
తాజా వార్తలు
కుమార్తెల మధ్య బందీగా వార్నర్!
ఐవీ స్వింగ్ చూసి ఈర్ష్య కలిగిందన్న సన్‌రైజర్స్ సారథి
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ లాక్డౌన్లో అభిమానులను ఎలా మురిపించాడో అందరికీ తెలిసిందే. టిక్‌టాక్‌లో తెలుగు, హిందీ చిత్రాల పాటలకు వీడియోలు చేస్తూ దుమ్మురేపాడు. తన సతీమణి క్యాండిస్ వార్నర్‌తో కలిసి బుట్టబొమ్మ, రాములో రాములా, బ్యాంగ్‌బ్యాంగ్ వంటి పాటలకు అనుకరిస్తూ అలరించాడు.
ఇప్పుడేమో భారత్‌లో టిక్‌టాక్‌ను నిషేధించారు. అయినప్పటికీ వార్నర్ ఇతర సోషల్‌మీడియా వేదికలను ఉపయోగించుకొని అభిమానులకు కనెక్ట్ అవుతున్నాడు. తాజాగా తన కుమార్తెతో ఐవీతో కలిసి క్రికెట్ ఆడాడు. ఆమెకు బంతులు విసిరాడు. వరుసగా రెండు క్యాచులు అందుకున్న అతడు మూడో బంతికి హ్యాట్రిక్ సాధించాలనుకున్నాడు. కానీ ఐవీ అతడి ఆటలు సాగనివ్వలేదు. బంతిని లెగ్‌సైడ్ కొట్టింది.
ఇక మరో వీడియోలో ఐవీ.. గోల్ఫ్ బంతిని ఒడుపుగా కొట్టిన విధానం చూసి వార్నర్ ఆశ్చర్యపోయాడు. ఎంత అద్భుతంగా స్వింగ్ చేసిందో అని ఆనందం వ్యక్తం చేశాడు. మరోవైపు ఆ స్వింగ్ చూసి తనకు ఈర్ష్య కలిగిందని చెప్పాడు. లాక్డౌన్లో తన కుమార్తెల మధ్య బంధీ అయ్యానని సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి అంటున్నాడు. కాగా కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దాంతో మరికొన్ని రోజుల వరకు అక్కడ క్రికెట్ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు.