పృథ్వీ మెరుపులు.. దిల్లీ చిందులు..

తాజా వార్తలు

Updated : 29/04/2021 23:11 IST

పృథ్వీ మెరుపులు.. దిల్లీ చిందులు..

ఇంటర్నెట్‌డెస్క్‌: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ క్యాపిటల్స్‌ మూడు వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు పృథ్వీషా(82; 41 బంతుల్లో 11x4, 3x6), శిఖర్‌ ధావన్‌(46; 47 బంతుల్లో 4x4, 1x6) దంచికొట్టారు. ఇద్దరూ తొలి వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా పృథ్వీ ఆది నుంచీ ధాటిగా ఆడి కోల్‌కతా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. శివమ్‌ మావి వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే ఆరు బంతులను బౌండరీలుగా తరలించి 25 పరుగులు రాబట్టాడు. దాంతో తన ఉద్దేశం ఏంటో చెప్పకనే చెప్పాడు‌. ఈ క్రమంలోనే 18 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేశాడు. అనంతరం ఓపెనర్లు ఇద్దరు మరింత దూకుడు పెంచారు. కాగా, జట్టు విజయానికి 22 పరుగుల దూరంలో ఉండగా కమిన్స్‌ వేసిన 14వ ఓవర్‌లో ధావన్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత వచ్చిన రిషభ్‌ పంత్‌(16; 8 బంతుల్లో 2x4, 1x6) మ్యాచ్‌ను త్వరగా ముగించాలనే ఉద్దేశంతో ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే కమిన్స్‌ వేసిన 16వ ఓవర్‌లో శివమ్‌ మావి చేతికి చిక్కాడు. అదే ఓవర్‌లో పృథ్వీ సైతం భారీ షాట్‌కు యత్నించి నితీశ్‌ రాణా చేతికి చిక్కాడు. అప్పటికే దిల్లీ విజయం లాంఛనమైంది. చివరికి స్టోయినిస్‌(6) విన్నింగ్‌ షాట్‌గా బౌండరీ బాది దిల్లీకి ఈ సీజన్‌లో నాలుగో విజయాన్ని అందించాడు. కోల్‌కతా బౌలర్లలో కమిన్స్‌ ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. మిగతా బౌలర్లంతా పూర్తిగా విఫలమయ్యారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌(43; 38 బంతుల్లో 3x4, 1x6), మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఆండ్రీ రసెల్‌(45; 27 బంతుల్లో 2x4, 4x6) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. మరో ఓపెనర్‌ నితీశ్‌ రాణా(15; 12 బంతుల్లో 1x4, 1x6) ఆదిలోనే విఫలమయ్యాడు. అయితే.. శుభ్‌మన్‌, రాహుల్‌ త్రిపాఠి(19; 17 బంతుల్లో 2x4) రెండో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే ధాటిగా ఆడుతున్న వీరిని స్టోయినిస్‌ విడదీశాడు. పదో ఓవర్‌లో రాహుల్‌ను ఔట్‌ చేసి దిల్లీకి రెండో బ్రేక్‌ ఇచ్చాడు. ఆపై లలిత్‌ యాదవ్‌ 11వ ఓవర్‌లో కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, సునీల్‌ నరైన్‌ను డకౌట్లుగా పెవిలియన్‌ పంపాడు. తర్వాత శుభ్‌మన్‌.. కాసేపటికే దినేశ్‌ కార్తీక్‌(14) సైతం ఔటయ్యారు. అప్పటికి కోల్‌కతా స్కోర్‌ 16.2 ఓవర్లలో 109/6గా నమోదైంది. చివర్లో రసెల్‌, పాట్‌ కమిన్స్‌(11 నాటౌట్‌; 13 బంతుల్లో 1x4) ధాటిగా ఆడి జట్టు స్కోరును 150 దాటించారు. దిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌, లలిత్‌ యాదవ్‌ చెరో రెండు వికెట్లు తీయగా స్టోయినిస్‌ ఒక వికెట్ పడగొట్టాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని