కోహ్లీ కెప్టెన్సీ మార్పులో అర్థంలేదు: వీవీఎస్‌ 

తాజా వార్తలు

Updated : 15/03/2021 15:39 IST

కోహ్లీ కెప్టెన్సీ మార్పులో అర్థంలేదు: వీవీఎస్‌ 

ఇంగ్లాండ్‌కు పనిచేసినట్లు టీమ్‌ఇండియాకు కాదు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫార్మాట్లను బట్టి వేర్వేరు కెప్టెన్ల ఎంపిక అనేది భారత క్రికెట్‌కు సరిపోదని, ఆ వాదనలో అర్థం లేదని టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ లేని సమయంలో అజింక్య రహానె జట్టును విజయపథంలో నడిపించిన సంగతి తెలిసిందే. దాంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడిని పూర్తిస్థాయి సారథిగా కొనసాగించాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి.

అలాగే గతంలో టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీని రోహిత్‌ శర్మకు అప్పగించాలనే వాదనలూ వినిపించాయి. సమయం వచ్చినప్పుడల్లా కోహ్లీ కెప్టెన్సీపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో లక్ష్మణ్‌ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించాడు. టీమ్‌ఇండియాలో ఫార్మాట్లను బట్టి కెప్టెన్లను నియమించే విధానం ఎందుకు పనిచేయదో చెప్పాడు. అది ఇంగ్లాండ్‌కు సరిపోయినట్లు భారత జట్టుకు కుదరదని తెల్చిచెప్పాడు.

కోహ్లీ సారథ్య బాధ్యతలను భారంగా భావించనంతవరకూ, మూడు ఫార్మాట్లలో బాగా ఆడుతుంటే అతడినే కెప్టెన్‌గా కొనసాగించాలని హైదరాబాద్‌ సొగసరి బ్యాట్స్‌‌మన్‌ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌లో బహుళ సారథ్యం నడుస్తుందని, అందుకు రెండు కారణాలున్నాయని చెప్పాడు. ఒకటి జోరూట్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రెగ్యూలర్‌‌ ఆటగాడు కాదని చెప్పాడు. మరొకటి ఇయాన్‌ మోర్గాన్‌ టెస్టు క్రికెటర్‌ కాదన్నాడు. ఎవరైనా ఒక ఆటగాడు మూడు ఫార్మాట్లలో ఆడుతూ, అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉంటే అతడినే కెప్టెన్‌గా కొనసాగించాలని చెప్పాడు. ఈ విషయంలో టీమ్‌ఇండియాను ఇంగ్లాండ్‌తో పోల్చలేమన్నాడు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా తరఫున అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా ఆడుతున్న కోహ్లీని కాదని వేరొకరిని కెప్టెన్‌గా చేయాల్సిన అవసరం లేదన్నాడు.

‘ఫార్మాట్లను బట్టి కెప్టెన్ల ఎంపిక అనే వాదనకు ఎలాంటి అర్థంలేదు. టీమ్‌ఇండియాను అద్భుతంగా తీర్చిదిద్దింది విరాట్‌ కోహ్లీ. ఆటపై అతడికుండే సానుకూల దృక్పథం, పాటించే నైతిక విలువలు ఈ తరం క్రికెటర్లకు స్ఫూర్తి నింపాయి. దాంతో టీమ్ఇండియా ఆటగాళ్లు క్రికెట్‌ పట్ల అంకితభావంతో ఆడుతున్నారు. అలాగే రహానె, పుజారా, రోహిత్‌, అశ్విన్‌, ఇషాంత్‌, బుమ్రాలాంటి నైపుణ్యమున్న ఆటగాళ్లు ఒక బృందంలా ఉండటం విరాట్‌కు కలిసొచ్చింది. అయితే, కోహ్లీ లేనప్పుడు.. రోహిత్‌, రహానె తమ సారథ్య లక్షణాలతో జట్టును ముందుండి విజయపథంలో నడిపించారు. అంటే టీమ్‌ఇండియా నాయకత్వంలో నాణ్యమైన కెప్టెన్లు ఉన్నారని అర్థం’ అని లక్ష్మణ్‌ చెప్పుకొచ్చాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని