close

తాజా వార్తలు

Updated : 20/09/2020 09:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెన్నైదే చిందు

పడి లేచిన సూపర్‌కింగ్స్‌

తొలి మ్యాచ్‌లో ముంబయికి చెక్‌

మెరిసిన రాయుడు, డుప్లెసిస్‌

అలరించిన ఆరంభ పోరు

ఎలా మొదలుపెట్టామన్నది కాదు.. ఎలా ముగించామన్నది ముఖ్యం! చెన్నై సరిగ్గా అదే చేసింది. బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో ఆ జట్టుకు మంచి ఆరంభాలేమీ దక్కలేదు. ఆ జట్టు చేతులెత్తేసినట్లే కనిపించింది. మ్యాచ్‌ ఆ జట్టు చేజారినట్లే అనిపించింది.

కానీ బంతితో బ్యాటుతో భలేగా పుంజుకున్న సూపర్‌కింగ్స్‌.. అదిరిపోయే విజయంతో ఐపీఎల్‌ 13వ సీజన్‌ను ఆరంభించింది. ఏడాదిన్నరగా ఆటకు దూరంగా ఉన్నప్పటికీ ఆ ప్రభావమే కనిపించకుండా మెరుపు ఇన్నింగ్స్‌తో చెన్నైని గెలిపించిన అంబటి రాయుడు.. ఈ మ్యాచ్‌లో హీరో.

ఇక కరోనా వేళ.. ఎన్నో భయాలు, షరతుల మధ్య మ్యాచ్‌ జరిగినప్పటికీ అభిమానులకు మాత్రం ఏమీ తేడా కనిపించలేదు. రెండు అగ్ర జట్ల మధ్య పోరు అంచనాలకు తగ్గట్లే హోరాహోరీగా సాగి ఆద్యంతం వినోదాన్నందిస్తే.. స్టేడియంలో అభిమానులు లేకున్నా, ఉన్న భావన కలిగిస్తూ టీవీ తెరల్లో వారి అరుపులతో మ్యాచ్‌ సాగడం కొసమెరుపు.

మొత్తంగా ఆరు నెలలకు పైగా లైవ్‌ క్రికెట్‌ వినోదానికి దూరమైన భారత అభిమానులకు మంచి ఉత్సాహాన్నిస్తూ అదిరే రీతిలో ఆరంభమైంది ఐపీఎల్‌-13.

అబుదాబి

నిరుడు ఐపీఎల్‌ ఫైనల్లో ముంబయి చేతిలో కంగుతిన్న చెన్నై.. ఈ సీజన్‌ ఆరంభ పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు షాకిస్తూ టోర్నీలో శుభారంభం చేసింది. శనివారం అబుదాబిలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్‌-13 తొలి మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ముంబయి.. 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసింది. సౌరభ్‌ తివారి (42; 31 బంతుల్లో 3×4, 1×6) టాప్‌స్కోరర్‌. భారీ స్కోరు చేసేలా కనిపించిన ముంబయిని ఎంగిడి (3/38), చాహర్‌ (2/32), కరన్‌ (1/28) కట్టడి చేశారు. అనంతరం అంబటి రాయుడు (71; 48 బంతుల్లో 6×4, 3×6), డుప్లెసిస్‌ (58 నాటౌట్‌; 44 బంతుల్లో 6×4) మెరుపులతో చెన్నై 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్‌లో రాణించిన రాయుడు‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు.

పేలవంగా మొదలై..: చెన్నై ఇన్నింగ్స్‌ మొదలైన తీరు చూస్తే.. ఆ జట్టు గెలవడం కాదు కదా, గౌరవప్రదంగా ఓడుతుందని కూడా ఎవరూ అనుకుని ఉండరు. ఓపెనర్లు వాట్సన్‌ (4), విజయ్‌ (1) రెండు ఓవర్లకే పెవిలియన్‌ చేరిపోయారు. పటిష్టమైన ముంబయి బౌలింగ్‌ను ఎదుర్కొని చెన్నై పుంజుకోవడమే కష్టమనే అనుకున్నారంతా. కానీ డుప్లెసిస్‌కు జత కలిసి రాయుడు.. అనూహ్యంగా చెలరేగిపోవడంతో కొన్ని ఓవర్లలోనే మ్యాచ్‌ స్వరూపం మారిపోయింది. బుమ్రా సహా ముంబయి బౌలర్లందరినీ వీళ్లిద్దరూ అలవోకగా ఎదుర్కొన్నారు. చెన్నై మరో వికెట్‌ కోల్పోకుండా 13.1 ఓవర్లలోనే 100కు చేరుకుంది. ఈ క్రమంలో రాయుడి అర్ధశతకం కూడా పూర్తయింది. అతను తర్వాత కూడా జోరు కొనసాగించాడు. డుప్లెసిస్‌కు రెండు మూడు సార్లు జీవనదానం లభించడం చెన్నైకి కలిసొచ్చింది. రాయుడు ఔటైనప్పటికీ.. సమయోచితంగా భారీ షాట్లు ఆడిన సామ్‌ కరన్‌ (18; 6 బంతుల్లో 1×4, 2×6) మ్యాచ్‌ను ముంబయి నుంచి చెన్నై వైపు లాగేశాడు. అతణ్ని బుమ్రా ఔట్‌ చేసినప్పటికీ.. డుప్లెసిస్‌ జోరు కొనసాగించి జట్టుకు విజయాన్నందించాడు. 19వ ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని పరుగులేమీ చేయకుండా అజేయంగా నిలిచాడు.

ఆఖర్లో బోల్తా: అబుదాబిలో సగటు టీ20 స్కోరు 147. అక్కడ గెలవడానికి అవసరమైన సగటు స్కోరు 167. అయితే ఒక దశలో ముంబయి ఊపు చూస్తే ఆ జట్టు 180 పరుగులు చేసేలా కనిపించింది. కానీ చివరి ఓవర్లలో చతికిలపడి 162/9 పరుగులకు పరిమితమైంది. 14 ఓవర్లకు 121/3తో పటిష్ట స్థితిలో కనిపించిన ముంబయి.. చివరి 6 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 41 పరుగులే చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ (12) నిరాశపరిచినప్పటికీ.. అతడి ఓపెనింగ్‌ సహచరుడు డికాక్‌ (33; 20 బంతుల్లో 5×4).. అనూహ్యంగా ముంబయి తుది జట్టులోకి వచ్చిన ఒకప్పటి మెరుపు వీరుడు సౌరభ్‌ తివారి (42) చక్కటి ఇన్నింగ్స్‌లతో జట్టును మంచి స్థితికి చేర్చారు. ఆ జట్టు 12 ఓవర్లకే 100 పరుగులు చేసింది. అప్పుడే క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్య.. వెంటనే జడేజా బౌలింగ్‌లో రెండు వరుస సిక్సర్లు అందుకోవడంతో ముంబయి స్కోరు వేగం మరో స్థాయికి చేరింది. సౌరభ్‌, హార్దిక్‌ మంచి ఊపులో ఉండగా.. ఇంకా పొలార్డ్‌, కృనాల్‌ ఆడాల్సి ఉండటంతో ముంబయి 180 దాటుతుందనిపించింది. కానీ మొదటి రెండు ఓవర్లలో వికెట్‌ లేకుండా 29 పరుగులిచ్చిన చెన్నై ఫాస్ట్‌బౌలర్‌ ఎంగిడి చివరి రెండు ఓవర్లలో విజృంభించాడు. 9 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. జడేజా సైతం చివరి ఓవర్లో 2 వికెట్లు తీశాడు. ప్రమాదకరంగా కనిపించిన హార్దిక్‌ (14), పొలార్డ్‌ (18)లతో పాటు కృనాల్‌ (3)ను స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేర్చిన చెన్నై ముంబయిని అనుకున్న దాని కంటే తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. తనలో చురుకుదనం తగ్గలేదని రుజువు చేస్తూ కృనాల్‌ పాండ్య క్యాచ్‌ను ధోని డైవ్‌ చేసి అందుకున్న తీరు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది.

రాయుడు కసితీరా..
2 ఓవర్లకు 6/2. అంబటి రాయుడు క్రీజులోకి వచ్చేసరికి చెన్నై స్కోరిది. చెన్నైకి ఘోర పరాభవం తప్పదని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు అప్పటికి. కానీ కాసేపటికే ఆ అభిప్రాయం మారిపోయింది. అందుక్కారణం.. అంబటి రాయుడు. క్రీజులోకి రావడంతోనే ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడటం మొదలుపెట్టాడు అంబటి. అతడికి ఎదురే లేకపోయింది. ముంబయి ఉత్తమ బౌలర్‌ అయిన బుమ్రాను అతను లెక్కే చేయలేదు. అలవోకగా పరుగులు రాబట్టాడు. అతడి బౌలింగ్‌లో ఫ్రీహిట్‌ను సిక్సర్‌గానూ మలిచాడు. మిగతా బౌలర్లనూ సమర్థంగా ఎదుర్కొన్నాడు. పదే పదే క్రీజు వదిలి బయటికొచ్చి షాట్లు ఆడాడు రాయుడు. చెన్నైని మంచి స్థితికి చేర్చాక అతను పెవిలియన్‌ చేరాడు. అంబటిలో ఆత్మవిశ్వాసంతో పాటు ఓ కసి కూడా కనిపించింది. గత ఏడాది ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురై రిటైర్మెంట్‌ ప్రకటించిన రాయుడు.. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. నిరుడు ఐపీఎల్‌ ఆడాక ఏడాదిన్నర కాలంలో అంబటి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు పునరాగమనంలో అదిరిపోయే ఇన్నింగ్స్‌తో అందరి దృష్టీ తనపై పడేలా చేశాడు.

ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) కరన్‌ (బి) చావ్లా 12; డికాక్‌ (సి) వాట్సన్‌ (బి) కరన్‌ 33; సూర్యకుమార్‌ (సి) కరన్‌ (బి) దీపక్‌ చాహర్‌ 17; సౌరభ్‌ తివారి (సి) డుప్లెసిస్‌ (బి) జడేజా 42; హార్దిక్‌ పాండ్య (సి) డుప్లెసిస్‌ (బి) జడేజా 14; పొలార్డ్‌ (సి) ధోని (బి) ఎంగిడి 18; కృనాల్‌ పాండ్య (సి) ధోని (బి) ఎంగిడి 3; ప్యాటిన్సన్‌ (సి) డుప్లెసిస్‌ (బి) ఎంగిడి 11; రాహుల్‌ చాహర్‌ నాటౌట్‌ 2; బౌల్ట్‌ (బి) దీపక్‌ చాహర్‌ 0; బుమ్రా నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 162;

వికెట్ల పతనం: 1-46, 2-48, 3-92, 4-121, 5-124, 6-136, 7-151, 8-156, 9-156;

బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-32-2; సామ్‌ కరన్‌ 4-0-28-1; ఎంగిడి 4-0-38-3; పియూష్‌ చావ్లా 4-0-21-1; జడేజా 4-0-42-2

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: విజయ్‌ ఎల్బీ (బి) ప్యాటిన్‌సన్‌ 1; వాట్సన్‌ ఎల్బీ (బి) బౌల్ట్‌ 4; డుప్లెసిస్‌ నాటౌట్‌ 58; రాయుడు (సి) అండ్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 71; జడేజా ఎల్బీ (బి) కృనాల్‌ 10; కరన్‌ (సి) ప్యాటిన్‌సన్‌ (బి) బుమ్రా 18; ధోని నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (19.2 ఓవర్లలో 5 వికెట్లకు) 166;

వికెట్ల పతనం: 1-5, 2-6, 3-121, 4-134, 5-153;

బౌలింగ్‌: బౌల్ట్‌ 3.2-0-23-1; ప్యాటిన్‌సన్‌ 4-0-27-1; బుమ్రా 4-0-43-1; కృనాల్‌ పాండ్య 4-0-37-1; రాహుల్‌ చాహర్‌ 4-0-36-1


ప్రేక్షకుల్లేకున్నా హోరెత్తిపోయింది

సారి ఐపీఎల్‌కు ప్రేక్షకులను అనుమతించట్లేదన్న సంగతి తెలిసిందే. దీంతో టీవీల ముందు కూర్చుని నిశ్శబ్దంగా సాగే ఐపీఎల్‌ మ్యాచ్‌ను చూడటం అభిమానులకు ఎలా ఉంటుందో అన్న సందేహాలు కలిగాయి. కానీ ముంబయి, చెన్నై మధ్య తొలి మ్యాచ్‌ చూసిన ప్రేక్షకులకు ఆ లోటే తెలియలేదు. స్టేడియంలో అభిమానులున్నట్లే, వాళ్లు తమ కేరింతలతో హోరెత్తించేస్తున్నట్లే అనిపించింది మ్యాచ్‌ చూస్తున్న వాళ్లకు. ఇందుకోసం ప్రసారదారు ప్రత్యేక ఏర్పాటు చేసింది. బంతిని బ్యాట్స్‌మన్‌ ఆడిన వెంటనే అభిమానులు అరుస్తున్నట్లు కృత్రిమ శబ్దాలు జోడించారు. ఫోర్లు, సిక్సర్లు కొట్టినపుడు.. వికెట్‌ పడ్డపుడు స్టేడియం హోరెత్తిపోతున్న శబ్దాలు వినిపించడం విశేషం. దీంతో స్టేడియంలో అభిమానులు లేరన్న భావనే కలగలేదు వీక్షకులకు.

ఛీర్‌లీడర్లు కనిపించారు.. కానీ: ఐపీఎల్‌ మ్యాచ్‌లంటే తమ నృత్యాలతో ఉత్సాహపరిచే ఛీర్‌లీడర్లు ఉండాల్సిందే. ఈ సారీ వాళ్లున్నారు. కానీ ప్రత్యక్షంగా కాదు. కరోనా కారణంగా మైదానంలో వాళ్లు కాళ్లు కదిపి, అభిమానులను ఉత్సాహపరిచే అవకాశమే లేదు. అందుకే ఆటగాళ్లు బౌండరీలు కొట్టినపుడు, వికెట్లు తీసినపుడు ముందే రికార్డు చేసిన ఛీర్‌లీడర్ల డ్యాన్స్‌ వీడియోలను మైదానంలోని బోర్డులపై ప్రదర్శించారు.


 

ఆ క్యాచ్‌లు

పీఎల్‌లో అద్భుతమైన క్యాచ్‌లకు కొదవ ఉండదు. తొలి మ్యాచ్‌లోనే సీఎస్కే ఆటగాడు డుప్లెసిప్‌ ముచ్చటైన క్యాచ్‌లతో మురిపించాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ తొలి బంతిని సౌరభ్‌ తివారి లాంగాన్‌ దిశగా సిక్సర్‌ కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే.. బౌండరీ లైన్‌ దగ్గర గాల్లోకి ఎగిరి డుప్లెసిస్‌ బంతిని అందుకున్నాడు. తనను తాను నియంత్రించుకునే క్రమంలో బంతిని పైకి విసిరి బౌండరీ లైన్‌ దాటి.. తిరిగి మైదానంలోకి వచ్చి మరోసారి దాన్ని అందుకున్నాడు. అదే ఓవర్‌ అయిదో బంతికి హార్దిక్‌ కొట్టిన బంతిని లాంగాఫ్‌లో ఉన్న అతను అమాంతం గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. బంతిని పట్టుకున్న తర్వాత బౌండరీ లైన్‌ తాకకుండా తనను తాను గొప్పగా నియంత్రించుకుని బంతిని గాల్లోకి ఎగిరేసి మళ్లీ అందుకుని ఆశ్చర్యపరిచాడు.


మహి మార్కు..

డాదికి పైగా విరామం తర్వాత ఈ మ్యాచ్‌తోనే మళ్లీ మైదానంలో కనిపించిన ధోని అభిమానులను ఆకట్టుకున్నాడు. కృనాల్‌ పాండ్య క్యాచ్‌ను డైవ్‌ చేస్తూ ధోని అందుకున్న తీరు వారిని మురిపించింది. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసినా, 39 ఏళ్ల వయసొచ్చినా తనలో చురుకుదనం తగ్గలేదని చురుకైన వికెట్‌కీపింగ్‌తో ధోని రుజువు చేశాడు. ఇక తనదైన కెప్టెన్సీతో చివరి ఓవర్లలో ముంబయిని దెబ్బ తీసిన వైనమూ ఆకట్టుకుంది. చెన్నై విజయానికి చేరువయ్యాక ధోని బ్యాటింగ్‌కు వచ్చాడు. ఎదుర్కొన్న తొలి బంతికి క్యాచౌట్‌గా అంపైర్‌ ప్రకటించగా.. సమీక్ష కోరి నాటౌట్‌గా తేలాడు. అయితే ధోని పరుగులు చేయాల్సిన అవసరం లేకుండానే డుప్లెసిస్‌ పని పూర్తి చేశాడు.


అంతా భిన్నంగా ఉంది. ఇది మ్యాచ్‌ అనంతరం కార్యక్రమంలా అనిపించట్లేదు. చాలా సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగినా మేం ఆడిన తీరు సంతృప్తినిచ్చింది. ఈ పరిస్థితుల్లో ఎలా బౌలింగ్‌ చేయాలో అర్థం చేసుకోవడానికి మేం కాస్త సమయం తీసుకున్నాం. ముంబయి బ్యాట్స్‌మెన్‌ బాగా ఆడారు. ఒత్తిడి తేగలిగారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో మాకు చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. మాలో ఎక్కువమంది రిటైరైన వాళ్లే. అయినప్పటికీ  అనుభవం పనికొస్తుంది.

- ధోని


100
చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌గా ధోనికి ఇది వందో విజయం.


6

దుబాయ్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఇది వరుసగా ఆరో ఓటమి. 2014లో ఇక్కడే జరిగిన ఐపీఎల్‌ తొలి అంచెలో అయిదు మ్యాచ్‌లు ఆడిన ముంబయి అన్నింట్లోనూ పరాజయం పాలైంది.


437

437 రోజుల తర్వాత ధోని తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. నిరుడు వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్‌ మ్యాచ్‌లో (జులై 10, 2019) ఆడిన అతను.. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఐపీఎల్‌-13 తొలి మ్యాచ్‌ కోసం బరిలో దిగాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.