
తాజా వార్తలు
ఫ్రాంఛైజీల బాధ: విధ్వంసం ఆలస్యమైంది!
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్ డెవాన్ కాన్వే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లోనే అజేయంగా 99 పరుగులు చేశాడు. దీనిలో 10 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. 19/3 స్కోరుతో కష్టాల్లో పడిన కివీస్..20 ఓవర్లకు 184/5కు చేరిందంటే అతడి చలవే.
అయితే ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో డెవాన్ కాన్వేపై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. రూ.50 లక్షల కనీస ధరతో వేలానికి వచ్చిన అతడిని ఎవరూ దక్కించుకోలేదు. కానీ ఆసీస్‌పై విజృంభించడంతో క్రికెట్ ప్రపంచమంతా అతడి గురించే చర్చిస్తోంది. అతడిని తీసుకోనందుకు ఫ్రాంఛైజీలన్నీ బాధపడుతుంటాయని నెటిజన్లు పోస్ట్‌లు చేస్తున్నారు.
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా డెవాన్ గురించి ట్వీట్ చేశాడు. ‘డెవాన్ కాన్వే.. నాలుగు రోజులు ఆలస్యమైంది. అయినా అద్భుత ఇన్నింగ్స్ ఆడావ్’ అని అశ్విన్ ట్వీటాడు. మరోవైపు న్యూజిలాండ్ పేసర్ మెక్లెనగన్ కూడా ఓ ట్వీట్ చేశాడు. ‘లైక్ టు లైక్‌తో అతడిని తీసుకుంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ మరింత బలోపేతం అవుతుందా?’ అని అన్నాడు. డెవాన్ గత అయిదు టీ20ల్లో 50, 69*, 91*, 93*, 99* పరుగులు చేశాడు.