Sports News: అప్పుడు చేతులే లేవలేదు.. 

తాజా వార్తలు

Published : 30/06/2021 09:21 IST

Sports News: అప్పుడు చేతులే లేవలేదు.. 

దిల్లీ: సాజన్‌ ప్రకాశ్‌! భారత క్రీడా రంగంలో ఇప్పుడో సంచలనం. ‘ఎ’ ప్రమాణంతో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత స్విమ్మర్‌గా రికార్డు సృష్టించిన ఈ కుర్రాడు (200మీ బటర్‌ఫ్లై) అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు. కానీ దాదాపు రెండేళ్ల కిందటి ప్రకాశ్‌ పరిస్థితి తెలిస్తే అతడు ఇంత దాకా రావడం నమ్మశక్యంగా అనిపించదు. మెడలో డిస్క్‌ జారడంతో ఒక్క స్ట్రోక్‌ కూడా కొట్టలేకపోయిన ఈ 27 ఏళ్ల కేరళ స్విమ్మర్‌.. ‘ఎ’ ప్రమాణంతో టోక్యోకు అర్హత సాధించగలనని ఊహించే సాహసమే చేయలేకపోయాడు. రోమ్‌లో జరిగిన సెటె కొలి ట్రోఫీ 200 మీటర్ల బటర్‌ఫ్లై రేసును ప్రకాశ్‌ 1:56:38 నిమిషాల్లో పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

మలుపు అక్కడి నుంచి..
ప్రకాశ్‌ దశ తిరగడం 2020 ఆగస్టులో మొదలైంది. లాక్‌డౌన్‌ కారణంగా థాయ్‌లాండ్‌లో ఇరుక్కుపోయిన అతడు అప్పటికి పూల్‌కు దూరమై ఏడెనిమిది నెలలైంది. శారీరక గాయానికి తోడు అతడు మానసికంగా కూడా బలహీనుడయ్యాడు. ఆ సమయం (ఆగస్టు 2020)లో అతడు కోచ్‌ ప్రదీప్‌ కుమార్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొందేందుకు దుబాయ్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయమే అతడు భారత స్విమ్మింగ్‌లో కొత్త అధ్యాయం రచించడానికి కారణమైంది. తన గాయం గురించి, ఆ తర్వాత పురోగతి గురించి ప్రకాశ్‌ మాట్లాడుతూ.. ‘‘2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ సందర్భంగా మెడ నొప్పి మొదలైంది. అదే తగ్గిపోతుందిలే అనుకున్నా. బాధానివారిణులు తీసుకుని పోటీల్లో పాల్గొన్నా. ఆ తర్వాత చాలా టోర్నీల్లో పోటీపడ్డా. కానీ నేపాల్‌లో దక్షిణాసియా క్రీడల సందర్భంగా నొప్పి తీవ్రమైంది. నా ఈవెంట్‌ రోజు నా చేతులు పైకెత్తలేకపోయా. దాంతో స్కానింగ్‌ చేయించుకున్నా. నా మెడలో డిస్క్‌ జారిందని తేలింది. నా ఎడమచేతి దిశలో నొప్పికి అది కారణమైంది. మార్చి (2020) వరకు.. నాలుగు నెలల పాటు విరామం తీసుకున్నా. కోలుకునే దిశగా సాగా. అప్పుడే లాక్‌డౌన్‌ వచ్చిపడింది. అప్పుడు నేను థాయ్‌లాండ్‌లో ఉన్నా. అక్కడ ఎలాంటి ఫిజియో సహకారం లేదు. ఆగస్టులో దుబాయ్‌కి వెళ్లా. అక్కడ నా ఫిజియో రిచర్డ్‌ సహకారం అందించడం మొదలెట్టాడు. త్వరగానే పురోగతి కనిపించింది. నా కోచ్, ఆయన భార్య కూడా నాకెంతో సహాయం చేశారు’’ అని చెప్పాడు. ‘‘దుబాయ్‌లో తొలి మూడు నెలలు ఒక్క బటర్‌ఫ్లై స్ట్రోక్‌ కూడా కొట్టలేదు. అప్పుడు నాకంత ఆత్మవిశ్వాసం లేదు. పూల్‌లోకి దూకిన ప్రతిసారీ నొప్పిగా అనిపించేది. ఫ్రీస్టైల్‌ స్విమ్మింగ్‌ మాత్రమే చేశా. కొన్నిసార్లు బ్యాక్‌స్ట్రోక్‌ కొట్టా. నెమ్మదిగా తీవ్రత పెంచా. శారీరకంగా, మానసికంగా బలవంతుడిగా మారడమే అప్పుడు నా ప్రథమ లక్ష్యం’’ అని ప్రకాశ్‌ అన్నాడు. ‘‘దుబాయ్‌లో స్విమ్మింగ్‌ మొదలెట్టినప్పుడు టోక్యో ఒలింపిక్స్‌ అర్హతపై 50-50 నమ్మకంతో ఉన్నా. గాయాని కంటే ముందు అంతిమ ఫలితం గురించి, టైమ్‌ గురించి ఆలోచిస్తూ చాలా ఒత్తిడికి గురయ్యేవాణ్ని. దాంతో.. నైపుణ్యంపై దృష్టిపెట్టాలన్న ప్రాథమిక అంశాన్ని మరిచిపోయా. మానసిక అస్థిరత్వం, ఒత్తిడి నా గాయానికి కారణమయ్యాయి’’ అని ప్రకాశ్‌ చెప్పాడు. నవంబరు-డిసెంబరుకు కానీ అతడి నొప్పి తగ్గలేదు, పూల్‌కు దిగడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం తిరిగి రాలేదు. ఫిబ్రవరిలో లాత్వియా ఓపెన్‌లో ప్రదర్శన.. ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించగలనన్న ఆత్మవిశ్వాసాన్ని అతడికి ఇచ్చింది. అది అతడికి తొలి ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ మీట్‌. ‘‘నా మొదటి ఒలింపిక్‌ క్వాలిఫయర్‌ కోసం లాత్వియా వెళ్లా. అప్పటికి నేను బటర్‌ఫ్లైలో పెద్దగా సాధన చేయలేదు. కానీ 2 నిమిషాల్లోనే ఈదడంతో ఏదో మంచి జరుగుతోందని నాకు, నా కోచ్‌కు అనుమతించింది. ఆ ప్రదర్శన ఇచ్చిన విశ్వాసంతో ముందుకెళ్లాం’’ అని ప్రకాశ్‌ తెలిపాడు. అక్కడి నుంచి వేగంగా మెరుగుపడ్డ అతడు.. గతవారం ఒలింపిక్‌ ‘ఎ’ ప్రమాణం సాధించాడు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని