
తాజా వార్తలు
ఇంకా నయం.. వారినీ తీసేస్తారనుకున్నా: గంభీర్
ఇంటర్నెట్‌డెస్క్: మరో రెండు నెలల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్లో ఏయే ఆటగాడు ఉండాలో ఏయే ఆటగాడు అవసరం లేదో ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీలు ఒక నిర్ణయానికి వచ్చేశాయి. దాంతో బుధవారం తాము వదులుకోవాలనుకున్న ఆటగాళ్ల జాబితాలను విడుదల చేశాయి. అన్ని జట్లూ సగటున ఆరేడు మందిని వదిలించుకోగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం సరాసరి 10 మందిని వదిలేసింది. ఈ నేపథ్యంలోనే టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆర్సీబీ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశాడు. ‘క్రికెట్ కనెక్టెడ్’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆ జట్టుపై ఒక కొంటె విమర్శ కూడా చేశాడు.
ఆర్సీబీ వదులుకున్న ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్‌మోరిస్ ఉన్నాడు. అతడిని కొనసాగించాల్సి ఉందని, గాయాల బారిన పడిన అతడికి మరో అవకాశం ఇవ్వాల్సిందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టు.. క్రికెట్ వ్యవహారాల డైరెక్టర్ మైక్ హెసన్, ప్రధాన కోచ్ సైమన్ కటిచ్‌ను కొనసాగించడం విశేషమన్నాడు. అసలు వాళ్లను కూడా ఆర్సీబీ తొలగిస్తుందని తాను భావించినట్లు గంభీర్ కొంటెగా విమర్శించాడు. ఇక మోరిస్ స్థానంలో ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను తీసుకొంటే ఎలా ఉంటుందని అడిగిన ప్రశ్నకు.. క్రిస్ మోరిస్‌కు ఉన్నంత అనుభవం ఈ ఆసీస్ క్రికెటర్‌కు లేదన్నాడు.
మోరిస్‌లాంటి ఆల్‌రౌండర్‌ను ఆర్సీబీ మళ్లీ వేలంలో చేజిక్కించుకోలేదని గౌతీ అభిప్రాయపడ్డాడు. అసలు ఐపీఎల్ వేలంలో మేటి ఆల్‌రౌండర్లు దొరకరని మాజీ ఓపెనర్ వివరించాడు. తాను కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడేటప్పుడు రసెల్ ఇలాగే గాయాలబారిన పడినప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు గుర్తుచేశాడు. ఆర్సీబీ కూడా మోరిస్‌కు ఒక అవకాశం ఇవ్వాల్సిందని పేర్కొన్నాడు. అతడి స్థానంలో మరో మంచి ఆల్‌రౌండర్‌ను తెచ్చుకుంటామని ఆర్సీబీ భావించడం సరికాదని గంభీర్ వివరించాడు. కాగా, ఇటీవల యూఏఈలో జరిగిన 13వ సీజన్లో మోరిస్ 9 మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో కేవలం 34 పరుగులే చేశాడు. ఇక బౌలింగ్‌లో 11 వికెట్లు తీశాడు.
ఆర్సీబీ వదిలేసిన ఆటగాళ్లు..
క్రిస్ మోరిస్, ఆరోన్ ఫించ్, మొయిన్ అలీ, ఉదాన, శివమ్ దూబె, ఉమేశ్ యాదవ్, పవన్ నేగి, గుర్కీరత్. స్టెయిన్ తప్పుకోగా.. పార్థివ్ పటేల్ రిటైరయ్యాడు.
ఇవీ చదవండి..
రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
ఇక చాలు