close

తాజా వార్తలు

Updated : 22/09/2020 03:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బెంగళూరు విజయారంభం

చాహల్‌ మాయాజాలం
మెరిసిన ఏబీ, దేవ్‌దత్‌
చేజేతులా ఓడిన సన్‌రైజర్స్

బెయిర్‌స్టో పోరాటం వృథా

అబుదాబి

బెంగళూరు బోణీ కొట్టింది. ప్రతీసారీ అంచనాలను అందుకోలేకపోతున్నా ఎప్పట్లానే అభిమానుల భారీ మద్దతుతో బరిలోకి దిగిన కోహ్లీసేన గెలుపుతో ఐపీఎల్‌-13ను ఆరంభించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు నిరాశ. బెయిర్‌స్టో సూపర్‌ ఇన్నింగ్స్‌తో వార్నర్‌ బృందం విజయం దిశగా సాగినా.. చాహల్‌ స్పిన్‌ మాయాజాలానికి తలవంచింది. చక్కని అవకాశాన్ని చేజార్చుకుంది. బెంగళూరు ఇన్నింగ్స్‌లో డివిలియర్స్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌ మెరిశారు.
 

యుజ్వేంద్ర చాహల్‌ (3/18) అద్భుత బౌలింగ్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్‌లో శుభారంభం చేసింది. తన తొలి మ్యాచ్‌లో సోమవారం 10 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గెలిచింది. డివిలియర్స్‌ (51; 30 బంతుల్లో 4×4, 2×6), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (56; 42 బంతుల్లో 8×4) మెరవడంతో మొదట బెంగళూరు 5 వికెట్లకు 163 పరుగులు సాధించింది. ఛేదనలో సన్‌రైజర్స్‌ 19.4 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. బెయిర్‌స్టో (61; 43 బంతుల్లో 6×4, 2×6), మనీష్‌ పాండే (34; 33 బంతుల్లో 3×4, 1×6) రాణించడంతో ఓ దశలో సన్‌రైజర్స్‌ గెలుపు దిశగా సాగినా.. చాహల్‌ ఆ జట్టును తిప్పేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చేతిలో 8 వికెట్లు ఉండగా.. చివరి 5 ఓవర్లలో 43 పరుగులు చేయాల్సిన సన్‌రైజర్స్‌ అనూహ్యంగా కుప్పకూలింది. 32  పరుగులకే చివరి ఎనిమిది వికెట్లు కోల్పోయి చేజేతులా ఓడిపోయింది.
బెయిర్‌స్టో అదరహో..: టోర్నీలో హైదరాబాద్‌ ఆశలకు ఎంతో కీలకమైన బ్యాట్స్‌మన్‌ కెప్టెన్‌ వార్నర్‌. ఛేదనలో దురదృష్టవశాత్తు వార్నర్‌ రెండో ఓవర్లోనే రనౌటైనా సన్‌రైజర్స్‌ ఆత్మవిశ్వాసంతోనే లక్ష్యం దిశగా సాగింది. కారణం బెయిర్‌స్టో, మనీష్‌ పాండే. ధాటిగా బ్యాటింగ్‌ చేసిన బెయిర్‌స్టో.. రెండో ఓవర్లో ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 6 బాదేశాడు. వార్నర్‌ నిష్క్రమణ తర్వాత మరోవైపు పాండే సహకరిస్తుండగా బెయిర్‌స్టో దూకుడు కొనసాగించాడు. పాండే కూడా కొన్ని చక్కని షాట్లు ఆడాడు. 12వ ఓవర్లో సన్‌రైజర్స్‌ స్కోరు 89/1. సాధించాల్సిన రన్‌రేట్‌ కాస్త ఎక్కువే ఉన్నా నిలదొక్కుకుని ఉన్న బ్యాట్స్‌మన్‌ క్రీజులో ఉండడంతో సన్‌రైజర్స్‌ లక్ష్యం దిశగానే సాగుతున్నట్లనిపించింది. కానీ అద్భుతమైన బౌలింగ్‌తో చాహల్‌ మ్యాచ్‌ గమనాన్నే మార్చేశాడు. పాండేను ఔట్‌ చేయడం ద్వారా రెండో వికెట్‌ భాగస్వామ్యాన్ని విడదీసి ప్రత్యర్థిని దెబ్బతీశాడు. అయినా బెయిర్‌స్టో క్రీజులోనే ఉండడంతో సన్‌రైజర్స్‌లో భరోసా. కానీ 16వ ఓవర్లో కళ్లు చెదిరే బంతులతో ప్రమాదకర బెయిర్‌స్టోతో పాటు విజయ్‌ శంకర్‌లను బౌల్డ్‌ చేయడం ద్వారా ప్రత్యర్థిని చావు దెబ్బతీసి ఆటను మలుపు తిప్పాడు చాహల్‌. మ్యాచ్‌ చాలా వేగంగా బెంగళూరు చేతుల్లోకి వచ్చేసింది. లక్ష్యం అందుబాటులోనే ఉన్నా.. వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వచ్చినట్లే వెనుదిరగడంతో సన్‌రైజర్స్‌కు నిరాశ తప్పలేదు. ప్రియమ్‌ గార్గ్‌ (12), అభిషేక్‌ శర్మ (7), భువనేశ్వర్‌ (0), రషీద్‌ ఖాన్‌ (6),  మిచెల్‌మార్ష్‌ (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు.

మెరిసిన పడిక్కల్‌: బెంగళూరు ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌ ఆటే హైలైట్‌. అరంగేట్ర ఐపీఎల్‌ మ్యాచే అయినా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేసిన ఈ 20 ఏళ్ల యువ బ్యాట్స్‌మన్‌ అందరినీ ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ ఆరంభించిన అతడు చక్కని షాట్లతో అలరించాడు. ఫించ్‌ (29) మరోవైపు నుంచి జాగ్రత్తగా ఆడుతుంటే.. పడిక్కల్‌ మాత్రం బ్యాట్‌ ఝుళిపించాడు. 11 ఓవర్లకు బెంగళూరు 90/0తో నిలిచింది. బలమైన పునాది పడడడంతో భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ గొప్పగా పుంజుకున్న సన్‌రైజర్స్‌ బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. నిలదొక్కుకున్న పడిక్కల్‌, ఫించ్‌లను విజయ్‌ శంకర్‌, సందీప్‌ శర్మ వరుస ఓవర్లలో ఔట్‌ చేయగా.. కోహ్లి (13 బంతుల్లో 14) కూడా ఎక్కువసేపేమీ నిలవలేదు. 16వ ఓవర్లో అతడు నిష్క్రమించేటప్పటికి స్కోరు 123 పరుగులే. అయినా బెంగళూరు 160 దాటిందంటే కారణం డివిలియర్సే. ఏబీ తనదైన విధ్వంసంతో అభిమానులను ఉర్రూతలూగించాడు. మెరుపు విన్యాసాలతో అలరించాడు. భువి, నటరాజన్‌ ఓవర్లలో ఒక్కో ఫోర్‌ కొట్టిన అతడు.. 19వ ఓవర్లో సందీప్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు కళ్లు చెదిరే సిక్స్‌లు కొట్టాడు. చివరి ఓవర్లో.. మనీష్‌ పాండే చక్కని ఫీల్డింగ్‌ కారణంగా ఏబీ రనౌటయ్యాడు.  డివిలియర్స్‌.. కోహ్లీతో మూడో వికెట్‌కు 33, శివమ్‌ దూబే (7)తో నాలుగో వికెట్‌కు 39   పరుగులు జోడించాడు. భువనేశ్వర్‌ (0/25) వికెట్లు తీయకున్నా పొదుపుగా బౌలింగ్‌ చేశాడు.

బెంగళూరు ఇన్నింగ్స్‌: దేవ్‌దత్‌ పడిక్కల్‌ (బి) విజయ్‌ శంకర్‌ 56; ఫించ్‌ ఎల్బీ (బి) అభిషేక్‌ శర్మ 29; కోహ్లి (సి) రషీద్‌ (బి) నటరాజన్‌ 14; డివిలియర్స్‌ రనౌట్‌ 51; శివమ్‌ దూబే రనౌట్‌ 7; ఫిలిప్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 5

మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 163;

వికెట్ల పతనం: 1-90, 2-90, 3-123, 4-162; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-25-0; సందీప్‌ శర్మ 4-0-36-0; నటరాజన్‌ 4-0-34-1; మిచెల్‌ మార్ష్‌ 0.4-0-6-0; విజయ్‌ శంకర్‌ 1.2-0-14-1; రషీద్‌ ఖాన్‌ 4-0-31-0; అభిషేక్‌ 2-0-16-1
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ రనౌట్‌ 6; బెయిర్‌స్టో (బి) చాహల్‌ 61; మనీష్‌ పాండే (సి) సైని (బి) చాహల్‌ 34; ప్రియమ్‌ గార్గ్‌ (బి) దూబె 12; విజయ్‌ శంకర్‌ (బి) చాహల్‌ 0; అభిషేక్‌శర్మ రనౌట్‌ 7; రషీద్‌ఖాన్‌ (బి) సైని 6; భువనేశ్వర్‌ (బి) సైని 0; సందీప్‌శర్మ (సి) కోహ్లి (బి) స్టెయిన్‌ 9; మార్ష్‌ (సి) కోహ్లి (బి) దూబె 0; నటరాజన్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 15;

మొత్తం: (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 153; 

వికెట్ల పతనం: 1-18, 2-89, 3-121, 4-121, 5-129, 6-135, 7-141, 8-142, 9-143; బౌలింగ్‌: స్టెయిన్‌ 3.4-0-33-1; ఉమేశ్‌ 4-0-48-0; సైని 4-0-25-2; సుందర్‌ 1-0-7-0; చాహల్‌  4-0-18-3; దూబె 3-0-15-2

కుర్రాడు భలే కొట్టాడే..

పీఎల్‌-13 సీజన్‌కు ముందు ఆసక్తి రేపిన యువ ఆటగాళ్లలో ఒకడు దేవ్‌దత్‌ పడిక్కల్‌. తనపై పెట్టుకున్న అంచనాలను అందుకుంటూ.. తొలి మ్యాచ్‌లోనే చక్కటి ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిలో పడ్డాడీ కుర్రాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కొత్త ఓపెనర్‌గా ప్రయోగించిన ఈ కర్ణాటక కుర్రాడు అర్ధశతకంతో సత్తాచాటాడు. అరంగేట్ర మ్యాచ్‌ అంటే ఎంతో ఒత్తిడి, బెరుకు, భయం ఉంటుంది. కానీ అవేమీ లేకుండా ఆత్మవిశ్వాసంతో ఆడాడు దేవ్‌దత్‌. ఓ వైపు భారీ షాట్లు ఆడేందుకు ఫించ్‌ ఇబ్బంది పడుతుంటే.. దేవదత్‌ మాత్రం స్వేచ్ఛగా బౌండరీలు బాదాడు. నిరుడు వేలంలోనే అతణ్ని బెంగళూరు సొంతం చేసుకున్నప్పటికీ తుది జట్టులో ఆడించలేదు. కానీ ఈసారి తనను ఆడించక తప్పని పరిస్థితి కల్పించాడతను. గత దేశవాళీ సీజన్‌లో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ (12 మ్యాచ్‌ల్లో 580 పరుగులు)లో, విజయ్‌ హజారె వన్డే టోర్నీ (11 మ్యాచ్‌ల్లో 609 పరుగులు)లో దేవ్‌దత్‌యే టాప్‌స్కోరర్‌. ఆ రెండు టోర్నీల్లో కర్ణాటక టైటిల్‌ గెలవడంలో అతడిది కీలక పాత్ర. నిలకడ, దూకుడు రెండూ ఉన్న దేవ్‌దత్‌.. టీ20ల్లో 175.75 స్ట్రైక్‌ రేట్‌తో కొనసాగుతుండటం విశేషం. ఐపీఎల్‌లో అతను ఇదే జోరు కొనసాగిస్తే టీమ్‌ఇండియా వైపూ అడుగులేసే అవకాశముంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.