close

తాజా వార్తలు

Published : 25/09/2020 02:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాహుల్‌ 132.. బెంగళూరు 109

ఐపీఎల్‌ 13లో తొలి శతకం కేఎల్‌దే

పంజాబ్‌ చేతిలో బెంగళూరు చిత్తు

దుబాయ్‌

యూఏఈ కూడా బెంగళూరు రాత మార్చలేదేమో! ఐపీఎల్‌ వేదిక మారినా.. కోహ్లీసేన ఆట మాత్రం అదే. విజయంతో టోర్నీలో బోణీ కొట్టిన ఆ జట్టు.. రెండో మ్యాచ్‌లోనే పాత తడబాటును ఏమాత్రం తేడా లేకుండా ప్రదర్శించింది. కనీస పోరాటమైనా లేకుండా చేతులెత్తేసింది. అదే సమయంలో పంజాబ్‌ బలంగా పుంజుకుంది. కెప్టెన్‌ రాహుల్‌ అదరగొట్టిన వేళ.. ఆరంభ మ్యాచ్‌ షాక్‌ నుంచి తేరుకుంటూ బెంగళూరును చిత్తు చిత్తుగా ఓడించింది. చూడచక్కని బ్యాటింగ్‌తో అభిమానులను మంత్ర ముగ్దుల్ని చేసిన రాహుల్‌.. కడ బంతి వరకూ క్రీజులో నిలిచి ఈ సీజన్‌కే తొలి శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

పంజాబ్‌ మురిసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (132 నాటౌట్‌; 69 బంతుల్లో 144, 76) శతక్కొట్టడంతో గురువారం అత్యంత ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై ఘనవిజయం సాధించింది. రాహుల్‌ విధ్వంసక ముగింపుతో మొదట పంజాబ్‌ 3 వికెట్లకు 206 పరుగులు చేసింది. ఛేదనలో బెంగళూరు చతికిలపడింది. బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. రవి బిష్ణోయ్‌ (3/32), మురుగన్‌ అశ్విన్‌ (3/21), కాట్రెల్‌ (2/17) ధాటికి 17 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. రాహుల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

బెంగళూరు టపటపా..: మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్నా చేతులెత్తేయడం బెంగళూరుకు అలవాటే. అదే కథ ఇప్పుడు పునరావృతమైంది. భారీ లక్ష్యఛేదనలో ఆ జట్టు నుంచి కనీస ప్రతిఘటన కరవైంది. మూడు ఓవర్లయినా కాకముందే, పట్టుమని పది పరుగులైనా చేయకముందే మూడు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా అడుగులేసింది. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (1), ఫిలిప్‌ (0), కెప్టెన్‌ కోహ్లి (1) త్వరగా వెనుదిరిగారు. ఫించ్‌, డివిలియర్స్‌ క్రీజులో ఉండడంతో అప్పటికీ బెంగళూరుకు ఆశలు ఉన్నాయి. ఇద్దరూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ అది కాసేపే. ఇద్దరూ వరుస ఓవర్లలో ఔటయ్యారు. ఫించ్‌ (20)ను బిష్ణోయ్‌, డివిలియర్స్‌ (28)ను మురుగన్‌ అశ్విన్‌ వెనక్కి పంపడంతో బెంగళూరు 57/5కే పరిమితమైంది. ఆ తర్వాత పరాజయం లాంఛనమే. మిగతా బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. కాస్త నిలబడ్డ వాషింగ్టన్‌ సుందర్‌ (30) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

రాహుల్‌ ధనాధన్‌: పంజాబ్‌ 200 దాటిందంటే ఏకైక కారణం కెప్టెన్‌ కేఎల్‌ రాహులే. ఆద్యంతమూ క్రీజులో నిలిచిన అతడు సరైన సమయంలో గేర్లు మార్చి ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపునిచ్చాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోరును అందించాడు. ఆరంభంలో ఓపెనర్లు మయాంక్‌, రాహుల్‌ మరీ రెచ్చిపోకున్నా స్ట్రైక్‌రొటేట్‌ చేసుకుంటూ, బంతి ఏమాత్రం గతి తప్పినా చక్కని షాట్లతో బౌండరీకి తరలించడంతో పవర్‌ప్లే ముగిసే సరికి పంజాబ్‌ వికెట్‌ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఓ ముచ్చటైన గూగ్లీతో చాహల్‌.. మయాంక్‌ అగర్వాల్‌ (26; 20 బంతుల్లో 44)ను బౌల్డ్‌ చేసినా రాహుల్‌ మెరుగైన బ్యాటింగ్‌ను కొనసాగించడంతో 10 ఓవర్లకు 90/1 నిలిచింది. అయితే బలమైన పునాది పడ్డా, రాహుల్‌ క్రీజులోనే ఉన్నా తర్వాతి ఓవర్లలో పంజాబ్‌ స్కోరు వేగం తగ్గిందే తప్ప పెరగలేదు. 17వ ఓవర్లు ముగిసే సరికి పూరన్‌ (17), ప్రమాదకర మ్యాక్స్‌వెల్‌ (5)లనూ కోల్పోయిన పంజాబ్‌ స్కోరు 146/3. పెద్దగా బౌండరీలు వెళ్లట్లేని పరిస్థితుల్లో పంజాబ్‌ ఎక్కువ స్కోరేమీ చేయలేదనిపించింది. ఇక రెండొందలన్నది ఏమాత్రం ఊహించని విషయం. కానీ సిక్స్‌లు, ఫోర్ల మోతతో చివర్లో రాహుల్‌ చిన్నపాటి సునామీనే సృష్టించాడు.

ఆఖరి మూడు ఓవర్లలో..: అప్పటిదాకా చక్కని బ్యాటింగ్‌తో పంజాబ్‌ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచిన రాహుల్‌ ఆఖరి మూడు ఓవర్లలో విశ్వరూపాన్ని చూపించాడు. బెంగళూరు బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ అభిమానులను అలరించాడు. సైని వేసిన 18వ ఓవర్లో ఓ ఫోర్‌ కొట్టిన అతడు.. 19వ ఓవర్లో స్టెయిన్‌కు చుక్కలు చూపించాడు. రెండు ఫోర్లు, మూడు సిక్స్‌లతో ఆ ఓవర్లో ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్లోనూ అంతే. ఈసారి బలైంది శివమ్‌ దూబే. రాహుల్‌ ఆఖరి మూడు బంతుల్లో వరుసగా 4, 6, 6 బాదేశాడు. రాహుల్‌ వీరవిహారంతో ఆఖరి 3 ఓవర్లలో పంజాబ్‌ 60 పరుగులు రాబట్టింది. కోహ్లి రెండు తేలికైన క్యాచ్‌లు వదిలేయడం రాహుల్‌కు కలిసొచ్చింది.పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ నాటౌట్‌ 132; మయాంక్‌ అగర్వాల్‌ (బి) చాహల్‌ 26; పూరన్‌ (సి) డివిలియర్స్‌ (బి) దూబే 17; మ్యాక్స్‌వెల్‌ (సి) ఫించ్‌ (బి) దూబే 5; కరుణ్‌ నాయర్‌ నాటౌట్‌ 15; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 206; వికెట్ల పతనం: 1-57, 2-114, 3-128; బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 3-0-35-0; స్టెయిన్‌ 4-0-57-0; సైని 4-0-37-0; చాహల్‌ 4-0-25-1; వాషింగ్టన్‌ సుందర్‌ 2-0-13-0; శివమ్‌ దూబే 3-0-33-2

బెంగళూరు ఇన్నింగ్స్‌: దేవ్‌దత్‌ (సి) బిష్ణోయ్‌ (బి) కాట్రెల్‌ 1; ఫించ్‌ (బి) బిష్ణోయ్‌ 20; ఫిలిప్‌ ఎల్బీ (బి) షమి 0; కోహ్లి (సి) బిష్ణోయ్‌ (బి) కాట్రెల్‌ 1; డివిలియర్స్‌ (సి) సర్ఫ్‌రాజ్‌ (బి) మురుగన్‌ అశ్విన్‌ 28; సుందర్‌ (సి) మయాంక్‌ (బి) బిష్ణోయ్‌ 30; దూబె (బి) మాక్స్‌వెల్‌ 12; ఉమేశ్‌ (బి) బిష్ణోయ్‌ 0; సైని (బి) మురుగన్‌ అశ్విన్‌ 6; స్టెయిన్‌ నాటౌట్‌ 1; చాహల్‌ ఎల్బీ (బి) మురుగన్‌ అశ్విన్‌ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (17 ఓవర్లలో ఆలౌట్‌) 109; వికెట్ల పతనం: 1-2, 2-3, 3-4, 4-53, 5-57, 6-83, 7-88, 8-101, 9-106; బౌలింగ్‌: కాట్రెల్‌ 3-0-17-2; షమి 3-0-14-1; రవి బిష్ణోయ్‌ 4-0-32-3; మురుగన్‌ అశ్విన్‌ 3-0-21-3; నీషమ్‌ 2-0-13-0; మాక్స్‌వెల్‌ 2-0-10-1

1 ఈ సీజన్లో రాహుల్‌దే తొలి సెంచరీ

6 ఐపీఎల్‌లో శతకం చేసిన ఆరో కెప్టెన్‌ రాహుల్‌. సచిన్‌, సెహ్వాగ్‌, గిల్‌క్రిస్ట్‌, కోహ్లి, వార్నర్‌ అతనికన్నా ముందున్నారు.

132రాహుల్‌ స్కోరు. భారత్‌ తరఫున ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు అతడిదే. పంత్‌ (128)ను దాటాడ


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.