
తాజా వార్తలు
ధోనీ వచ్చేశాడోచ్.. సీఎస్కేలో సందడి
(csk twitter)
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సందడి మొదలైంది. చెన్నై సూపర్‌కింగ్స్ తమ ఆటగాళ్ల కోసం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసింది. ఆ జట్టు సారథి ఎంఎస్ ధోనీ చెన్నైకి చేరుకోవడంతో ఫ్రాంచైజీలో కోలాహలం నిండింది. బుధవారం నగరానికి చేరుకున్న అతడికి హోటల్, ఫ్రాంచైజీ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు.
తన గదికి చేరుకుంటున్నంత సేపు మహీ చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. అతడు నగరానికి చేరుకున్న వీడియోను చెన్నై సూపర్‌కింగ్స్ గురువారం ట్వీట్ చేసింది. ‘తలైవా! మాస్ (స్క్)లో నవ్వు మొదలైంది! సూపర్ నైట్! విజిల్‌పొడు’ అంటూ వ్యాఖ్య పెట్టింది. అంతకుముందే అంబటి రాయుడు శిబిరానికి చేరుకోవడం గమనార్హం. ‘మనవాడు బాహుబలి మొదట వచ్చాడు!!!’ అంటూ రాయుడు చిత్రాన్ని సీఎస్కే పోస్ట్ చేసింది. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీసు పూర్తవ్వగానే చెతేశ్వర్ పుజారా సైతం శిబిరానికి చేరుకోనున్నాడు.
శిక్షణ శిబిరం మార్చి 9 నుంచి ఆరంభమవుతుందని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ అన్నాడు. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో శిబిరం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపాడు. ఆటగాళ్లు మొదట ఐదు రోజులు క్వారంటైన్లో ఉంటారని మూడుసార్లు నెగెటివ్ వచ్చిన తర్వాత శిబిరంలో కలుస్తారని పేర్కొన్నారు. విడతల వారీగా ఆటగాళ్లు వచ్చి శిబిరంతో కలుస్తారని వివరించారు. కాగా ఈ సారి వేలంలో కృష్ణప్ప గౌతమ్, మొయిన్ అలీని సీఎస్కే భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా చెతేశ్వర్ పుజారా, హరి నిశాంత్, హరి శంకర్, భగత్ వర్మను తీసుకుంది.