close

తాజా వార్తలు

Updated : 21/10/2020 06:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పంజాబ్‌ రేసులోనే..

కింగ్స్‌ ఎలెవెన్‌ హ్యాట్రిక్‌ విజయం
పూరన్‌ మెరుపు ఇన్నింగ్స్‌
ధావన్‌ శతకం వృథా
దిల్లీకి మూడో ఓటమి

దుబాయ్‌

భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ శిఖర్‌ ధావన్‌ మరోసారి రెచ్చిపోయాడు. ఐపీఎల్‌లో వరుసగా రెండో సెంచరీ బాదేశాడు. పంజాబ్‌ బౌలర్లెవ్వరూ అతడిని అడ్డుకోలేకపోయారు. కానీ దిల్లీ జట్టులో ఆడింది ఆ ఒక్కడే. అతను సెంచరీ కొడితే.. ఇంకో బ్యాట్స్‌మన్‌ ఎవ్వరూ 20 పరుగులైనా చేయలేదు. ఫలితం.. ప్రత్యర్థి ముందు నిలిచింది 165 పరుగుల లక్ష్యమే. అక్కడా బ్యాట్స్‌మెన్‌ తడబడినా.. నికోలస్‌ పూరన్‌, క్రిస్‌ గేల్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో తక్కువ సమయంలో ఎక్కువ నష్టం చేసేశారు. దీంతో దిల్లీ బౌలర్లు ఎంతగా పోరాడినా.. ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. తొలి 7 మ్యాచ్‌ల్లో ఆరు ఓడి ప్లేఆఫ్‌ రేసులోనే లేనట్లు కనిపించిన పంజాబ్‌.. హ్యాట్రిక్‌ విజయంతో పోటీలోకి రావడం విశేషం.
ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచూ గెలుస్తూ సాగాల్సిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌.. అదే పని చేస్తోంది. బాగా ఆడినా కొన్ని ఓటములు చవిచూసిన ఆ జట్టు.. ఇప్పుడు తడబడుతూనే విజయాలు సాధిస్తోంది. గత మ్యాచ్‌లో రెండు సూపర్‌ ఓవర్లు ఆడి, ముంబయి లాంటి బలమైన జట్టును ఓడించిన పంజాబ్‌.. మంగళవారం మరో హోరాహోరీ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గింది. మొదట ధావన్‌ (106 నాటౌట్‌; 61 బంతుల్లో 12×4, 3×6) జోరు కొనసాగిస్తూ మరో శతకం బాదినా.. మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమవడంతో దిల్లీ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులే చేసింది. షమి (2/28) ఆ జట్టును దెబ్బ తీశాడు. అనంతరం పూరన్‌ (53; 28 బంతుల్లో 6×4, 3×6)తో పాటు గేల్‌ (29; 13 బంతుల్లో 3×4, 2×6), మ్యాక్స్‌వెల్‌ (32; 24 బంతుల్లో 3×4) రాణించడంతో పంజాబ్‌.. 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దిల్లీ బౌలర్లలో రబాడ (2/27) రాణించాడు.

తేడా ఆ మెరుపులే..: నిలకడకు మారుపేరుగా మారిన రాహుల్‌ (15) విఫలమయ్యాడు. మయాంక్‌ (5) కూడా ఎంతోసేపు నిలవలేదు. గేల్‌ సైతం ఆరో ఓవర్లోనే ఔటైపోయాడు. అయినా పంజాబ్‌ సులువుగా గెలిచిందంటే.. అందుక్కారణం.. ఆ జట్టు దూకుడుగా బ్యాటింగ్‌ చేయడమే. గేల్‌ ఉన్నది కాసేపే అయినా దిల్లీకి పెద్ద నష్టమే చేశాడు. దేశ్‌ పాండే వేసిన అయిదో ఓవర్లో వరుసగా 4, 4, 6, 4, 6 బాదేశాడు. ఈ ఓవర్లో మొత్తం 26 పరుగులు రావడంతో పంజాబ్‌ రన్‌రేట్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది. గేల్‌ ఆ తర్వాతి ఓవర్లోనే ఔటైపోయాడు. అదే ఓవర్లో పూరన్‌ కారణంగా మయాంక్‌ రనౌటైపోయాడు. అయితే ఆ పశ్చాత్తాపంతోనో ఏమో.. పూరన్‌ చెలరేగి ఆడాడు. దేశ్‌పాండే మళ్లీ బౌలింగ్‌కు రాగానే అతడిపై విరుచుకుపడ్డాడు. వరుసగా 6, 4, 4, కొట్టాడు. స్టాయినిస్‌కు 4, 6తో స్వాగతం పలికాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ 100 దాటిపోయింది. రబాడ బౌలింగ్‌లో అతను వెనుదిరిగే సమయానికే సమీకరణం 45 బంతుల్లో 40 పరుగులతో తేలిగ్గా మారిపోయింది. అక్కడి నుంచి మ్యాక్స్‌వెల్‌ బాధ్యత తీసుకున్నాడు. 26 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన స్థితిలో అతను ఔటైనా.. హుడా (15 నాటౌట్‌), నీషమ్‌ (10 నాటౌట్‌) మిగతా పని పూర్తి చేశారు.
ఆగని ధావన్‌: ఐపీఎల్‌ సాగే కొద్దీ మెరుగవుతూ గత మ్యాచ్‌తో తన టాప్‌ ఫామ్‌ను అందుకున్న దిల్లీ ఓపెనర్‌ ధావన్‌.. ఈ మ్యాచ్‌లోనూ జోరు కొనసాగించాడు. చెన్నైపై ఛేదనలో శతకం సాధించిన అతను.. ఈసారి మొదట బ్యాటింగ్‌ చేస్తూ సెంచరీ కొట్టాడు. మ్యాక్స్‌వెల్‌ వేసిన ఆరంభ ఓవర్లోనే అతను ఫోర్‌, సిక్స్‌ బాది తన ఉద్దేశాల్ని చాటాడు. ఇక ఆ తర్వాత ఎక్కడా ఆగలేదు. పృథ్వీ షా పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ 7 పరుగులకే వెనుదిరిగినా.. ఆ తర్వాత కూడా వికెట్ల పతనం కొనసాగినా.. ధావన్‌ మాత్రం దంచుతూనే వెళ్లాడు. అయితే అతడికి ఒక్క బ్యాట్స్‌మన్‌ నుంచి సహకారం అంది ఉన్నా.. దిల్లీ 200కు చేరువగా వెళ్లేదే. అయ్యర్‌ (14)తో పాటు పంత్‌ (14), స్టాయినిస్‌ (9) విఫలమయ్యారు. దిల్లీ స్కోరులో దాదాపు 65 శాతం పరుగులు అతడివే కావడం విశేషం.

దిల్లీ: పృథ్వీ షా (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) నీషమ్‌ 7; ధావన్‌ నాటౌట్‌ 106; అయ్యర్‌ (సి) రాహుల్‌ (బి) మురుగన్‌ 14; పంత్‌ (సి) మయాంక్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 14; స్టాయినిస్‌ (సి) మయాంక్‌ (బి) షమి 9; హెట్‌మయర్‌ (బి) షమి 10; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164; వికెట్ల పతనం: 1-25, 2-73, 3-106, 4-141, 5-164, బౌలింగ్‌: మ్యాక్స్‌వెల్‌ 4-0-31-1; షమి 4-0-28-2; అర్ష్‌దీప్‌ 3-0-30-0; నీషమ్‌ 2-0-17-1; మురుగన్‌ 4-0-33-1; బిష్ణోయ్‌ 3-0-24-0
పంజాబ్‌: రాహుల్‌ (సి) సామ్స్‌ (బి) అక్షర్‌ 15; మయాంక్‌ రనౌట్‌ 5; గేల్‌ (బి) అశ్విన్‌ 29; పూరన్‌ (సి) పంత్‌ (బి) రబాడ 53; మాక్స్‌వెల్‌ (సి) పంత్‌ (బి) రబాడ 32; హుడా నాటౌట్‌ 15; నీషమ్‌ నాటౌట్‌ 10; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (19 ఓవర్లలో 5 వికెట్లకు) 167; వికెట్ల పతనం: 1-17, 2-52, 3-56, 4-125, 5-147,  బౌలింగ్‌: డానియల్‌ సామ్స్‌ 4-0-30-0; రబాడ 4-0-27-2; అక్షర్‌ పటేల్‌ 4-0-27-1; తుషార్‌ 2-0-41-0; అశ్విన్‌ 4-0-27-1; స్టాయినిస్‌ 1-0-14-0


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.