close

తాజా వార్తలు

Updated : 23/09/2020 05:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాయల్స్‌ ధమాకా

శాంసన్‌, ఆర్చర్‌ ధనాధన్‌
స్మిత్‌ సమయోచిత ఇన్నింగ్స్‌

చెన్నైకి రాజస్థాన్‌ ఝలక్‌

షార్జా

భీకరమైన ముంబయి జట్టునే తొలి మ్యాచ్‌లో ఓడించింది చెన్నై సూపర్‌కింగ్స్‌. ఇటు చూస్తే రాజస్థాన్‌ స్టోక్స్‌, బట్లర్‌ లాంటి మేటి ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగింది. మ్యాచ్‌లో చెన్నై గెలుపు నల్లేరుపై నడకే అని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. కానీ మ్యాచ్‌ మొదలైన కాసేపటికే ఆ అంచనాలు తలకిందులవ్వడం మొదలయ్యాయి. సింగిల్స్‌ తీసినంత సులువుగా సిక్సర్లు బాదిన సంజు శాంసన్‌.. తనదైన శైలిలో దూకుడు చూపించిన స్మిత్‌.. చివర్లో వచ్చి విధ్వంసం సృష్టించిన ఆర్చర్‌ కలిసి రాయల్స్‌కు కొండంత స్కోరునందించారు. ఆపై డుప్లెసిస్‌ ఎంతగా పోరాడినా.. మిగతా బ్యాట్స్‌మెన్‌ కూడా కొంత ప్రయత్నించినా.. ఆ స్కోరునందుకోవడం సాధ్యం కాలేదు. టోర్నీలో అతి తక్కువ అంచనాలతో బరిలోకి దిగిన రాయల్స్‌.. అదిరే విజయంతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకొంది.
 

పీఎల్‌-13లో రాజస్థాన్‌ రాయల్స్‌ భలే బోణీ కొట్టింది. ఇప్పటికే ఓ విజయం సాధించి ఫేవరెట్‌గా బరిలోకి దిగిన చెన్నైకి తన తొలి మ్యాచ్‌లో షాకిచ్చింది. సంజు శాంసన్‌ (74; 32 బంతుల్లో 1×4, 9×6), స్టీవ్‌ స్మిత్‌ (69; 47 బంతుల్లో 4×4, 4×6), జోఫ్రా ఆర్చర్‌ (27 నాటౌట్‌; 8 బంతుల్లో 4×6) మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్‌ మొదట 7 వికెట్లకు 216 పరుగులు చేసింది. అనంతరం డుప్లెసిస్‌ (72; 37 బంతుల్లో 1×4, 7×6) చెన్నైని గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఆ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులే చేయగలిగింది. రాహుల్‌ తెవాతియా (3/37) కీలక సమయాల్లో వికెట్లు తీసి ఆ జట్టును గట్టి దెబ్బ తీశాడు. శాంసన్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.
అతను పోరాడినా...: స్కోరు చూస్తే.. రాయల్స్‌ స్కోరుకు చెన్నై చేరువగా వచ్చినట్లు అనిపిస్తుంది కానీ.. ఆ జట్టు చాలా ముందుగానే పోటీ నుంచి తప్పుకుంది. విజయ్‌ (21)తో కలిసి వాట్సన్‌ (33; 21 బంతుల్లో 1×4, 4×6) సూపర్‌కింగ్స్‌కు మంచి ఆరంభమే ఇచ్చాడు. అతనున్నంతసేపూ చెన్నై అంత భారీ లక్ష్యాన్ని కూడా ఛేదిస్తుందనే అనిపించింది. అయితే వాట్సన్‌ను బౌల్డ్‌ చేసిన తెవాతియా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. క్రీజులోకి వచ్చీ రాగానే ఒక ఫోర్‌, రెండు సిక్సర్లు బాది ఊపుమీద కనిపించిన కరన్‌ (17)తో పాటు కొత్త కుర్రాడు రుతురాజ్‌ (0)ను కూడా వరుస బంతుల్లో ఔట్‌ చేసిన తెవాతియా చెన్నైని కోలుకోలేని దెబ్బ తీశాడు. జాదవ్‌ (22)తో కలిసి డుప్లెసిస్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు కానీ.. ఆలోపు సాధించాల్సిన రన్‌రేట్‌ బాగా పెరిగిపోయింది. సమీకరణం 36 బంతుల్లో 102తో అసాధ్యంగా మారిన స్థితిలో ధోని(29 నాటౌట్‌) క్రీజులోకి వచ్చాడు. కానీ అతను సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. డుప్లెసిస్‌ శాయశక్తులా ప్రయత్నిస్తూ భారీ షాట్లు ఆడినా.. జట్టును లక్ష్యానికి చేరువ చేయలేకపోయాడు. 8 బంతుల్లో 38 పరుగులు చేయాల్సిన దశలో డుప్లెసిస్‌ ఔటైపోయాడు. చివరి ఓవర్లో ధోని బాదిన మూడు వరుస సిక్సర్లు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాయి.

దంచుడే దంచుడు: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌.. తమపై ఉన్న అంచనాలకు భిన్నంగా చెలరేగిపోయింది. బట్లర్‌ అందుబాటులో లేకపోవడంతో ఓపెనింగ్‌కు వచ్చిన స్టీవ్‌ స్మిత్‌ జట్టును ముందుండి నడిపించగా.. అతడి తోడుగా వచ్చిన కుర్రాడు యశస్వి జైశ్వాల్‌ (6) ఆరంభంలోనే వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్‌ సంచలన బ్యాటింగ్‌తో చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 4 ఓవర్లకు 26/1తో ఉన్న రాయల్స్‌.. వీళ్లిద్దరి ధాటికి 5 ఓవర్లలో ఏకంగా 74 పరుగులు రాబట్టి, 9 ఓవర్లకే 100 పరుగులకు చేరడం విశేషం. 11 ఓవర్లకు 129/1తో ఉన్న రాజస్థాన్‌.. 230-240 మధ్య స్కోరు చేసేలా కనిపించింది. అయితే తర్వాతి ఓవర్లో శాంసన్‌ ఔటవడంతో స్కోరు వేగం తగ్గింది. అక్కడి నుంచి చెన్నై బౌలర్లు పుంజుకుని క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ వెళ్లారు. 19వ ఓవర్‌ రెండో బంతికి స్మిత్‌ ఔటయ్యే సమయానికి రాయల్స్‌ స్కోరు 178/7. దీంతో రాయల్స్‌ 200 చేరడం కూడా కష్టమే అనిపించింది. అలాంటిది ఆ జట్టు 216 పరుగులు చేసిందంటే అది ఆర్చర్‌ పుణ్యమే. ఎంగిడి వేసిన చివరి ఓవర్లో అతను వరుసగా నాలుగు సిక్సర్లు బాదడంతో రాజస్థాన్‌ ఊహించని స్కోరునందుకుంది.
రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) అండ్‌ (బి) చాహర్‌ 6; స్మిత్‌ (సి) జాదవ్‌ (బి) సామ్‌ కరన్‌ 69; శాంసన్‌ (సి) చాహర్‌ (బి) ఎంగిడి 74; మిల్లర్‌ రనౌట్‌ 0; ఉతప్ప (సి) డుప్లెసిస్‌ (బి) చావ్లా 5; తెవాతియా ఎల్బీ (బి) సామ్‌ కరన్‌ 10; పరాగ్‌ (సి) ధోని (బి) సామ్‌ కరన్‌ 6; టామ్‌ కరన్‌ నాటౌట్‌ 10; ఆర్చర్‌ నాటౌట్‌ 27; ఎక్స్‌ట్రాలు 9

మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 216;

వికెట్ల పతనం: 1-11, 2-132, 3-134, 4-149, 5-167, 6-173, 7-178; బౌలింగ్‌: చాహర్‌ 4-0-31-1; సామ్‌ కరన్‌ 4-0-33-3; ఎంగిడి 4-0-56-1; జడేజా 4-0-40-0; చావ్లా 4-0-55-1
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: విజయ్‌ (సి) టామ్‌ (బి) గోపాల్‌ 21; వాట్సన్‌ (బి) తెవాతియా 33; డుప్లెసిస్‌ (సి) శాంసన్‌ (బి) ఆర్చర్‌ 72; సామ్‌ కరన్‌ (స్టంప్డ్‌) శాంసన్‌ (బి) తెవాతియా 17; రుతురాజ్‌ గైక్వాడ్‌ (స్టంప్డ్‌) శాంసన్‌ (బి) తెవాతియా 0; జాదవ్‌ (సి) శాంసన్‌ (బి) టామ్‌ కరన్‌ 22; ధోని నాటౌట్‌ 29; జడేజా నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 5;

మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 200;

వికెట్ల పతనం: 1-56, 2-58, 3-77, 4-77, 5-114, 6-179; బౌలింగ్‌: జైదేవ్‌ ఉనద్కత్‌ 4-0-44-0; ఆర్చర్‌ 4-0-26-1; శ్రేయస్‌ గోపాల్‌ 4-0-38-1; టామ్‌ కరన్‌ 4-0-54-1; రాహుల్‌ తెవాతియా 4-0-37-3

ప్రశాంతంగా పని చేసేశాడు

భావోద్వేగాల్ని ప్రదర్శించకుండా.. చాలా ప్రశాంతంగా కనిపిస్తూ.. క్రీజులో పెద్దగా కదలకుండా, హడావుడి పడకుండానే.. బ్యాటుతో విధ్వంసం సృష్టించే ఆటగాళ్లు కొందరుంటారు. క్రిస్‌ గేల్‌ లాంటి వాళ్లు అందుకు ఉదాహరణ. కేరళ కుర్రాడు సంజు శాంసన్‌ కూడా ఈ తరహానే. ఐపీఎల్‌లో ఇప్పటికే చాలాసార్లు అతడి విధ్వంసాలు చూశాం. లీగ్‌లో అతను సెంచరీ కూడా కొట్టాడు ఓసారి. మంగళవారం కూడా తనదైన శైలి విధ్వంసంతో ఆకట్టుకున్నాడు శాంసన్‌. సింగిల్స్‌ తీసినంత సులువుగా అతను సిక్సర్లు బాదేశాడు. 32 బంతుల అతడి ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లుండటం విశేషం. అయిదో ఓవర్లో కరన్‌ బంతిని సిక్సర్‌గా మలచడంతో మొదలైంది అతడి జోరు. స్పిన్నర్లు చావ్లా, జడేజాల బౌలింగ్‌లో అతను సిక్సర్ల మోత మోగించేశాడు. వీళ్లిద్దరూ కలిసి అతడికి 7 సిక్సర్లు సమర్పించుకున్నారు. 19 బంతుల్లోనే, 8వ ఓవర్‌లోపే అతడి అర్ధశతకం పూర్తయింది. సంజు జోరుతో ఒక దశలో చెన్నై కెప్టెన్‌ ధోని ఏమీ పాలుపోనట్లు కనిపించాడు. 11 ఓవర్లు ముగిసేసరికే 30 బంతుల్లో 73 పరుగులు చేసిన సంజు.. శతకం బాదడం లాంఛనమే అనిపించింది. కానీ తర్వాతి ఓవర్లో ఎంగిడి అతణ్ని ఔట్‌ చేసి చెన్నైకి ఉపశమనాన్నిచ్చాడు.

మళ్లీ అంపైరాంగ్‌

రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ టామ్‌ కరన్‌ను అంపైర్‌ ఔటివ్వడంపై చిన్న వివాదం నెలకొంది. దీపక్‌ చాహర్‌ బంతి టామ్‌ తొడ ప్యాడ్‌కు తాకి వెనక్కి వెళ్లగా.. ధోని అందుకున్నాడు. చాహర్‌ అప్పీల్‌ చేయగానే.. అంపైర్‌ ఔటిచ్చేశాడు. టామ్‌ సమీక్ష కోరాడు కానీ.. రాయల్స్‌కు అప్పటికే రివ్యూలు అయిపోయాయి. దీంతో టామ్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. ఈలోపు అంపైర్లిద్దరూ చర్చించుకున్నారు. రివ్యూ కోరారు. అంపైర్‌ క్యాచ్‌ ఔట్‌ అన్న ఉద్దేశంతో వేలెత్తినట్లు స్పష్టం కాగా.. అసలు బంతి బ్యాట్‌కే తాకలేదని, ధోని అందుకునే ముందు బంతి నేలను కూడా తాకిందని వెల్లడైంది. ఎల్బీకి కూడా అవకాశం లేకపోవడంతో టామ్‌ నాటౌట్‌గా తేలాడు. ఇప్పటికే లీగ్‌లో అంపైరింగ్‌పైవిమర్శలొస్తుండగా.. తాజా వివాదంతో అవి మరింత పెరిగాయి.
 

2 బంతుల్లో 27 పరుగులు

క్రికెట్లో సాధారణంగా ఒక బంతికి చేయగల గరిష్ట పరుగులు 6. ఆ లెక్కన రెండు బంతులకు 12 పరుగులు చేయొచ్చు. అయితే మంగళవారం చెన్నైతో మ్యాచ్‌లో రాజస్థాన్‌ మాత్రం 2 బంతుల్లో ఏకంగా 27 పరుగులు చేసింది. ఈ అద్భుతం ఆర్చర్‌ కళ్లు చెదిరే బ్యాటింగ్‌, ఎంగిడి పేలవ బౌలింగ్‌ వల్ల సాధ్యమైంది. 19వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన ఆర్చర్‌కు ఎంగిడి వేసిన చివరి ఓవర్లో బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది. ఎదుర్కొన్న తొలి బంతినే అతను బౌలర్‌ తలమీదుగా భారీ సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతికి మరింతగా శక్తిని ప్రయోగించిన ఆర్చర్‌.. మిడ్‌వికెట్‌లో స్టేడియం అవతల పడేలా బంతిని కొట్టాడు. దీంతో ఒత్తిడికి గురైన ఎంగిడి మరో పేలవ బంతి వేశాడు. ఈసారి మిడ్‌వికెట్‌, లాంగాన్‌ మధ్య ఫ్లాట్‌ సిక్సర్‌ అందుకున్నాడు ఆర్చర్‌. ఇది నోబాల్‌ కూడా కావడంతో ఫ్రీహిట్‌ వచ్చింది. బౌలర్‌ తల మీదుగా మరో సిక్సర్‌ బాదేశాడతను. ఇది కూడా నోబాలే కావడంతో మళ్లీ ఫ్రీహిట్‌ వచ్చింది. తర్వాత వైడ్‌ వేయడంతో ఫ్రీహిట్‌ కొనసాగింది. చివరికి డాట్‌ బాల్‌ వేసి బయటపడ్డాడు. అంటే అధికారికంగా మూడో బంతి పడటానికి ముందే.. ఈ ఓవర్లో 27 పరుగులు (6, 6, 6+1, 6+1, 1) వచ్చాయి. చివరి 4 బంతుల్లో మూడే పరుగులు ఇవ్వడం ద్వారా ఎంగిడి ఈ ఓవర్లో 30 పరుగులతో సరిపెట్టుకున్నాడు.


33

ఈ మ్యాచ్‌లో కొట్టిన సిక్స్‌లు. ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌ల రికార్డు సమమైంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.