Cricket News: ఒకేరోజు దాదా, ద్రవిడ్‌, కోహ్లీ అరంగేట్రం

తాజా వార్తలు

Updated : 21/06/2021 00:39 IST

Cricket News: ఒకేరోజు దాదా, ద్రవిడ్‌, కోహ్లీ అరంగేట్రం

విరాట్‌ కోహ్లీ అరంగేట్రం చేసి నిన్నటికి పదేళ్లు

సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, విరాట్‌ కోహ్లీ.. టీమ్‌ఇండియాకు దొరికిన ఆణిముత్యాలు! ఈ ముగ్గురు మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. ఈ ముగ్గురూ భారత్‌కు సారథ్యం వహించారు. క్రికెట్లో పదివేల పరుగుల మైలురాయి దాటేశారు.  విదేశాల్లోనే టెస్టుల్లో అరంగేట్రం చేశారు. అంతకు మించిన మరో విశేషం ఏంటంటే..? ఈ ముగ్గురూ అరంగేట్రం చేసింది  ఒకే రోజు. అదే జూన్‌ 20. మరో సంగతేంటంటే కింగ్‌కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసి నేటికి పదేళ్లు.

1996, జూన్‌20న దాదా, ద్రవిడ్‌

ఎంతో మంది కలలుగన్నా లభించని అదృష్టం సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌కు దొరికింది. క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో వీరు అరంగేట్రం చేశారు. 1996, జూన్‌ 20న ఇంగ్లాండ్‌పై ఈ ద్వయం తొలి మ్యాచ్‌ ఆడింది. ఒకరు శతకం సాధించి.. మరొకరు శతకానికి చేరువై అరంగేట్రాన్ని చిరస్మరణీయంగా మార్చుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 344 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 25 పరుగులకే వికెట్‌ కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన గంగూలీ శతక విన్యాసం చేశాడు. 301 బంతులాడి 20 బౌండరీల సాయంతో 131 పరుగులు చేశాడు. లార్డ్స్‌లో అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్‌ ఓపెనర్‌ డేవాన్‌ కాన్వే బద్దలు కొట్టేంత వరకు ఆ రికార్డు సజీవంగానే ఉంది. ఇక ఏడో స్థానంలో వచ్చిన ద్రవిడ్‌ 267 బంతులాడి 95 పరుగులు చేశాడు. 6 బౌండరీలు బాదాడు. దురదృష్ట వశాత్తు శతకం ముందు ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా ఆ తర్వాత దాదా, ద్రవిడ్‌ ఎన్ని మ్యాచులు గెలిపించారో.. క్రికెట్లో ఎలాంటి రికార్డులు నెలకొల్పారో అందరికీ తెలిసిందే.

2011, జూన్‌ 20న విరాట్‌

అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిపించిన విరాట్‌ కోహ్లీ 2008లోనే పరిమిత ఓవర్ల క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తొలిటెస్టు ఆడేందుకు మాత్రం మరో రెండున్నరేళ్లు పట్టింది. 2011, జూన్‌ 20న కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేశాడు. టీమ్‌ఇండియా 63 పరుగులతో విజయం సాధించిన ఈ మ్యాచులో విరాట్‌ భారీ పరుగులేమీ చేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 10 బంతులాడి 4 పరుగులకే ఔటయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 54 బంతులాడి 15 పరుగులే చేశాడు. ఆ మ్యాచులో రాణించకున్నా.. ఆ తర్వాత పరుగుల రారాజుగా మారాడు. ఒడుదొడుకులు, అవమానాలు ఎదురైనా.. బ్యాటింగ్‌ టెక్నిక్‌తో ఇబ్బందులు పడ్డా సరిదిద్దుకున్నాడు. మ్యాచ్‌ మ్యాచ్‌కూ పాఠాలు నేర్చుకున్నాడు. దేశాలు పర్యటించే కొద్దీ అనుభవం సాధించాడు. ప్రపంచ క్రికెట్లో ‘కింగ్‌ కోహ్లీ’గా అవతరించాడు. పరుగులు చేయడమే కాకుండా సారథిగా అదరగొట్టాడు. 60 టెస్టుల్లో సారథ్యం వహించి 36 గెలిపించాడు. 14 ఓడాడు. టెస్టుల్లో టీమ్‌ఇండియా తరఫున ఇదే అత్యుత్తమ రికార్డు. వరుసగా 25 టెస్టుల్లో సారథ్యం వహించాడు. ఆదివారం నాటికి అతడు టెస్టుల్లో అడుగుపెట్టి పదేళ్లుకావడం గమనార్హం.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని