CSK సారథిగా తొలి ప్రాధాన్యం ధోనీ కాదు!

తాజా వార్తలు

Published : 12/09/2020 19:46 IST

CSK సారథిగా తొలి ప్రాధాన్యం ధోనీ కాదు!

2008లో సెహ్వాగ్‌ను కోరుకుందన్న బద్రీనాథ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యుత్తమ రెండో జట్టు చెన్నై సూపర్‌కింగ్స్‌. ఇప్పటి వరకు మూడుసార్లు ట్రోఫీ గెలిచింది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత తెలివైన, ప్రశాంతమైన సారథి ఆ జట్టు సొంతం. అయితే అరంగేట్ర ఐపీఎల్‌లో ధోనీ కాకుండా డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను సారథిగా ఎంచుకోవాలని సీఎస్‌కే యాజమాన్యం నిర్ణయించుకుందట. ఆ జట్టు మాజీ ఆటగాడు ఎస్‌.బద్రీనాథ్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ఈ విషయం చెప్పాడు.

‘2008లో చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథిగా తొలి ప్రాధాన్యం ఎంఎస్‌ ధోనీకి కాదు. నిజానికి వారు వీరేంద్ర సెహ్వాగ్‌కు నాయకత్వం అప్పగించాలని భావించారు. ఈ విషయంపై అతడిని సంప్రదించారు. దిల్లీలోనే పుట్టి పెరగడం, అనుబంధం ఉండటంతో అదే నగరానికి ఆడతానని వీరూ చెప్పాడు. అతడి అభిప్రాయంతో సీఎస్‌కే అంగీకరించింది. దాంతో సారథ్యానికి ఆటగాడు ఎవరా అని ఆలోచించింది. 2007 టీ20 ప్రపంచకప్‌ను అందించిన ధోనీని రూ.6 కోట్లు పెట్టి తీసుకుంది’ అని బద్రీనాథ్‌ చెప్పాడు.

తన ప్రకారం సీఎస్‌కే ఒక్క దెబ్బకు మూడు పిట్టల్ని కొట్టిందని బద్రీ పేర్కొన్నాడు. ‘మొదటి కారణం ఎంఎస్‌ ధోనీని మించిన సారథి లేడు. ఎందుకంటే ఐసీసీ ట్రోఫీలన్నీ గెలిచాడు. రెండోది అతడు అత్యుత్తమ మ్యాచ్‌ విజేత. టీ20ల్లో విజయాలు సాధించాలంటే మ్యాచ్‌ ఫినిషర్లు అవసరం. ముంబయి ఇండియన్స్‌లో కీరన్‌ పొలార్డ్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో ఆండ్రూ రసెల్‌ అలాంటివారే. అలా చెన్నైకి ధోనీ ఉన్నాడు. ఇక మూడోది మహీ అత్యుత్తమ వికెట్‌ కీపర్‌. ప్రపంచంలోనే చురుకైన, తెలివైన కీపర్‌ అతడు’ అని వెల్లడించాడు. సెప్టెంబర్‌ 19న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో చెన్నై తన తొలి మ్యాచులో తలపడుతున్న సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని