ఒక్క పరుగుతో బెంగళూరు విజయం..

తాజా వార్తలు

Updated : 29/04/2021 13:38 IST

ఒక్క పరుగుతో బెంగళూరు విజయం..

పోరాడి ఓడిన దిల్లీ క్యాపిటల్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దిల్లీ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. దాంతో కోహ్లీసేన ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మళ్లీ టాప్‌లోకి దూసుకెళ్లింది. చివరి ఓవర్‌లో 14 పరుగులు అవసరమైన వేళ దిల్లీ 12 పరుగులే చేసింది. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌(58 నాటౌట్; 48 బంతుల్లో 6x4), హెట్మేయర్‌(53 నాటౌట్‌; 25 బంతుల్లో 2x4, 4x6) ధాటిగా ఆడి దిల్లీని గెలిపించినంత పనిచేశారు. 92 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును వీరిద్దరూ ఆదుకున్నారు. బెంగళూరు బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ బౌండరీలు బాదారు. ముఖ్యంగా హెట్మేయర్‌ 23 బంతుల్లో అర్ధశతకం సాధించి కోహ్లీసేనకు చెమటలు పట్టించాడు. అయితే, సిరాజ్‌ చివరి ఓవర్‌లో కట్టుదిట్టంగా బంతులేసి దిల్లీని 170/4కు కట్టడి చేశాడు. దాంతో ఆర్సీబీ ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని పది పాయింట్లతో మళ్లీ అగ్రస్థానానికి చేరింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ రెండు వికెట్లు తీయగా జేమీసన్‌, సిరాజ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్‌(75 నాటౌట్‌; 42 బంతుల్లో 3x4, 4x6) దంచికొట్టి బెంగళూరును ఆదుకున్నాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో రజత్‌ పాటిదార్‌(31; 22 బంతుల్లో 2x6), మాక్స్‌వెల్(25; 20 బంతుల్లో 1x4, 2x6) ఫర్వాలేదనిపించారు. అంతకుముందు ఓపెనర్లు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(12), దేవ్‌దత్‌ పడిక్కల్‌(17) విఫలమయ్యారు. దాంతో ఆర్సీబీ 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆపై మాక్స్‌వెల్‌, రజత్‌ మూడో వికెట్‌కు మరో 30 పరుగులు జోడించారు. అయితే, ధాటిగా ఆడే క్రమంలో మాక్స్‌వెల్‌ ఔటయ్యాడు. ఆపై క్రీజులోకి వచ్చిన డివిలియర్స్‌.. రజత్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించాడు. చివర్లో వాషింగ్టన్‌ సుందర్‌(6) పెద్దగా ఆడకపోయినా డివిలియర్స్‌ దంచికొట్టాడు. స్టోయినిస్‌ వేసిన చివరి ఓవర్‌లో మూడు సిక్సులు సాధించి 23 పరుగులు రాబట్టాడు. దాంతో దిల్లీ ముందు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాడు. దిల్లీ బౌలర్లలో ఇషాంత్‌, రబాడ, అవేశ్‌ ఖాన్‌, అమిత్ మిశ్రా, అక్షర్‌ పటేల్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని