టీమ్‌ఇండియాకు ఇంకేం కావాలి? 

తాజా వార్తలు

Updated : 30/03/2021 09:35 IST

టీమ్‌ఇండియాకు ఇంకేం కావాలి? 

ఇంగ్లాండ్‌ను మూడు ఫార్మాట్లలోనూ మట్టికరిపించి అభిమానులను మురిపించింది కోహ్లీసేన. అంతటి బలమైన జట్టుపై ఇలాంటి ఆధిపత్యం చలాయించడం గొప్ప విషయమే. అయితే మూడు సిరీస్‌లూ గెలిచేశాం కదా.. ఇంకేం కావాలి అనుకోడానికి లేదు. మరికొన్ని నెలల్లో సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌ జరగబోతున్న నేపథ్యంలో.. ఈ మెగా ఈవెంట్‌ దిశగా భారత్‌ సన్నాహాలపై కొన్ని ప్రశ్నలు రేకెత్తాయి ఈ సిరీస్‌లో. ఆ ప్రశ్నలకు సాధ్యమైనంత త్వరగా సమాధానాలు కనుక్కోవాల్సిందే.

తిప్పేదెవరు?

టీ20 ప్రపంచకప్‌ జరగబోయేది భారత గడ్డ మీదే. ఫార్మాట్‌ ఏదైనా మన జట్టు బౌలింగ్‌ విషయానికొస్తే స్పిన్‌ మీద ఎక్కువ ఆధార పడుతుంటుంది. కానీ ఈ మధ్య స్పిన్‌ విభాగమే భారత్‌కు బలహీనతగా మారుతోంది. ఐపీఎల్‌లో ఆడి ఆడి భారత పిచ్‌లకు, ఇక్కడి స్పిన్నర్లకు బాగా అలవాటు పడిపోతున్న విదేశీ బ్యాట్స్‌మెన్‌.. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆ అనుభవాన్ని చూపిస్తున్నారు. మన స్పిన్నర్లను అసలు లెక్కే చేయట్లేదు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ విషయానికే వస్తే.. టీ20ల్లో ప్రధాన స్పిన్నర్‌ చాహల్‌ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. వాషింగ్టన్‌ సుందర్‌ ప్రదర్శనా అంతంతమాత్రమే. కుల్‌దీప్‌ చాన్నాళ్ల ముందే ఫామ్‌ కోల్పోయాడు. వన్డే సిరీస్‌లో అతడికి అవకాశమిస్తే.. రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో ఆడిన కృనాల్‌ పాండ్య బ్యాటుతో ఆకట్టుకున్నా.. బౌలింగ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. రాహుల్‌ చాహర్‌ టీ20 సిరీస్‌లో ఓ మ్యాచ్‌లో మాత్రమే ఆకట్టుకున్నాడు. టెస్టుల్లో ఆకట్టుకున్న అక్షర్‌ పటేల్‌.. టీ20ల్లో తేలిపోయాడు. మొత్తంగా చూస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో స్పిన్నర్ల ప్రదర్శన భారత్‌కు సమస్యగా మారుతోంది. ఒకప్పుడు అశ్విన్‌-జడేజా.. ఆ తర్వాత చాహల్‌-కుల్‌దీప్‌ జోడీలు ప్రత్యర్థులను భయపెట్టేవి. కానీ ఇప్పుడు భారత స్పిన్నర్లనూ ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్‌ అసలు లెక్క చేయట్లేదు. కేవలం పేస్‌ను నమ్ముకుని మ్యాచ్‌లు గెలవడం సాధ్యం కాదు. మధ్య ఓవర్లలో పరుగులు కట్టడి చేయాల్సింది, వికెట్లు పడగొట్టాల్సింది స్పిన్నర్లే. టీ20 ప్రపంచకప్‌ మొదలయ్యే లోపు భారత్‌ ఈ సమస్యకు పరిష్కారం చూడాల్సిందే.

ఆల్‌రౌండ్‌ మెరుపులేవీ?

టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో అన్ని జట్లూ బలమైన ఆల్‌రౌండర్లను సిద్ధం చేసుకుంటున్నాయి. బ్యాటుతో, బంతితో సత్తా చాటగలిగే ఆటగాళ్లు జట్టుకు ఎంత బలమవుతారో తెలిసిందే. ఇంగ్లాండ్‌ సంగతే తీసుకుంటే.. స్టోక్స్, సామ్‌ కరన్‌ లాంటి ఆటగాళ్లు జట్టుకు ఎంత విలువ చేకూర్చారో చూశాం. ప్రపంచకప్‌పై కన్నేసిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్‌ లాంటి మేటి జట్లకు ఇలాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. కానీ భారత్‌ నిఖార్సయిన ఆల్‌రౌండర్ల కొరతతో ఇబ్బంది పడుతోంది. ముఖ్యంగా నాణ్యమైన పేస్‌ ఆల్‌రౌండర్‌ లేని లోటు భారత్‌కు ఎప్పట్నుంచో ఉంది. ఒకప్పుడు హార్దిక్‌ పాండ్య ఆ లోటును భర్తీ చేసే ఆటగాడిలా కనిపించాడు కానీ.. వెన్ను గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాక అతను ఆల్‌రౌండర్‌ పాత్రకు న్యాయం చేయట్లేదు. చాలా తక్కువ మ్యాచ్‌ల్లో మాత్రమే అతను బౌలింగ్‌ చేశాడు. వన్డేల్లో అవసరం ఉన్నా అతడితో బౌలింగ్‌ చేయించట్లేదు. ఐపీఎల్‌లోనూ అతను బౌలింగ్‌ చేయడం సందేహంగానే ఉంది. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకునే అతడిపై పని భారం పడకుండా ఎక్కువగా బౌలింగ్‌ చేయించట్లేదని అంటున్నారు. శస్త్రచికిత్స జరిగిన రెండేళ్ల తర్వాత కూడా పాండ్య శరీరం ఇంత సున్నితంగా ఉండటం అనేక సందేహాలు కలిగించేదే. శివమ్‌ దూబె ఆశలు రేకెత్తించి అంతర్ధానం అయిపోయాడు. జడేజా కొంతమేర ఆల్‌రౌండర్‌ కొరత తీరుస్తుంటాడు కానీ.. బంతితో, బ్యాటుతో అతను పూర్తి స్థాయిలో రాణించిన సందర్భాలు తక్కువ. ఈ మధ్య బ్యాటింగ్‌లో అతను మెరుగయ్యాడు. అయితే ప్రస్తుతం ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొంటున్న అతను.. ప్రపంచకప్‌ సమయానికి ఏ స్థితిలో ఉంటాడో చూడాలి. వాషింగ్టన్‌ సుందర్, అక్షర్‌ పటేల్‌ ఆల్‌రౌండర్‌ పాత్రలు పోషించగలరన్న అంచనాలు లేవు. మరి ప్రపంచకప్‌ సమయానికి టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్‌ బలం ఏమేర ఉంటుందో చూడాలి.

ఓపెనింగ్‌లో ఎవరు?

టీ20ల్లో భారత్‌కు ఉన్నట్లుండి ఓపెనింగ్‌ సమస్యగా మారింది. వన్డేల్లో రోహిత్‌-ధావన్‌ జోడీ సత్తా చాటుతోంది కానీ.. టీ20ల్లో ధావన్‌ రాణించలేకపోతున్నాడు. వయసు మీద పడ్డ ధావన్‌ను టీ20 ప్రపంచకప్‌కు ఉంటాడా లేదా అన్నది అనుమానంగా మారింది. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో అతణ్ని ఒక మ్యాచ్‌లో ఆడించి పక్కన పెట్టేశారు. ఆ తర్వాత అతను వన్డేల్లో రాణించాడు. ఇదే సిరీస్‌లో మిడిలార్డర్లో సత్తా చాటిన రాహుల్‌.. టీ20ల్లో ఓపెనర్‌గా ఘోరంగా విఫలమయ్యాడు. నిజానికి రోహిత్‌ శర్మ కూడా అంత మంచి ఫామ్‌లో లేడు కానీ.. అతను ఒక పెద్ద ఇన్నింగ్స్‌ ఆడితే అంతా సర్దుకుంటుందని భావిస్తున్నారు. అయితే అతడికి జోడీగా టీ20 ప్రపంచకప్‌లో ఎవరు దిగుతారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఓ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌ చేశాడు. మరో మ్యాచ్‌లో రోహిత్‌తో కోహ్లి జత కట్టాడు. వీళ్లిద్దరూ ఓపెనింగ్‌లో అదరగొట్టారు. కానీ ఇప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన కిషన్‌పై ఓ అంచనాకు రాలేం. ఎన్నో ప్రత్యామ్నాయాలుండగా.. కోహ్లి ఓపెనర్‌గా రావాల్సిన అవసరం ఉందా అన్నది ప్రశ్న. అతను ఓపెనింగ్‌లో వస్తే మిగతా ఆటగాళ్ల స్థానాలు మారి సమతూకం దెబ్బ తినొచ్చు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ జోడీ ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. జట్టు సమతూకం దెబ్బ తినకుండా ఈ ప్రశ్నకు భారత్‌ ఎలాంటి సమాధానం వెతుకుతుందో చూడాలి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని