close

తాజా వార్తలు

Updated : 28/09/2020 10:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

223.. చాల్లేదు

మయాంక్‌ శతకం వృథా

రాజస్థాన్‌ రికార్డు ఛేదన

224 పరుగుల లక్ష్యం ఉఫ్‌

తెవాతియా సంచలన ఇన్నింగ్స్‌

షార్జా

నిజంగా పరుగుల తుఫానే..!

మయాంక్‌ కళ్లు చెదిరే శతకం (45 బంతుల్లో) చిన్నబోయింది. రాజస్థాన్‌ 223 పరుగుల స్కోరు సైతం చాల్లేదు. అది ఊహకందని ఉతుకుడు. అది నమ్మశక్యంకాని బాదుడు. రాజస్థాన్‌ అద్భుతమే చేసింది. అసాధ్యం అనుకున్న ఛేదనను మరో మూడు బంతులు ఉండగానే పూర్తి చేసి ఔరా అనిపించింది. సంజు శాంసన్‌, స్మిత్‌ వీర విధ్వంసానికి.. అనామకుడనుకున్న తెవాతియా అద్భుత హిట్టింగ్‌ తోడవడంతో కొండంత లక్ష్యాన్ని సైతం రాయల్స్‌ పిండి చేసింది.ఈ సీజన్‌ రేసును రసవత్తరంగా మార్చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. తెవాతియా ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

రాజస్థాన్‌ రాయల్స్‌కు సంచలన విజయం. పరుగుల వరద పారిన పోరులో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను మట్టికరిపించింది. మయాంక్‌ అగర్వాల్‌ (106;50 బంతుల్లో 10×4,7×6) మెరుపు శతకానికి కేఎల్‌ రాహుల్‌ (69; 54 బంతుల్లో 7×4, 1×6) చక్కని బ్యాటింగ్‌తో తోడవడంతో మొదట పంజాబ్‌ 2 వికెట్లకు 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. సంజు శాంసన్‌ (85;42 బంతుల్లో 4×4, 7×6), రాహుల్‌ తెవాతియా (53; 31 బంతుల్లో 7×6), స్మిత్‌ (50;27 బంతుల్లో 7×4, 2×6)ల ఊచకోతతో లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సంజుకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

ముందు సంజు.. తర్వాత తెవాతియా: భారీ లక్ష్య ఛేదన. ఆపై బట్లర్‌ 5 పరుగులకే ఔటవడంతో రాజస్థాన్‌కు కష్టమే అనుకున్నారంతా. కానీ సంజు, స్మిత్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. రాజస్థాన్‌ స్కోరు 9వ ఓవర్లోనే వందకు చేరుకుంది. అదే స్కోరు వద్ద స్మిత్‌ ఔటైనప్పటికీ సంజు విధ్వంసాన్ని కొనసాగిస్తూ రాజస్థాన్‌ను లక్ష్యం దిశగా నడిపించాడు. మ్యాక్స్‌వెల్‌ వేసిన 16వ ఓవర్లో మూడు సిక్స్‌లు బాదాడు. చివరి నాలుగు ఓవర్లలో 63 పరుగులు చేయాల్సిన స్థితిలో అతడు ఔట్‌ కావడంతో రాజస్థాన్‌కు కష్టమే అనిపించింది. చివరి మూడు ఓవర్లలో ఆ జట్టు 51 పరుగులు చేయాల్సిన స్థితిలో మ్యాచ్‌ పంజాబ్‌ చేతుల్లోకి వచ్చినట్లేనని అనుకున్నారంతా. కానీ అభిమానులను ఆశ్చర్యానికి, పంజాబ్‌ను దిగ్భ్రాంతికి గురి చేస్తూ కాట్రెల్‌ వేసిన 18వ ఓవర్లో ఏకంగా ఐదు సిక్స్‌లు బాది మ్యాచ్‌ను రాజస్థాన్‌ వైపు తిప్పేశాడు తెవాతియా. 19వ ఓవర్లో ఆర్చర్‌ రెండు సిక్స్‌లు, తెవాతియా ఓ సిక్స్‌ బాదడంతో రాజస్థాన్‌ లక్ష్యం చాలా తేలికైపోయింది. ఆ ఓవర్‌ చివరి బంతికి తెవాతియా ఔట్‌ కాగా.. చివరి ఓవర్లో రాజస్థాన్‌ రెండు పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ అశ్విన్‌ మురుగన్‌.. తొలి రెండు బంతుల్లో ఒక్క పరుగూ ఇవ్వకుండా పరాగ్‌ను ఔట్‌ చేయడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. కానీ మూడో బంతికి ఫోర్‌ కొట్టి టామ్‌ కరన్‌ ఆ ఉత్కంఠకు తెరదించాడు.

వారెవ్వా మయాంక్‌: బాదుడే బాదుడు. దంచుడే దంచుడు. చిన్నదైన షార్జా మైదానంలో సింగిల్స్‌ను చిన్నచూపు చూస్తూ.. ప్రతి బంతినీ బౌండరీ దాటించాలన్న కసితో రెచ్చిపోతూ.. ఫీల్డర్లను నిస్సహాయుల్ని చేస్తూ బౌలర్లను మామూలుగా ఉతకలేదతడు. మొదలైనప్పటి నుంచి నిష్క్రమించే వరకు ఫోర్లు, సిక్స్‌ల మోతే. ఒక్క మాటలో చెప్పాలంటే మాయాంక్‌ ఇన్నింగ్స్‌ ఓ ఊచకోత. అలాగని అడ్డంగా ఊపలేదు. చక్కని క్రికెటింగ్‌లో షాట్లతో అభిమానులను అలరించాడు. రాహుల్‌తో కలిసి పంజాబ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించిన మయాంక్‌.. సాధికారికంగా బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 26 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. ఆ తర్వాత జోరు మరింత పెంచాడు. అర్ధశతకం నుంచి శతకానికి చేరుకోవడానికి కేవలం 19 బంతులు తీసుకున్నాడంటేనే అతడి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్ఛు రాహుల్‌ మరీ విధ్వంసం సృష్టించకున్నా విలువైన ఇన్నింగ్సే ఆడాడు. 15 ఓవర్లకే 172/0తో నిలిచిన పంజాబ్‌ స్కోరు 250 దాటినా ఆశ్చర్యం లేదనిపించింది. కానీ 17వ ఓవర్లో మయాంక్‌, తర్వాతి ఓవర్లో రాహుల్‌ ఔట్‌ కావడంతో స్కోరు కాస్త తగ్గింది. మయాంక్‌, రాహుల్‌ తొలి వికెట్‌కు 183 పరుగులు జోడించారు.

పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) గోపాల్‌ (బి) రాజ్‌పుత్‌ 69; మయాంక్‌ అగర్వాల్‌ (సి) శాంసన్‌ (బి) టామ్‌ కరన్‌ 106; మ్యాక్స్‌వెల్‌ నాటౌట్‌ 13; పూరన్‌ నాటౌట్‌ 25; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 2 వికెట్లకు) 223;వికెట్ల పతనం: 1-183, 2-194; బౌలింగ్‌: ఉనద్కత్‌ 3-0-30-0; రాజ్‌పుత్‌ 4-0-39-1; ఆర్చర్‌ 4-0-46-0; శ్రేయస్‌ గోపాల్‌ 4-0-44-0; తెవాతియా 1-0-19-0; టామ్‌ కరన్‌ 4-0-44-1

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌: బట్లర్‌ (సి) సర్ఫ్‌రాజ్‌ (బి) కాట్రెల్‌ 4; స్మిత్‌ (సి) షమి (బి) నీషమ్‌ 50; సంజు శాంసన్‌ (సి) రాహుల్‌ (బి) షమి 85; తెవాతియా (సి) మయాంక్‌ (బి) షమి 53; ఉతప్ప (సి) పూరన్‌ (బి) షమి 9; ఆర్చర్‌ నాటౌట్‌ 13; పరాగ్‌ (బి) మురుగన్‌ అశ్విన్‌ 0; టామ్‌ కరన్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (19.3 ఓవర్లలో 6 వికెట్లకు) 226; వికెట్ల పతనం: 1-19, 2-100, 3-161, 4-203, 5-222, 6-222; బౌలింగ్‌: కాట్రెల్‌ 3-0-52-1; షమి 4-0-53-3; బిష్ణోయ్‌ 4-0-34-0; నీషమ్‌ 4-0-40-1; మురుగన్‌ అశ్విన్‌ 1.3-0-16-1; మ్యాక్స్‌వెల్‌ 3-0-29-0


తడిసి ముద్ధ

ది కదా ఐపీఎల్‌ అభిమానులకు కావాల్సింది. పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ కొట్టు కొట్టు కొట్టు అంటూ సాగిపోతే.. రాయల్స్‌ ఆటగాళ్లు దంచు దంచు దంచు అంటూ దూసుకెళ్లిపోయారు. పరుగుల పోరులో నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డ ఈ రెండు జట్ల ఆటగాళ్లు అదిరిపోయే విందునందించారు. షార్జా స్టేడియాన్ని, టీవీలో మ్యాచ్‌ చూసిన వీక్షకులను పరుగుల వర్షంలో ముంచెత్తారు. ఒక జట్టు 223 పరుగులు చేయడమే ఎక్కువనుకుంటే.. ఆ స్కోరు ఇంకో 3 బంతులుండగానే దాటేసి సంచలనం సృష్టించింది మరో జట్టు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మొత్తం నమోదైన పరుగులు 449 కాగా.. అందులో సిక్సర్లు 29 కాగా, ఫోర్లు 34. పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ 11 సిక్సర్లు, 20 ఫోర్లు కొడితే.. రాయల్స్‌ ఆటగాళ్లు 18 సిక్సర్లు 14 ఫోర్లు బాదారు. మొదట గత మ్యాచ్‌ సెంచరీ వీరుడు రాహుల్‌ మరో దూకుడైన ఇన్నింగ్స్‌ ఆడితే.. అతణ్ని మించి మెరుపులతో సెంచరీ కొట్టి ఆశ్చర్యపరిచాడు మయాంక్‌. తన బ్యాటింగ్‌లో ఇంతకుముందెన్నడూ చూడని విధ్వంసక కోణాన్ని అతను చూపించాడు. చివర్లో పూరన్‌ కూడా మెరుపులు మెరిపించాడు. ఇక రాయల్స్‌ ఇన్నింగ్స్‌లోనూ ఆరంభం నుంచే విధ్వంసకరంగా సాగింది. స్మిత్‌, శాంసన్‌ పోటీ పడి భారీ షాట్లు ఆడారు. ఫోర్లు, సిక్సర్ల వర్షంలో ముంచెత్తారు. ఇక తెవాతియా అయితే విధ్వంసాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. చివర్లో ఆర్చర్‌ సైతం తనదైన శైలిలో కొన్ని షాట్లు ఆడి అలరించాడు. మొత్తంగా హిట్టింగ్‌ను ఇష్టపడే అభిమానులకు ఈ మ్యాచ్‌ కనువిందే అయింది.


తిట్టుకున్నోడే..

19 బంతుల్లో 8 పరుగులు.. పంజాబ్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఆటగాడు రాహుల్‌ తెవాతియా ఒక దశలో చేసిన స్కోరిది. రాయల్స్‌ సాధించాల్సిన రన్‌రేట్‌ 15కు చేరువవుతున్న సమయంలో అతను ఆడిన తీరిది. ఛేదనలో తొలి ఓవర్‌ నుంచే 11కు పైగా రన్‌రేట్‌తో ఆడాల్సిన స్థితి రాజస్థాన్‌ది. అయితే స్మిత్‌ ఔటయ్యాక ఫించ్‌ హిట్టర్‌ పాత్రలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తెవాతియా.. ఆరంభంలో షాట్లు ఆడలేక అవస్థలు పడ్డాడు. ఫోర్లు, సిక్సర్ల సంగతలా ఉంచితే సింగిల్‌ తీయడమూ కష్టమైందతడికి. బంతికి బ్యాట్‌ను తాకించలేక తీవ్ర అసహనానికి గురయ్యాడు ఒక దశలో. ఆ దశలో రాయల్స్‌ అభిమానులు విపరీతంగా తిట్టుకున్న ఆ ఆటగాడే ఆ జట్టుకు అనూహ్య విజయాన్నందించాడు. రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో ఒక సిక్సర్‌ బాది ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న తెవాతియా.. కాట్రెల్‌ వేసిన 18వ ఓవర్లో భీకర హిట్టింగ్‌తో ఐపీఎల్‌ వీక్షకులందరినీ విస్మయానికి గురి చేశాడు. ఏకంగా అయిదు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను పంజాబ్‌ నుంచి లాగేశాడు. చివరి 12 బంతుల్లో అతను 45 పరుగులు చేయడం విశేషం.


1

ఐపీఎల్‌లో ఇదే అతి పెద్ద ఛేదన. తన పేరిటే ఉన్న రికార్డును రాజస్థాన్‌ తిరగరాసింది. ఇంతకుముందు 2008లో డెక్కన్‌ ఛార్జర్స్‌పై 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రాయల్స్‌.. ఇప్పుడు 224 పరుగుల లక్ష్యాన్ని ఊదేసింది.


2

ఐపీఎల్‌లో ఒకే ఓవర్లో అయిదు సిక్సర్లు కొట్టడం ఇది రెండోసారి మాత్రమే. 2012లో రాహుల్‌ శర్మ బౌలింగ్‌లో గేల్‌ సాధించాడు. ఇప్పుడు కాట్రెల్‌ బౌలింగ్‌లో తెవాతియా కొట్టాడు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.