అనగనగా అన్షు..

తాజా వార్తలు

Published : 22/05/2021 16:04 IST

అనగనగా అన్షు..

ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలి.. ఇది అతడి కల. కానీ అది నెరవేరలేదు. తాను అందుకోలేని ఆ లక్ష్యాన్ని తనయుడు చేరుకుంటాడని అనుకున్నాడు. కానీ నేనున్నా నాన్న అంటూ వచ్చి అతడి కల తీర్చింది ఆ అమ్మాయి! తండ్రి బాటలో రెజ్లింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుని, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి, తన కన్నా సీనియర్లను వెనక్కి నెడుతూ ఒలింపిక్స్‌ గడప తొక్కబోతున్న ఆ అమ్మాయే అన్షు మలిక్‌. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఈ హరియాణా అమ్మాయి కథేంటో చూద్దాం పదండి.

హరియాణాలో ఎక్కడ చూసినా రెజ్లర్లే కనిపిస్తారు..! అందులో గీత ఫొగాట్, వినేశ్‌ ఫొగాట్, సాక్షి మలిక్‌ లాంటి ఆణిముత్యాల్లాంటి అమ్మాయిలున్నారు. వారి కోవకే చెందుతుంది అన్షు మలిక్‌! అన్షు మ్యాట్‌ మీదకు రావడమే అనూహ్యంగా జరిగింది. ఆమె తండ్రి ధరమ్‌వీర్‌ రెజ్లర్‌. భారత జూనియర్‌ జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా ఉండేవాడు. ఒలింపిక్స్‌ ఆడాలన్నది ఆయన కల. అయితే గాయం కారణంగా అతడి కెరీర్‌ అర్థంతరంగా ఆగిపోయింది. దీంతో తన కుమారుడి ద్వారా లక్ష్యాన్ని సాధించాలని భావించాడు. అన్షు కన్నా నాలుగేళ్ల చిన్నోడైన శుభమ్‌ మొదట రెజ్లింగ్‌ శిక్షణకు వెళ్లేవాడు. తమ్ముడు శిక్షణ పొందే నిధి స్పోర్ట్స్‌ స్కూల్‌లోనే అన్షు కూడా చేరడం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. వేగంగా ఆటలో మెళకువలు నేర్చుకోవడం.. తక్కువ సమయంలోనే తనకన్నా సీనియర్లను ఓడించడంతో అన్షు ప్రతిభేంటో ఆమె తండ్రికి అర్థమైంది. కుమార్తెను సానబట్టడంపై దృష్టి సారించాడు. మామయ్య పవన్‌ కూడా అంతర్జాతీయ రెజ్లర్‌ కావడంతో మలిక్‌ ఆ ఆటలో వేగంగా ఎదిగింది. ఎంతగా అంటే ఆమె సీనియర్లు ఇంకా అంతర్జాతీయ టోర్నీలకు వెళ్లే దశలోనే ఉండగా.. ఆమె అప్పుడే ఒలింపిక్స్‌లో ఆడేంతగా. కానీ ఆమె పయనం అంత సులభంగా సాగలేదు. 

నాలుగేళ్లలోనే...: ఒకవైపు చదువుకుంటూ.. మరోవైపు రెజ్లింగ్‌లో కొనసాగడం అంత సులభం కాదు. కానీ అన్షు పట్టుదలతో అనుకున్నది సాధించింది. ఉదయం 4 గంటలకు లేవడం.. ప్రాక్టీస్‌ చేయడం.. ఆ తర్వాత కళాశాలకు వెళ్లడం.. మళ్లీ సాయంత్రం సాధన ఇలా ఊపిరి సలపకుండా సాగింది ఆమె దైనందిన జీవితం. ఈ కష్టానికి తగ్గట్లు ఫలితాలు కూడా వచ్చాయి. శిక్షణ మొదలుపెట్టిన నాలుగేళ్లలోనే అన్షు ఖాతాలో జాతీయ టైటిళ్లు చేరాయి. కోచ్‌ జగదీశ్‌ శిక్షణలో రాటుదేలిన ఆమె అంతర్జాతీయ మెట్టు ఎక్కడానికీ ఎక్కువ సమయం తీసుకోలేదు. 2016లో ఆసియా క్యాడెట్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన అన్షు.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సొంతం చేసుకుని సత్తా చాటింది. జాతీయ స్థాయిలో ఎక్కువ టోర్నీల్లో పాల్గొనకపోయినా అంతర్జాతీయ స్థాయిలో ఆమె దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు సీనియర్‌ విభాగంలో అన్షు ఆరు టోర్నీల్లో పాల్గొనగా అయిదింట్లో పతకాలు గెలిచింది. ఇదే క్రమంలో 57 కేజీల విభాగంలో ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఇటీవల ఆసియా క్వాలిఫయర్స్‌ టోర్నీలో ఫైనల్‌ చేరడం ద్వారా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అన్షు.. విశ్వ క్రీడల్లో పతకం సాధించాలనే పట్టుదలతో ఉంది. ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఉన్న అన్షు చదువులోనూ 80 శాతంపైన మార్కులు సాధిస్తుండటం విశేషం.

మానసికంగా నేను చాలా దృఢంగా ఉంటా. బలమైన ప్రత్యర్థిపై గెలవలేవు లాంటి వ్యాఖ్యలను పట్టించుకోను. ఇవేవీ నా ప్రదర్శనపై ప్రభావం చూపించలేవు. మా కుటుంబంలో నాన్నే కాదు, తాతయ్య, మామయ్య, సోదరుడు ఇలా అందరూ రెజ్లర్లే కావడంతో ఈ ఆటతో మమేకం అయ్యాను. మా ఇంట్లో ఉండే మ్యాట్‌ నన్ను ఎప్పుడూ ఆకర్షించేది. అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం వల్ల కష్టపడి ఆడడం కంటే తెలివిగా ఆడడం ఎలాగో నేర్చుకున్నా. ఎప్పుడూ మొదటి స్థానం సాధించాలని పట్టుదలగా ఉంటా.. అందుకే ఆటలోనే కాదు చదువులోనూ ముందే ఉంటా. ఒలింపిక్స్‌లో సత్తా చాటాలనేది నా కల’’

- అన్షు మలిక్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని