close

తాజా వార్తలు

Updated : 18/10/2020 02:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏబీ మెరుపు దాడి

 డివిలియర్స్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌
రాయల్స్‌పై ఆర్‌సీబీ గెలుపు

దుబాయ్‌

చివరి 2 ఓవర్లలో 35 పరుగులు చేయాలంటే.. ఎంత టీ20లో అయినా కష్టమే! అందులోనూ విశ్వాసంతో ఉన్న రాజస్థాన్‌ బౌలర్లను ఎదుర్కొంటూ ఎదురుదాడి చేసి జట్టును ఒంటి చేత్తో గెలిపించడం అంటే మాటలు కాదు! కానీ ఒత్తిడిని చిత్తు చేస్తూ చెలరేగిపోయిన ఏబీ డివిలియర్స్‌ బెంగళూరుకు అద్భుత విజయాన్ని అందించాడు. గెలుపు ధీమాతో ఉన్న రాయల్స్‌కు షాకిచ్చాడు. 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో బెంగళూరు ప్లేఆఫ్‌ దిశగా మరో అడుగు వేయగా.. గత 5 మ్యాచ్‌ల్లో నాలుగో ఓటమితో రాజస్థాన్‌ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానానికి పరిమితమైంది

బీ డివిలియర్స్‌ (55 నాటౌట్‌; 22 బంతుల్లో 1×4, 6×6) స్వింగ్‌లో ఉంటే అంతే! ఈ విషయాన్ని గతంలో చాలాసార్లు నిరూపించిన ఈ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ మరోసారి విలక్షణమైన ఆటతో చెలరేగి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు అనూహ్య విజయాన్ని అందించాడు. శనివారం మొదట రాజస్థాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. స్మిత్‌ (57; 36 బంతుల్లో 6×4, 1×6), ఉతప్ప (41; 22 బంతుల్లో 7×4, 1×6) రాణించారు. ఛేదనలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డివిలియర్స్‌, కోహ్లి (43; 32 బంతుల్లో 1×4, 2×6) మెరుపులతో ఆర్‌సీబీ 19.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
మొదట విరాట్‌.. ఆఖర్లో ఏబీ: ఆర్‌సీబీ గెలిచిందంటే ఏబీ డివిలియర్స్‌, కోహ్లి ఆటే కారణం. విరాట్‌ ఇన్నింగ్స్‌కు ప్రాణం పోస్తే.. ఏబీ చెలరేగి గెలుపు తీరాలకు చేర్చాడు. ఆరంభంలోనే బెంగళూరు ఫించ్‌ వికెట్‌ కోల్పోయినా కోహ్లి.. పడిక్కల్‌(35)తో కలిసి ఇన్నింగ్స్‌ నిలబెట్టాడు. వారిద్దరు విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే సాధించాల్సిన రన్‌రేట్‌లో మాత్రం ఆర్‌సీబీ వెనకబడింది. వరుస ఓవర్లలో పడిక్కల్‌, కోహ్లి వెనుదిరిగే సమయానికి బెంగళూరు 41 బంతుల్లో 76 పరుగులు చేయాలి. అర్ధసెంచరీ చేరువలో త్యాగి బౌలింగ్‌లో కోహ్లి.. తెవాతియా మెరుపు క్యాచ్‌కు ఔటయ్యాడు. అప్పటికే రాజస్థాన్‌ బౌలర్లు జోరు మీదుండటంతో ఆర్‌సీబీకి కష్టమే అనిపించింది. ఆ జట్టుకు ఆశ ఏబీ మాత్రమే. అంచనాలు నిలబెడుతూ అతను సరైన సమయంలో అందుకున్నాడు. గుర్‌కీరత్‌ (19)తో కలిసి 18వ ఓవర్లో 10 పరుగులు రాబట్టాడు. ఇక 12 బంతుల్లో 35 పరుగులు అవసరమైన సమయంలో.. ఉనద్కత్‌ వేసిన 19వ ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతను వరుసగా మూడు సిక్స్‌లు బాదడంతో ఆ ఓవర్లో 25 పరుగులు రాబట్టిన ఆర్‌సీబీ.. విజయాన్ని ఖాయం చేసుకుంది. చివరి ఓవర్లో డివిలియర్స్‌ మరో మెరుపు సిక్స్‌తో రెండు బంతులు ఉండగానే జట్టును గెలిపించాడు.
మెరిసిన స్మిత్‌, రాబిన్‌: రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌, రాబిన్‌ ఉతప్ప బ్యాటింగే హైలైట్‌. ఆరంభంలో రాబిన్‌ ఇన్నింగ్స్‌కు పునాది వేస్తే.. స్టీవ్‌ ఆఖరి ఓవర్‌ వరకు నిలిచి జట్టుకు మంచి స్కోరు అందించాడు. ఈ సీజన్లో తొలిసారి ఓపెనర్‌గా వచ్చిన ఉతప్ప సత్తా చాటాడు. లెగ్‌సైడ్‌ స్వీప్‌లతో ఆకట్టుకున్న అతను అర్ధసెంచరీ చేసేలా కనిపించినా చాహల్‌ (2/34) బౌలింగ్‌లో వెనుదిరిగాడు. శాంసన్‌ (9) త్వరగానే ఔటైనా.. మొదట బట్లర్‌ (24), ఆ తర్వాత  తెవాతియా (19 నాటౌట్‌) జతగా స్మిత్‌ రాజస్థాన్‌కు మంచి ముగింపునిచ్చాడు. రాయల్స్‌ 19 ఓవర్లకు 173/4తో నిలిచినా ఇన్నింగ్స్‌లో ఆఖరి బంతి పడ్డాక   177/6తోనే ముగించింది. కారణం క్రిస్‌ మోరిస్‌ (4/26)..! 20వ ఓవర్లో విజృంభించిన ఈ పేసర్‌.. స్మిత్‌, ఆర్చర్‌ (2) వికెట్లు తీసి నాలుగు పరుగులే ఇచ్చాడు.


రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌: ఉతప్ప (సి) ఫించ్‌ (బి) చాహల్‌ 41; స్టోక్స్‌ (సి) డివిలియర్స్‌ (బి) మోరిస్‌ 15; శాంసన్‌ (సి) మోరిస్‌ (బి) చాహల్‌ 9; స్మిత్‌ (సి) షాబాజ్‌ (బి) మోరిస్‌ 57; బట్లర్‌ (సి) సైని (బి) మోరిస్‌ 24; తెవాతియా నాటౌట్‌ 19; ఆర్చర్‌ ఎల్బీ (బి) మోరిస్‌ 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 177; వికెట్ల పతనం: 1-50, 2-69, 3-69, 4-127, 5-173, 6-177; బౌలింగ్‌: వాషింగ్టన్‌ సుందర్‌ 3-0-25-0; మోరిస్‌ 4-0-26-4; ఉదాన 3-0-43-0; సైని 4-0-30-0; చాహల్‌ 4-0-34-2; షాబాజ్‌ అహ్మద్‌ 2-0-18-0
బెంగళూరు ఇన్నింగ్స్‌: పడిక్కల్‌ (సి) స్టోక్స్‌ (బి) తెవాతియా 35; ఫించ్‌ (సి) ఉతప్ప (బి) గోపాల్‌ 14; కోహ్లి (సి) తెవాతియా (బి) త్యాగి 43; డివిలియర్స్‌ నాటౌట్‌ 55; గుర్‌కీరత్‌ నాటౌట్‌ 19; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం: (19.4 ఓవర్లలో 3 వికెట్లకు) 179; వికెట్ల పతనం: 1-23, 2-102, 3-102; బౌలింగ్‌: ఆర్చర్‌ 3.4-0-38-0; గోపాల్‌ 4-0-32-1; త్యాగి 4-0-32-1; ఉనద్కత్‌ 4-0-46-0; తెవాతియా 4-0-30-1


‘‘ఏబీ డివిలియర్స్‌ ఐపీఎల్‌లోనే అత్యంత ప్రభావవంత ఆటగాడు. ఎప్పుడైనా.. పరిస్థితులను అంచనా వేసి అందుకు తగినట్లుగా ఆడతాడు. కేవలం అతడి లాంటి ఆటగాడు ఉండడం వల్లే జట్లు ఎలాంటి స్థితిలోనూ ఆశలు కోల్పోవు’’

- కోహ్లి
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.