close

తాజా వార్తలు

Updated : 21/09/2020 04:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సూపరో సూపర్‌

ఉర్రూతలూగించిన దిల్లీ, పంజాబ్‌ మ్యాచ్‌
అదరగొట్టిన స్టాయినిస్‌, మయాంక్‌
సూపర్‌ ఓవర్‌ ఓవర్లో దిల్లీ క్యాపిటల్స్‌ గెలుపు

దిల్లీ పనైపోయినట్లే.. కాదు కాదు ఆ జట్టుదే విజయం.. పంజాబ్‌కు పరాభవం తప్పదు.. దిల్లీకి ఇంకా ఆశలెక్కడున్నాయ్‌.. ఇలా ఎన్నిసార్లు అంచనాలు, వ్యాఖ్యానాలు మారిపోయాయో!
ఈసారి ఐపీఎల్‌లో ఎలాగైనా తమ ప్రదర్శన మార్చాలని బరిలోకి దిగిన రెండు జట్లూ.. శుభారంభం కోసం పంతం పట్టి పోరాడాయి. ఆశల్లేని స్థితి నుంచి అద్భుతంగా పుంజుకున్నాయి. అయితే చివరికి ఏదో ఒక వైపు నిలవాలి కాబట్టి విజయం.. ఓ జట్టును వరించింది.
అద్భుత పోరాటాలు, ఉత్కంఠభరిత మలుపులతో అభిమానులను ఉర్రూతలూగించిన మ్యాచ్‌లో ఫలితం తేలడానికి సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. అక్కడా ఊహించనిదే జరిగింది. చివరికి మ్యాచ్‌ దిల్లీ సొంతమైంది.
ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ప్రదర్శన ప్రకారం చూస్తే కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, దిల్లీ క్యాపిటల్స్‌ టోర్నీలో అంతగా ఆదరణ లేని, చిన్న స్థాయి జట్లు. అయితే ఆదివారం ఈ రెండు జట్ల మధ్య పోరాటం మాత్రం అభిమానులకు అత్యుత్తమ వినోదాన్ని పంచింది. సూపర్‌ ఓవర్లో ఫలితం తేలిన ఈ మ్యాచ్‌లో ఆద్యంతం మలుపులే మలుపులు. మొదట దిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్ల ధాటికి తక్కువ స్కోరుకు పరిమితమయ్యేలా కనిపించిన జట్టుకు స్టాయినిస్‌ (53; 21 బంతుల్లో 74, 36) ఊహించని స్కోరునందించాడు. అనంతరం దిల్లీ బౌలర్ల జోరుతో పంజాబ్‌ మరింతగా తడబడి ఓటమి దిశగా సాగింది. కానీ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (89; 60 బంతుల్లో 74, 46) చివరి ఓవర్లో ఉగ్రరూపం దాల్చి పంజాబ్‌ను విజయానికి అత్యంత చేరువగా తీసుకెళ్లాడు. కానీ స్కోర్లు టై అయిన దశలో అతను ఔటవడం, వెంటనే మరో వికెట్‌ పడటంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. పంజాబ్‌ కూడా సరిగ్గా 8 వికెట్లకు 157 పరుగులే చేయడం విశేషం. సూపర్‌ఓవర్లో మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌.. రబాడ బౌలింగ్‌లో అనూహ్యంగా రెండే పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోవడంతో దాని కథ ముగిసింది. తొలి బంతికి 2 పరుగులు రాగా.. రెండో బంతికి రాహుల్‌ భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో అక్షర్‌ పటేల్‌కు దొరికిపోయాడు. మూడో బంతికి పూరన్‌ బౌల్డయిపోయాడు. 3 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దిల్లీ 2 బంతుల్లోనే ఛేదించింది. బ్యాటుతో, బంతితో మ్యాచ్‌ను మలుపు తిప్పిన స్టాయినిస్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.
ఆశల్లేని స్థితి నుంచి..: మొదట బ్యాటింగ్‌లో దిల్లీ ఎలా అయితే తడబడి చివర్లో స్టాయినిస్‌ విధ్వంసంతో పుంజుకుందో.. తర్వాత ఛేదనలో మయాంక్‌ సంచలన ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ కూడా అలాగే పోటీలోకి వచ్చింది. చివరి 4 ఓవర్ల ముందు వరకు ఆ జట్టు గెలుస్తుందన్న ఆలోచనే లేదు ఎవ్వరికీ. ఓపెనర్‌ రాహుల్‌ (21) ఔటైనప్పటి నుంచి పంజాబ్‌కు కష్టాలే కష్టాలు. అతణ్ని అయిదో ఓవర్లో మోహిత్‌ శర్మ అద్భుత బంతితో బౌల్డ్‌ చేయగా.. తర్వాతి ఓవర్లో కరుణ్‌ నాయర్‌ (1)తో పాటు పూరన్‌ (0)ను ఔట్‌ చేసిన అశ్విన్‌ (2/2) కింగ్స్‌ను గట్టి దెబ్బ తీశాడు. భారీ అంచనాలతో క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్‌ (1)ను రబాడ పెవిలియన్‌ చేర్చడంతో పంజాబ్‌ 35/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. కాసేపు మయాంక్‌కు అండగా నిలిచిన సర్ఫ్‌రాజ్‌ (12) కూడా ఔటైపోవడంతో పంజాబ్‌కు పరాభవం తప్పదనిపించింది. అయితే గౌతమ్‌ (20) సహకారంతో మయాంక్‌ పోరాటం కొనసాగించాడు. 16 ఓవర్ల వరకు అతను నెమ్మదిగానే ఆడాడు. అప్పటికి అతడి స్కోరు 39 బంతుల్లో 38. కానీ తర్వాతి ఓవర్‌ నుంచి అతడి ఆటే మారిపోయింది. బౌండరీల మోత మోగిస్తూ అతను లక్ష్యాన్ని కరిగిస్తూ వెళ్లాడు. మోహిత్‌ వేసిన 17వ ఓవర్లో అతను రెండు సిక్సర్లు అందుకున్నాడు. గెలుపు సమీకరణం 2 ఓవర్లలో 25గా మారింది. తర్వాతి ఓవర్లో (రబాడ) రెండు ఫోర్లు సహా 12 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. 3 బంతుల్లోనే 12 పరుగులు రావడంతో పంజాబ్‌ తేలిగ్గా గెలిచేలా కనిపించింది. కానీ చివరి 3 బంతుల్లో పరుగే రాకపోవడం, రెండు వికెట్లు కూడా పడటంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది.
అతనొచ్చి మార్చేశాడు..: మొదట దిల్లీ జట్టు 157 పరుగులు చేయడం అనూహ్యం. ఆ జట్టు 130 దాకా రావడం కూడా కష్టమే అనిపించింది ఓ దశలో. షమి (3/15) ధాటికి ఆ జట్టు 4 ఓవర్లు ముగిసేసరికి 13/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్‌ ధావన్‌ ఖాతా తెరవకుండానే రనౌటైపోగా.. పృథ్వీ షా (5), హెట్‌మైయర్‌ (7)లను షమి ఔట్‌ చేశాడు. ఈ దశలో రిషబ్‌ పంత్‌ (31; 29 బంతుల్లో 44)తో కలిసి కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (39; 32 బంతుల్లో 36) జట్టును ఆదుకున్నాడు. అయ్యర్‌ కొంచెం కుదురుకోగానే భారీ షాట్లు ఆడాడు. పంత్‌ కూడా ఊపందుకోవడంతో దిల్లీ కోలుకున్నట్లే కనిపించింది. చివరి ఓవర్లలో వీళ్లిద్దరి మెరుపులు ఆశించిన దిల్లీ అభిమానులకు పంజాబ్‌ బౌలర్లు మళ్లీ షాకిచ్చారు. పంత్‌ను యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ బౌల్డ్‌ చేయగా.. తిరిగి బౌలింగ్‌కు వచ్చిన షమి అయ్యర్‌ను బుట్టలో వేశాడు. అక్షర్‌ పటేల్‌ (6), అశ్విన్‌ (4) కూడా నిలవలేదు. 18 ఓవర్లకు దిల్లీ స్కోరు 113/6. అయితే చివరి రెండు ఓవర్లలో స్టాయినిస్‌ అనూహ్యంగా చెలరేగిపోయి జట్టు రాతను మార్చేశాడు. కాట్రెల్‌ వేసిన 19వ ఓవర్లో హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టిన అతను.. చివరి ఓవర్లో (జోర్డాన్‌) మరింతగా చెలరేగి రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు బాదాడు. 20 బంతుల్లోనే అతడి అర్ధశతకం పూర్తయింది.
20 ఓవర్లలో.. దిల్లీ 157/8.. పంజాబ్‌ 157/8


ఆఖర్లో మలుపు

పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్‌ అనూహ్య మలుపులు తిరిగి టై అయింది. కింగ్స్‌ ఎలెవన్‌ గెలవాలంటే 6 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. స్టాయినిస్‌ వేసిన తొలి బంతినే సిక్స్‌గా మలిచిన మయాంక్‌ లక్ష్యాన్ని తేలిక చేసేశాడు. ఆ తర్వాత బంతికి రెండు పరుగులు రాగా.. మూడో బంతికి అగర్వాల్‌ ఫోర్‌ కొట్టడంతో పంజాబ్‌ సమీకరణం 3 బంతుల్లో 1 పరుగుగా మారింది. ఈ స్థితిలో కింగ్స్‌ ఎలెవన్‌ విజయంపై ఎవరికీ అనుమానాల్లేవ్‌. కానీ నాలుగో బంతికి పరుగు చేయలేకపోయిన మయాంక్‌.. అయిదో బంతికి ఔట్‌ కావడంతో ఉత్కంఠ నెలకొంది. ఫుల్‌ టాస్‌ బంతిని షాట్‌ కొట్టబోయి మయాంక్‌ హెట్‌మైయర్‌కు చిక్కాడు. ఫుల్‌ టాస్‌గా పడిన చివరి బంతిని జోర్డాన్‌ స్క్వేర్‌ లెగ్‌లో ఫ్లిక్‌ చేయగా.. అక్కడే కాచుకున్న రబాడ క్యాచ్‌ పట్టేయడంతో మ్యాచ్‌ అనూహ్యంగా సూపర్‌ ఓవర్‌కు మళ్లింది.

ఒక్క ఓవర్లో 30

స్టాయినిస్‌ ధాటికి ఇంగ్లాండ్‌ బౌలర్‌ జోర్డాన్‌ బెంబేలెత్తిపోయాడు. దిల్లీ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో అతడి ధాటికి ఏకంగా 30 పరుగులు సమర్పించుకున్నాడు. తొలి బంతికి స్క్వేర్‌ లెగ్‌లో అందమైన సిక్సర్‌తో మొదలైందీ ఓవర్‌. రెండో బంతి వైడ్‌. తర్వాతి మూడు బంతులకు మూడు ఫోర్లువచ్చాయి. అయిదో బంతికి మళ్లీ స్క్వేర్‌ లెగ్‌లో మరో చూడముచ్చటైన సిక్సర్‌ అందుకున్నాడు స్టాయినిస్‌. చివరికి బంతికి ఒక పరుగొచ్చింది. రెండో పరుగు తీసే క్రమంలో స్టాయినిస్‌ రనౌటయ్యాడు. అయితే అది నోబ్‌ కావడంతో.. నార్జె క్రీజులోకి వచ్చాడు. అతడు ఆఖరి బంతికి మూడు పరుగులు రాబట్టాడు. అప్పటికే 3 ఓవర్లలో వికెట్‌ లేకుండా 26 పరుగులిచ్చుకున్న జోర్డాన్‌.. చివరికి 0/56తో కోటాను ముగించాడు.

అయ్యో అశ్విన్‌

రెండు పరుగులు.. రెండు కీలక వికెట్లు.. ఇదీ పంజాబ్‌ నుంచి దిల్లీకి మారిన స్పిన్నర్‌ అశ్విన్‌ తన తొలి ఓవర్‌ ప్రదర్శన ఇది. ఇంత గొప్పగా ఐపీఎల్‌ను ఆరంభించిన అశ్విన్‌ను అంతలోనే దురదృష్టం వెంటాడింది. అతను గాయపడి ఐపీఎల్‌కే దూరమయ్యే ప్రమాదంలో పడ్డాడు. తన తొలి ఓవర్‌ చివరి బంతికి మ్యాక్స్‌వెల్‌ లాంగాన్‌ వైపు ఆడిన బంతిని ఆపే ప్రయత్నంలో అతను ఇబ్బందికర రీతిలో కింద పడ్డాడు. అతడి ఎడమ చేయి నేరుగా నేలను తాకగా.. శరీర బరువంతా దానిపై పడింది. వెంటనే అశ్విన్‌ చేయి పట్టుకుని బాధతో విలవిలలాడాడు. ఫిజియో వచ్చి అతణ్ని బయటికి తీసుకెళ్లాడు. అశ్విన్‌ భుజం స్థానభ్రంశం చెందినట్లుగా అనుమానిస్తున్నారు. అదే నిజమైతే అశ్విన్‌ ఈ ఐపీఎల్‌ మొత్తానికి దూరమైనట్లే.


దిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ (సి) జోర్డాన్‌ (బి) షమి 5; ధావన్‌ రనౌట్‌ 0; హెట్‌మైయర్‌ (సి) మయాంక్‌ (బి) షమి 7; శ్రేయస్‌ (సి) జోర్డాన్‌ (బి) షమి 39; పంత్‌ (బి) బిష్ణోయ్‌ 31; స్టాయినిస్‌ రనౌట్‌ 53; అక్షర్‌ (సి) రాహుల్‌ (బి) కాట్రెల్‌ 6; అశ్విన్‌ (సి) షమి (బి) కాట్రెల్‌ 4; రబాడ నాటౌట్‌ 0; నార్జె నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 157; వికెట్ల పతనం: 1-6, 2-9, 3-13, 4-86, 5-87, 6-96, 7-127, 8-154; బౌలింగ్‌: కాట్రెల్‌ 4-0-24-2; షమి 4-0-15-3; జోర్డాన్‌ 4-0-56-0; కె.గౌతమ్‌ 4-0-39-0; రవి బిష్ణోయ్‌ 4-0-22-1

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బి) మోహిత్‌ 21; మయాంక్‌ (సి) హెట్‌మైయర్‌ (బి) స్టాయినిస్‌ 89; నాయర్‌ (సి) పృథ్వీ (బి) అశ్విన్‌ 1; పూరన్‌ (బి) అశ్విన్‌ 0; మాక్స్‌వెల్‌ (సి) అయ్యర్‌ (బి) రబాడ 1; సర్ఫరాజ్‌ (సి) పృథ్వీ (బి) అక్షర్‌ 12; గౌతమ్‌ (సి) పంత్‌ (బి) రబాడ 20; జోర్డాన్‌ (సి) రబాడ (బి) స్టాయినిస్‌ 5; షమి నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 157;వికెట్ల పతనం: 1-30, 2-33, 3-34, 4-35, 5-55, 6-101, 7-157, 8-157;బౌలింగ్‌: నార్జె 4-0-33-0; మోహిత్‌ 4-0-45-1; రబాడ 4-0-28-2; అశ్విన్‌ 1-0-2-2; అక్షర్‌ పటేల్‌ 4-0-14-1; స్టాయినిస్‌ 3-0-29-2



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.