రూ.5.25 కోట్లు.. బస్సులోనే ఆటగాళ్ల సంబరాలు

తాజా వార్తలు

Published : 19/02/2021 15:58 IST

రూ.5.25 కోట్లు.. బస్సులోనే ఆటగాళ్ల సంబరాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: తమిళనాడుకు చెందిన యువ బ్యాట్స్‌మన్‌ షారుఖ్‌ఖాన్‌ గురువారం జరిగిన ఐపీఎల్‌ వేలంలో రికార్డు స్థాయిలో ధర పలకడంతో ఆ జట్టు దేశవాళీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలారు. తోటి ఆటగాడిని పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీ రూ.5.25 కోట్లకు పెద్ద మొత్తం వెచ్చించి కొనుగోలు చేయడంతో బస్సులోనే కేరింతలు కొట్టారు. ఆ సంతోషకరమైన క్షణాలను వీడియో చిత్రీకరించగా.. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ దాన్ని ట్విటర్‌లో అభిమానులతో పంచుకొన్నాడు.

రూ.20లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చిన షారుఖ్‌ను పంజాబ్‌ ఏకంగా రూ.5.25కోట్లకు కొనుగోలు చేసింది. అండర్‌19 ప్రపంచ కప్‌, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో ఇటీవల అతడు మెరుపులు మెరిపించడంతో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇతర జట్లు కూడా షారుఖ్‌ను చేజిక్కించుకొనేందుకు ఆసక్తి చూపాయి. ఈ క్రమంలోనే దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో పోటీ పడిన పంజాబ్‌ కింగ్స్‌ చివరికి అతడిని సొంతం చేసుకుంది.

అయితే, గురువారం వేలం జరుగుతుండగా తమిళనాడు ఆటగాళ్లంతా విజయ్‌ హజారే ట్రోఫీ మ్యాచ్‌ కోసం బస్సులో వెళుతున్నారు. అదే సమయంలో ఆటగాళ్లంతా ఫోన్‌లో వేలం పాటను వీక్షించారు. సరిగ్గా అదే సమయంలో షారుఖ్‌ను పంజాబ్‌ కొనుగోలు చేయడంతో సంతోషంగా గంతులేశారు. గట్టిగా అరుస్తూ తమ ఆటగాడి ఎదుగుదలపై హర్షం వ్యక్తం చేశారు. కాగా, పంజాబ్‌ గతేడాది యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో పలు మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన చేసినా మధ్యలో తడబడింది. మిడిల్‌ ఆర్డర్‌లో దంచికొట్టే బ్యాట్స్‌మన్‌ లేక పలు ఓటములు చవిచూసింది. ఈ క్రమంలోనే ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి 8 ఓటములతో ఆరో స్థానంలో నిలిచింది.

పంజాబ్‌ కింగ్స్‌ కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

రిచర్డ్‌సన్‌ (రూ.14 కోట్లు), మెరెడిత్‌ (రూ.8 కోట్లు), షారుఖ్‌ ఖాన్‌ (రూ.5.25 కోట్లు), హెన్రిక్స్‌ (రూ.4.20 కోట్లు), మలన్‌ (రూ.1.50 కోట్లు) ఫాబియాన్‌ అలెన్‌ (రూ.75 లక్షలు), జలజ్‌ సక్సేనా (రూ.30 లక్షలు), సౌరభ్‌ కుమార్‌ (రూ.20 లక్షలు), ఉత్కర్ష్‌ (రూ.20 లక్షలు)Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని