరగొట్టింది. టర్నింగ్‌ బంతులు, ఇన్‌స్వింగర్లు, నెమ్మది బంతులతో తొలుత బౌలర్లు ఆంగ్లేయులను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ఫీల్డింగ్‌ను మెరుగు పర్చుకున్నారు. ఆ తర్వాత ఛేదనలో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ విఫలమైనా అరంగేట్రం కుర్రాడు ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 56) దంచికొట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్లో మరిన్ని పరుగులు చేయలేకపోయిన కెప్టెన్‌ కోహ్లీ తిరిగి గర్జించాడు. మునుపటిలా దూకుడుగా ఆడాడు. భావోద్వేగాలు ప్రదర్శించాడు.


రంగంలోకి హిట్‌మ్యాన్‌

తొలి రెండు మ్యాచులకు విశ్రాంతి తీసుకున్న హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ తిరిగి జట్టులోకి రానున్నాడు! మరి అతడికి చోటిచ్చేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అర్ధశతకాలు చేసిన కిషన్‌, శ్రేయస్‌ను తప్పించే పరిస్థితి లేదు. నాలుగో స్థానానికి ప్రమోటైన రిషభ్‌ పంత్‌ను తీసేయలేరు. జట్టుకు అతడు ఎక్స్‌ ఫ్యాక్టర్‌. ప్రపంచకప్‌లో కీలకమవుతాడని భావిస్తోంది. విధ్వంసకరంగా ఆడుతూ మ్యాచుల్ని మలుపు తిప్పగల పంత్‌ను కదలించే ఉద్దేశం జట్టు యాజమాన్యానికి లేదు. దాంతో హిట్‌మ్యాన్‌కు రాహులే దారిస్తాడని అందరి అంచనా. మున్ముందు కోహ్లీ, శ్రేయస్‌, పంత్‌ విరుచుకుపడేందుకే ప్రయత్నిస్తారు. సూర్యకుమార్‌, హార్దిక్ ‌పాండ్య సైతం సత్తా చాటాల్సి ఉంది.


స్పిన్నర్లే కీలకం

టీమ్‌ఇండియా బౌలింగ్‌ విభాగంలోనూ పెద్దగా మార్పులకు ఆస్కారం లేదు. యుజ్వేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్ కుమార్‌ కొనసాగడం ఖాయం. శార్దూల్‌ ఠాకూర్‌ సైతం బాగానే రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో దీపక్‌ చాహర్‌ మరో మ్యాచ్‌ వరకు ఎదురుచూడక తప్పదనిపిస్తోంది. రోహిత్‌శర్మ ప్రవేశం మినహా కోహ్లీసేన గెలుపు సమ్మేళనంలో మార్పులు ఉండవని అంచనా. పిచ్‌ కింద పొరలో ఎర్రమట్టి ఉండటంతో స్పిన్నర్లు బ్యాటర్లను పరీక్షిస్తారని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా మొతేరా బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో అభిమానులకు సిక్సర్ల పండగే.


రాయ్‌.. దూకుడే

మరోవైపు ఇంగ్లాండ్‌లో మార్క్‌వుడ్‌ లేకపోవడంతో బౌలింగ్‌ విభాగం కూర్పు దెబ్బతింది! గాయంతో దూరమైన అతడు ఈ మ్యాచులో ఆడతాడని మోర్గాన్‌ చెప్పాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న జేసన్‌ రాయ్‌ రెండు మ్యాచుల్లోనూ అర్ధశతకం చేజార్చుకున్నాడు. ఈ సారి ఆ బాకీ తీర్చేస్తాడని అంచనా. కెప్టెన్‌ మోర్గాన్‌, డేవిడ్‌ మలన్‌, జోస్‌ బట్లర్‌, జానీ బెయిర్‌స్టో భారీ పరుగులు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటి వరకు స్పెషలిస్టు స్పిన్నర్‌గా ఆదిల్‌ రషీద్‌ను మాత్రమే ఆడిస్తున్నారు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తున్న నేపథ్యంలో మొయిన్‌ అలీకి అవకాశం రావొచ్చు. ఏదేమైనా సిరీస్‌ 1-1తో సమం కావడంతో మూడో పోరు హోరాహోరీగా జరిగేందుకు ఆస్కారం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని