ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
close

తాజా వార్తలు

Published : 20/01/2021 12:46 IST

ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి

ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా దిగ్విజయంగా ముగించింది. గబ్బా టెస్టులో చారిత్రక విజయాన్ని అందుకుని టెస్టు సిరీస్‌ను 2-1తో సాధించింది. అయితే విజయానంతరం టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టును ఉద్దేశించి భావోద్వేగంతో మాట్లాడాడు. ఎన్నో ప్రతికూలతల నడుమ అద్భుత పోరాటం చేశారని ఆటగాళ్లను కొనియాడాడు. రవిశాస్త్రి ప్రసంగిస్తున్న సమయంలో ఆటగాళ్లు చప్పట్లు, ఈలలతో సందడి చేశారు.

‘‘మీరు ప్రదర్శించిన ధైర్యం, సంకల్పం, స్ఫూర్తి అసాధారణం. గాయాలు, 36 పరుగులకే ఆలౌటవ్వడం.. ఇలా ఎన్నో ప్రతికూలతలు. అయినా ఆత్మవిశ్వాసంతో పోరాడారు. ఇది రాత్రికి రాత్రి వచ్చిన గెలుపు కాదు. గొప్ప పోరాట పటిమ చూపించి జట్టుగా విజయం సాధించారు. ఇప్పుడు భారత్‌ మాత్రమే కాదు, యావత్‌ ప్రపంచమంతా నిల్చొని మీకు సెల్యూట్ చేస్తోంది. మీరు సాధించిన ఈ గొప్ప ఘనతను గుర్తుంచుకోండి. ఈ క్షణాలను ఆస్వాదించండి. వీలైనంత ఆనందంగా ఉండండి’’ అని రవిశాస్త్రి అన్నాడు.

‘‘మన విజయం మెల్‌బోర్న్‌లో మొదలైంది. సిడ్నీలో గొప్ప పోరాటం చేశారు. ఇక గబ్బాలో అద్భుత విజయం సాధించారు. శుభ్‌మన్‌ గిల్‌.. గ్రేట్‌. పుజారా పోరాట యోధుడు. రిషభ్‌ పంత్ ప్రదర్శన అత్యద్భుతం. పంత్‌ బ్యాటింగ్ చేస్తుంటే ఎంతో మందికి హార్ట్‌ఎటాక్‌ వస్తుందనిపించింది. గొప్పగా జట్టును గెలిపించాడు. ఇక కెప్టెన్‌ రహానె జట్టును పుంజుకునేలా చేశాడు. పరిస్థితుల్ని నియంత్రణలో ఉంచుతూ అతడు జట్టును ఘనంగా నడిపించాడు’’ అని తెలిపాడు.

‘‘మరోవైపు ఆఖరి టెస్టుతో అరంగేట్రం చేసిన ముగ్గురు ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన చేశారు. సుందర్, నట్టూకు తొలి మ్యాచ్ కాగా, శార్దూల్ 2018లో మొదటి మ్యాచ్ ఆడాడు. కానీ అతడు గాయంతో మధ్యలోనే జట్టును వీడాడు. అందుకే అతడికి ఇది అరంగేట్రమే. అయితే తొలి ఇన్నింగ్స్‌లో వారి చక్కని ప్రదర్శన కనబరిచారు. 186 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయినప్పుడు క్రీజులోకి వచ్చి పట్టుదలతో బ్యాటింగ్‌ చేశారు. జట్టు స్కోరును 336కు చేర్చారు. ఆస్ట్రేలియాపై పైచేయి సాధించడానికి అదే కారణం’’ అని రవిశాస్త్రి వెల్లడించాడు.

ఇదీ చదవండి

భారత్‌-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్‌

గబ్బా హీరోస్‌.. సూపర్‌ మీమ్స్‌



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని