close

తాజా వార్తలు

Updated : 29/09/2020 06:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అటు ఇటు తిరిగి.. చివరికి ఆర్‌సీబీ చేతికి

కిషన్‌, పొలార్డ్‌ సంచలన బ్యాటింగ్‌●

చిత్తనుకున్న ముంబయి పోటీలోకి●

సూపర్‌ ఓవర్లో బయటపడ్డ బెంగళూరు

ఐపీఎల్‌ ఆలస్యమైతే అయ్యింది కానీ.. భారత్‌ నుంచి తరలిపోతే పోయింది కానీ.. ఈసారి మజా మాత్రం మామూలుగా లేదు. ఓవైపు మెరుపు ఇన్నింగ్స్‌లు.. మరోవైపు హోరాహోరీ పోరాటాలు.. ఇంకోవైపు ఉత్కంఠభరిత మలుపులతో క్రికెట్‌ ప్రియులకు మామూలు వినోదాన్నివ్వట్లేదు ఈ ఐపీఎల్‌. ఆదివారం రాజస్థాన్‌, పంజాబ్‌ మ్యాచ్‌ మత్తు నుంచి ఇంకా తేరుకోకముందే తర్వాతి రోజు మరో రసవత్తర పోరు అభిమానుల్ని ఉర్రూతలూగించేసింది. మొదట 170 చేస్తే ఎక్కువనుకున్న బెంగళూరు 200 దాటడం అనూహ్యం.. ఆపై ప్రత్యర్థి స్కోరులో 75 శాతం స్కోరు చేయడం కూడా కష్టమే అనుకున్న ముంబయి పరుగులు సమం చేయడం, మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీయడం అనూహ్యం. ఆపై హిట్టింగ్‌కు పేరు పడ్డ ముంబయి సూపర్‌ ఓవర్లో 7 పరుగులే చేయడం అనూహ్యం. తేలిగ్గా ఈ పరుగుల్ని ఛేదిస్తుందనుకున్న బెంగళూరు చివరి బంతి వరకు ఆడాల్సి రావడం అనూహ్యం. మొత్తంగా ఆద్యంతం మలుపులతో అభిమానుల్ని ఊపేసిందీ పోరు.

దుబాయ్‌

బెంగళూరు బతికిపోయింది. పంజాబ్‌ చేతిలో చిత్తుగా ఓడి, పెద్దగా అంచనాల్లేకుండా ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన ఆ జట్టు.. త్రుటిలో ఓటమి నుంచి బయటపడింది. తేలిగ్గా గెలవాల్సిన మ్యాచ్‌లో పీకల మీదికి తెచ్చుకున్న ఆర్‌సీబీ.. చివరికి సూపర్‌ ఓవర్‌లో సైని చక్కటి ప్రదర్శనతో గట్టెక్కింది. మొదట ఏబీ డివిలియర్స్‌ (55 నాటౌట్‌; 24 బంతుల్లో 4x4, 4x6), ఆరోన్‌ ఫించ్‌ (52; 35 బంతుల్లో 7x4, 1x6), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (54; 40 బంతుల్లో 5x4, 2x6), శివమ్‌ దూబె (27 నాటౌట్‌, 10 బంతుల్లో 1x4, 3x6) మెరుపులతో ఆర్‌సీబీ 3 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఇషాన్‌ కిషన్‌ (99; 58 బంతుల్లో 2x4, 9x6), పొలార్డ్‌ (60 నాటౌట్‌; 24 బంతుల్లో 3x4, 5x6) సంచలన ఇన్నింగ్స్‌లతో ముంబయిని విజయానికి చేరువగా తీసుకెళ్లారు. అయితే ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సరిగ్గా 201 పరుగులే చేయడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. సైని కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సూపర్‌ ఓవర్లో ముంబయిని 7/1కు కట్టడి చేశాడు. తొలి 3 బంతులకు 2 పరుగులే రాగా.. నాలుగో బంతికి ఫోర్‌ కొట్టిన పొలార్డ్‌, తర్వాతి బంతికి ఔటైపోయాడు. చివరి బంతికి ఒక్క పరుగే వచ్చింది. తర్వాత బుమ్రా బెంగళూరును కట్టడి చేశాడు. ఆ జట్టు 3 బంతుల్లో 2 పరుగులే చేసింది. మూడో బంతికి డివిలియర్స్‌ క్యాచ్‌ ఔటైనట్లు అంపైర్‌ ప్రకటించగా.. సమీక్షలో నాటౌట్‌గా తేలింది. నాలుగో బంతికి వికెట్ల వెనుక ఫోర్‌ కొట్టిన ఏబీ.. అయిదో బంతికి సింగిల్‌ తీయడంతో స్కోర్లు సమమయ్యాయి. చివరి బంతికి కోహ్లి ఫోర్‌ కొట్టి తన జట్టును గెలిపించాడు.

అనుకోకుండా వచ్ఛి.: ఇషాన్‌ కిషన్‌.. ఈ మ్యాచ్‌కు ముందు ఎవరి దృష్టిలో లేని ఆటగాడు. డికాక్‌ అందుబాటులో ఉండటంతో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ అయిన అతణ్ని తొలి రెండు మ్యాచ్‌ల్లో తుది జట్టులోకి తీసుకోలేదు ముంబయి. అయితే సౌరభ్‌ తివారి చెప్పుకోదగ్గ స్కోర్లు చేయని నేపథ్యంలో బెంగళూరుతో మ్యాచ్‌కు అతణ్ని తప్పించి కిషన్‌ను స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా తీసుకుంది ముంబయి. ఇలా అనుకోకుండా జట్టులోకి వచ్చిన కిషన్‌.. ఎవ్వరూ ఊహించని విధంగా విధ్వంసక ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ గతినే మార్చేశాడు. 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదిస్తూ 39 పరుగులకే రోహిత్‌ (8), డికాక్‌ (14), సూర్యకుమార్‌ (0)ల వికెట్లు కోల్పోయిన ముంబయి.. అసలు మ్యాచ్‌లో పోటీలో ఉంటుందని కూడా ఎవరూ అనుకోలేదు. కానీ కిషన్‌.. తొలి బంతి నుంచే చెలరేగి ఆడి ఆ జట్టును రేసులోకి తెచ్చాడు. పొట్టిగా, అంతగా బలం లేనట్లు కనిపించే ఇషాన్‌.. కొట్టిన షాట్లు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. అతను ఏకంగా 9 సిక్సర్లు బాదడం విశేషం. పవర్‌, టైమింగ్‌ కలగలిసిన షాట్లతో అతను పరుగుల వరద పారించాడు. తొలి మూడు వికెట్లు పడ్డాక హార్దిక్‌, పొలార్డ్‌లను అడ్డుకుంటే చాలని బెంగళూరు భావిస్తే.. ప్రమాదం కాదనుకున్న ఇషాన్‌ చాపకింద నీరులా ఆర్‌సీబీకి చేయాల్సిన నష్టమంతా చేసేశాడు. ఉదాన వేసిన చివరి ఓవర్లో ఆఖరి 4 బంతుల్లో 17 పరుగులు చేయాల్సి రావడంతో ముంబయికి అవకాశమే లేదని అంతా అనుకున్నారు. కానీ రెండు బంతులకు రెండు సిక్సర్లు బాదిన కిషన్‌.. సమీకరణాన్ని 2 బంతుల్లో 5 పరుగులతో తేలిగ్గా మ్చాడు. ఇంకో షాట్‌ ఆడి సెంచరీతో పాటు జట్టు విజయాన్ని కూడా పూర్తి చేస్తాడనుకుంటే బౌండరీ దగ్గర పడిక్కల్‌కు దొరికిపోయాడు. చివరి బంతికి పొలార్డ్‌ ఫోర్‌ కొట్టి మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌కు మళ్లించాడు.

ఫించ్‌ మొదలెడితే..: అంతకుముందు బెంగళూరు ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ కోహ్లి (3) మరోమారు పేలవ ప్రదర్శన చేసినప్పటికీ.. మిగతా బ్యాట్స్‌మెన్‌ అందరూ అంచనాల్ని మించి రాణించడంతో ఆ జట్టు 200 దాటింది. ఫించ్‌ ఆ జట్టుకు ధనాధన్‌ ఆరంభాన్నిచ్చాడు. ప్రతి బంతికీ బాదాలన్న లక్ష్యంతో ఆడిన ఈ ఆస్ట్రేలియన్‌ బౌండరీల మోత మోగించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఆర్‌సీబీ.. 59/0తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. దేవ్‌దత్‌ అంత వేగంగా ఆడకపోయినా చక్కటి సహకారం అందించాడు. 31 బంతుల్లోనే అర్ధశతకం బాదిన ఫించ్‌.. తొమ్మిదో ఓవర్లో వెనుదిరిగాడు. మూడో స్థానంలో వచ్చిన విరాట్‌ తడబడటం, దేవ్‌దత్‌ కూడా నెమ్మదిగా ఆడటంతో స్కోరు వేగం పడిపోయింది. 13వ ఓవర్లో విరాట్‌ వెనుదిరిగే సమయానికి స్కోరు 93 మాత్రమే. ఆ స్థితిలో ఆర్‌సీబీ 170 పరుగులు చేస్తే ఎక్కువ అన్నట్లు కనిపించింది. కానీ డివిలియర్స్‌ వచ్చి మొత్తం కథ మార్చేశాడు. ఆరంభం నుంచే భారీ షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దేవ్‌దత్‌ కూడా ప్యాటిన్సన్‌ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. అర్ధశతకం తర్వాత అతను ఔట్‌ కాగా.. తర్వాత వచ్చిన దూబె, డివిలియర్స్‌తో కలిసి ముంబయి బౌలర్లపై విరుచుకుపడటంతో బెంగళూరు అనూహ్యంగా 200 దాటింది. దూబె.. ప్యాటిన్సన్‌ వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు బాదాడు. చివరి 7 ఓవర్లలో బెంగళూరు 105 పరుగులు చేయడం విశేషం.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: దేవ్‌దత్‌ (సి) పొలార్డ్‌ (బి) బౌల్ట్‌ 54; ఫించ్‌ (సి) పొలార్డ్‌ (బి) బౌల్ట్‌ 52; కోహ్లి (సి) రోహిత్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 3; డివిలియర్స్‌ నాటౌట్‌ 55; దూబె నాటౌట్‌ 27; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 201;

వికెట్ల పతనం: 1-81, 2-92, 3-154; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-34-2; ప్యాటిన్సన్‌ 4-0-51-0; చాహర్‌ 4-0-31-1; బుమ్రా 4-0-42-0; కృనాల్‌ పాండ్య 3-0-23-0; పొలార్డ్‌ 1-0-13-0

ముంబయి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) నేగి (బి) సుందర్‌ 8; డికాక్‌ (సి) నేగి (బి) చాహల్‌ 14; సూర్యకుమార్‌ (సి) డివిలియర్స్‌ (బి) ఉదాన 0; ఇషాన్‌ కిషన్‌ (సి) పడిక్కల్‌ (బి) ఉదాన 99; హార్దిక్‌ (సి) నేగి (బి) జంపా 15; పొలార్డ్‌ నాటౌట్‌ 60; కృనాల్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 201;

వికెట్ల పతనం: 1-14, 2-16, 3-39, 4-78, 5-197; బౌలింగ్‌: ఉదాన 4-0-45-2; సుందర్‌ 4-0-12-1; సైని 4-0-43-0; చాహల్‌ 4-0-48-1; జంపా 4-0-53-1


2

ఈ ఐపీఎల్‌లో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు వెళ్లడం ఇది రెండోసారి. ఇంతకుముందు పంజాబ్‌పై దిల్లీ సూపర్‌ ఓవర్లోనే గెలిచింది.


అప్పుడే గెలవాల్సింది..

కీలకమైన క్యాచ్‌లు చేజార్చకపోయుంటే మ్యాచ్‌ ముందే బెంగళూరు సొంతమయ్యేది. సూపర్‌ ఓవర్‌ దాకా వెళ్లేదే కాదు. రెండు జీవనదానాలు లభించిన పొలార్డ్‌ భీకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. అతడికి రెండు అవకాశాలూ 17వ ఓవర్లోనే వచ్చాయి. జంపా వేసిన రెండో బంతిని పొలార్డ్‌ అమాంతం గాల్లోకి లేపగా డీప్‌ ఎక్స్‌ట్రా కవర్లో నేగి క్యాచ్‌ వదిలేశాడు. అతడు ఒడిసి పట్టలేకపోవడంతో బంతి బౌడరీ లైన్‌ ఆవల పడింది. అప్పటికి పొలార్డ్‌ స్కోరు 15. అదే ఓవర్‌ చివరి బంతిని స్లాగ్‌ చేయబోయిన పొలార్డ్‌ సరిగా కొట్టలేకపోయాడు. బంతి గాల్లోకి లేవగా బ్యాక్‌వర్ట్‌ పాయింట్లో చాహల్‌ క్యాచ్‌ పట్టుకోలేకపోయాడు.

 


సైని సూపర్‌

బెంగళూరు బౌలింగంటే చాలు.. అవతలి జట్టుకు ఎక్కడలేని ధీమా వచ్చేస్తుంది. ఎంతటి లక్ష్యమైనా ఆర్‌సీబీకి సురక్షితం కాదు. బౌలర్లను మార్చినా సరే.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ చేతిలో ఊచకోత వారికి మామూలే. డెత్‌ ఓవర్లలో రక్షించే బౌలర్లు ఆ జట్టుకు ఎప్పుడూ కొరతే. ఇలాంటి స్థితిలో వారికి సైని కొంచెం ఉపశమనాన్నిస్తున్నాడు. సన్‌రైజర్స్‌తో తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ బయటపడటంలో అతడిది కీలక పాత్ర. సోమవారం కూడా అతను భీకరంగా ఆడుతున్న పొలార్డ్‌, కిషన్‌లకు కొంత బ్రేకులేశాడు. జంపా 27 పరుగులిచ్చిన ఓవర్‌కు ముందు సైని 10 పరుగులే ఇచ్చాడు. అతడి తర్వాతి ఓవర్లో 12 పరుగులే వచ్చాయి. పొలార్డ్‌, కిషన్‌ ఉన్న ఊపులో ఆ పరుగులు తక్కువే. ఇక సూపర్‌ ఓవర్లో పాండ్య, పొలార్డ్‌ లాంటి విధ్వంసకారుల్ని పెట్టుకుని ఒక వికెట్‌ తీసి 7 పరుగులే ఇవ్వడం కూడా గొప్ప ప్రదర్శనే. అక్కడే ఆర్‌సీబీ విజయానికి బాటలు పడ్డాయి. బుమ్రా లాంటి బౌలర్‌ను ఎదుర్కొంటున్నపుడు 10 పరుగులైనా ఆర్‌సీబీకి కష్టమయ్యేదే.


ఆ రెండు ఓవర్లలో..

పొలార్డ్‌ ఎంత ప్రమాదకర బ్యాట్స్‌మనో మరోసారి రుజువైంది. కిషన్‌ గొప్పగా ఆడినప్పటికీ.. మధ్యలో అసాధ్యంలా కనిపించిన గెలుపు సమీకరణాన్ని ముంబయి అనుకూలంగా మార్చింది అతనే. 16 ఓవర్లకు ముంబయి స్కోరు 122/4. 4 ఓవర్లలో 80 పరుగులు చేయాలి. ఆ స్థితిలో జంపా బౌలింగ్‌లో పొలార్డ్‌ ఒక్కడే ఒక ఫోర్‌, మూడు సిక్సర్లు సహా 27 పరుగులు రాబట్టాడు. చాహల్‌ వేసిన తర్వాతి ఓవర్లోనూ అతను రెండు సిక్సర్లు బాదాడు. ఇషాన్‌ కూడా ఒక సిక్సర్‌ బాదడంతో ఈ ఓవర్లో 22 పరుగులొచ్చాయి. 2 ఓవర్లలో 49 పరుగులు రావడంతో ముంబయి పోటీలోకి వచ్చింది.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.