అశ్విన్.. ది ఫైటర్‌
close

తాజా వార్తలు

Updated : 15/02/2021 17:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అశ్విన్.. ది ఫైటర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: స్పిన్‌కు స్వర్గధామమైన పిచ్‌పై రవిచంద్రన్ అశ్విన్‌ (106; 148 బంతుల్లో, 14×4; 1×6) అద్భుత శతకంతో విజృంభించడంతో.. వరుసగా మూడో రోజు భారత్‌దే ఆధిపత్యం. చెపాక్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది. 482 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పర్యాటక జట్టు సోమవారం ఆట ఆఖరుకు మూడు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. అక్షర్‌ పటేల్ రెండు వికెట్లు తీయగా లోకల్ ‌బాయ్‌ అశ్విన్‌ ఒక వికెట్ పడగొట్టాడు. క్రీజులో రూట్ (2*), లారెన్స్‌ (19*) ఉన్నారు.

అంతకుముందు 52/1 స్కోరుతో మూడో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. యాష్‌ శతకానికి తోడుగా విరాట్ కోహ్లీ (62; 149 బంతుల్లో, 7×4) మాస్టర్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. మొయిన్ అలీ (4/98), లీచ్ (4/100) చెరో నాలుగు వికెట్లు తీశారు.


మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్‌లోనే పుజారా (7) దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. తర్వాత రోహిత్ (26), పంత్ (8)ను లీచ్‌ ఔట్‌ చేసి టీమిండియాను దెబ్బతీశాడు. కాసేపటికే అలీ బౌలింగ్‌లో రహానె (10), అక్షర్‌ పటేల్ (7) వెనుదిరగడంతో భారత్‌ 106 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. సొగసరి డ్రైవ్‌లతో విరాట్, స్వీప్‌షాట్లతో యాష్.. బౌండరీలు రాబట్టడంతో లంచ్‌ విరామానికి టీమిండియా‌ 156/6తో నిలిచింది.

అనంతరం రెండో సెషన్‌లోనూ కోహ్లీ, అశ్విన్‌ సాధికారికంగా ఆడారు. ఈ క్రమంలో విరాట్‌ 107 బంతుల్లో, యాష్‌ 64 బంతుల్లో అర్ధశతకాలు సాధించారు. కానీ డ్రింక్స్ బ్రేక్‌ తర్వాత అలీ.. కోహ్లీ, కుల్‌దీప్‌ (3)ను ఔట్‌చేశాడు. దీంతో భారత్ 221/8తో టీ విరామానికి వెళ్లింది. అయితే అభిమానులకు అసలు వినోదం మూడో సెషన్‌లోనే లభించింది. ఇషాంత్ అండతో అశ్విన్‌ పరుగులు సాధిస్తూ స్కోరుబోర్డును నడిపించాడు. అప్పటికే భారత్ భారీ ఆధిక్యాన్ని సాధించినప్పటికీ యాష్‌ శతకం కోసమే టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించింది.

సిరాజ్‌ సాయంతో..

అయితే జట్టు స్కోరు 237 పరుగుల వద్ద ఇషాంత్ ఔటయ్యాడు. అప్పటికీ అశ్విన్‌ స్కోరు 78. ఇక యాష్ మూడంకెల స్కోరు సాధించడం కష్టమే అనుకున్నారంతా. కానీ సిరాజ్‌ సాయంతో అతడు వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. బౌండరీలు, సిక్సర్లతో 134 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. అతడి టెస్టు కెరీర్‌లో ఇది అయిదో శతకం. కాగా, అశ్విన్ పరుగులు సాధించినప్పుడల్లా, ఆఖరి బ్యాట్స్‌మన్‌గా వచ్చిన సిరాజ్ (16*, 21 బంతుల్లో, 2×6) డిఫెన్స్‌ చేసినప్పుడల్లా స్టేడియం దద్దరిల్లింది. ఈలలు, చప్పట్లతో అభిమానులు సందడి చేశారు. యాష్ సెంచరీ తర్వాత సిరాజ్ ధనాధన్‌ సిక్సర్లతో అలరించాడు. కాగా, స్టోన్‌ బౌలింగ్‌లో అశ్విన్ బౌల్డవ్వడంతో టీమిండియా 286 పరుగులకు ఆలౌటైంది. ఆఖరి వికెట్‌కు అశ్విన్-సిరాజ్ 49 పరుగులు జోడించడం విశేషం.


ఇంగ్లాండ్ విలవిల..

భారీ ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌కు అక్షర్‌ పటేల్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్‌ సిబ్లీ(2)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన లారెన్స్‌తో కలిసి బర్న్స్‌ (25; 42 బంతుల్లో, 4×4) ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడినికి ప్రయత్నించాడు. కానీ అశ్విన్‌ వేసిన చక్కని బంతికి అతడు కోహ్లీ చేతికి చిక్కాడు. అనంతరం నైట్‌వాచ్‌మన్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన లీచ్‌ (0)ను అక్షర్‌ బోల్తాకొట్టించి ప్రత్యర్థి జట్టును మరోసారి దెబ్బతీశాడు. అయితే రూట్‌, లారెన్స్‌ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి మూడో రోజు ఆటను ముగించారు. ఇంగ్లాండ్‌ విజయం సాధించాలంటే మరో 429 పరుగులు సాధించాలి. కానీ స్పిన్‌కు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్‌పై మరో రెండు రోజులు భారత బౌలర్లను కాచుకుని లక్ష్యాన్ని ఛేదించడం దాదాపు అసాధ్యమే!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని