
తాజా వార్తలు
గబ్బా టెస్టు: రెండో రోజు ఆట రెండు సెషన్లే
టీమ్ఇండియా 26 ఓవర్లకు 62/2
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 369
బ్రిస్బేన్: బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు శనివారం రెండు సెషన్లే జరిగింది. టీ విరామం అనంతరం వర్షం కురవడంతో ఆట తిరిగి ప్రారంభంకాలేదు. అప్పటికి 26 ఓవర్లలో భారత్ స్కోర్ 62/2గా నమోదైంది. శుభ్‌మన్‌గిల్(7), రోహిత్ శర్మ(44; 74 బంతుల్లో 6x4) ఔటవ్వగా.. పుజారా (8*), రహానె(2*) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా కన్నా భారత్ ఇంకా 307 పరుగుల వెనుకబడి ఉంది. అంతకుముందు ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌటైంది.
మెరిసిన శార్దుల్, సుందర్, నటరాజన్..
274/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో శనివారం రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 95 పరుగులు చేసి చివరి ఐదు వికెట్లు కోల్పోయి 369కు ఆలౌటైంది. కెప్టెన్ టిమ్‌పైన్(50; 104 బంతుల్లో 6x4), కామెరూన్ గ్రీన్(47; 107 బంతుల్లో 6x4) ఆరో వికెట్‌కు 111 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని శార్దుల్ ఠాకుర్ విడదీశాడు.
జట్టు స్కోర్ 311 వద్ద పైన్‌ను ఔట్ చేశాడు. తర్వాతి ఓవర్లోనే వాషింగ్టన్ సుందర్ గ్రీన్‌ను బోల్తాకొట్టించాడు. మళ్లీ శార్దుల్ తదుపరి ఓవర్లో కమిన్స్(2)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఆస్ట్రేలియా 4 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. తర్వాత స్టార్క్(20), లైయన్(24) ధాటిగా ఆడి జట్టు స్కోర్‌ను 350 దాటించారు. ఈ నేపథ్యంలోనే వాషింగ్టన్ సుందర్ మరోసారి మెరిశాడు. ఓ చక్కటి డెలివరీతో లైయన్‌ను బౌల్డ్ చేశాడు. కాసేపటికే నటరాజన్.. హేజిల్‌వుడ్(11) బౌల్డ్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. టీమ్ఇండియా బౌలర్లలో నటరాజన్, శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ తలో మూడు వికెట్లు తీసుకోగా.. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.
టీమ్ఇండియాకు ఆదిలోనే షాక్..
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన టీమ్ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండు, మూడు టెస్టుల్లో ఫర్వాలేదనిపించిన గిల్ కమిన్స్ బౌలింగ్‌లో స్లిప్‌లో స్టీవ్‌స్మిత్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం రోహిత్ శర్మ, పుజారా జాగ్రత్తగా ఆడి జట్టు స్కోరును గాడిన పెట్టారు. అయితే, వీరిద్దరూ కుదురుకున్నారని అనుకునేలోపే హిట్‌మ్యాన్ ఓ అనవసరపు షాట్ ఆడి ఔటయ్యాడు. లైయన్ బౌలింగ్‌లో అంచనా తప్పి భారీ షాట్ ఆడడంతో లాంగ్‌ఆన్‌లో మిచెల్ స్టార్క్ చేతికి చిక్కాడు. అప్పటికి టీమ్ఇండియా స్కోర్ 60/2గా నమోదైంది. తర్వాత రహానె, పుజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలోనే టీ విరామ సమయానికి 62/2 స్కోర్ సాధించారు. ఆపై వర్షం కురవడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభం కాలేదు. పలుమార్లు అంపైర్లు మైదానాన్ని పరీక్షించగా తడిగా ఉంది. దీంతో చివరికి ఆటను నిర్ణీత సమయం కన్నా ముందే నిలిపివేశారు.
ఇవీ చదవండి..
రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
పాండ్య సోదరులకు పితృ వియోగం..