అనగనగా ఓ అద్భుతం
close

తాజా వార్తలు

Updated : 22/10/2020 03:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనగనగా ఓ అద్భుతం

సిరాజ్‌ సంచలన బౌలింగ్‌
వరుసగా 2 మెయిడెన్లు.. 3 వికెట్లు
బెంబేలెత్తిన కోల్‌కతా.. 84/8కు కట్టడి
బెంగళూరుకు ఏడో విజయం

ఐపీఎల్‌ రికార్డు గొప్పగా ఏమీ లేదు. ఈ సీజన్లో ఆడింది మూడే మ్యాచ్‌లు. అతడిపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ప్రత్యర్థి జట్టు కూడా ఎక్కువగా ఆలోచించి ఉండకపోవచ్చు. కానీ ఎవరి దృష్టిలో లేని ఆ బౌలర్‌.. ఐపీఎల్‌ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఘనతను అందుకున్నాడు. వరుసగా రెండు మెయిడెన్‌ ఓవర్లు వేశాడు. అంతేనా.. ఆ రెండు ఓవర్లలో మూడు వికెట్లు కూడా పడగొట్టి ప్రత్యర్థి నడ్డి విరిచేశాడు. స్కోరు 3/3. ఇక ఆ జట్టు కోలుకునేదెక్కడ? ఈ సంచలన ప్రదర్శన చేసింది మన కుర్రాడు మహ్మద్‌ సిరాజే. అతడి ధాటికి   అల్లాడిపోయిన కోల్‌కతా అతి కష్టం మీద 84 పరుగులు చేసింది. ఆర్‌సీబీ ఛేదన లాంఛనమే.

అబుదాబి

గత సీజన్ల వైఫల్యాల నుంచి బయటపడి ఈ ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శన చేస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. ప్లేఆఫ్‌ దిశగా మరింత ముందంజ వేసింది. పదో మ్యాచ్‌ ఆడుతూ ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆ జట్టు.. ప్లేఆఫ్‌కు అడుగు దూరంలో నిలిచింది. బుధవారం ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మహ్మద్‌ సిరాజ్‌ (4-2-8-3) సంచలన బౌలింగ్‌ ప్రదర్శనకు చాహల్‌ (2/15) మాయాజాలం తోడవడంతో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. మొదట నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 84 పరుగులే చేసింది. 30 పరుగులు చేసిన కెప్టెన్‌ మోర్గానే టాప్‌స్కోరర్‌. అనంతరం బెంగళూరు 13.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో కోల్‌కతా బౌలర్లు అద్భుతాలు చేసే అవకాశమేమీ ఇవ్వలేదు బెంగళూరు ఓపెనర్లు. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై నెమ్మదిగా ఆడటం మంచిది కాదనో ఏమో.. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (25), ఆరోన్‌ ఫించ్‌ (16) దూకుడుగా బ్యాటింగ్‌ చేశారు. 6 ఓవర్లకు స్కోరు 44/0. అప్పటికే సగానికి పైగా లక్ష్యం కరిగిపోవడంతో కోల్‌కతాకు అవకాశమే లేదని తేలిపోయింది. ఏడో ఓవర్లో ఓపెనర్లిద్దరూ వెనుదిరిగినా.. గుర్‌కీరత్‌ (21 నాటౌట్‌), కోహ్లి (18 నాటౌట్‌) జాగ్రత్తగా ఆడి మిగతా పని పూర్తి చేశారు.

బంతులు కావవి బుల్లెట్లు: యూఏఈలో పిచ్‌లన్నీ నెమ్మదించినప్పటికీ.. అబుదాబిలో ఓ మోస్తరు స్కోర్లే నమోదవుతున్న నేపథ్యంలో కోల్‌కతా టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఓవర్లో మోరిస్‌ను జాగ్రత్తగా ఆడుకున్న ఓపెనర్లు గిల్‌, త్రిపాఠి కలిసి 3 పరుగులే చేశారు. ఆశ్చర్యకరంగా సిరాజ్‌ రెండో ఓవర్‌ వేసేందుకు వచ్చాడు. గత మ్యాచ్‌లో 3 ఓవర్లలో వికెట్‌ లేకుండా 44 పరుగులిచ్చిన సిరాజ్‌ బంతిని అందుకోవడంతో ఇక కోల్‌కతా స్కోరు బోర్డు పరుగులు పెడుతుందనే అంతా అనుకుని ఉంటారు. కానీ అక్కడ జరిగింది వేరు. సిరాజ్‌ ఔట్‌ స్వింగర్‌ను ఆడబోయి డివిలియర్స్‌కు దొరికిపోయాడు త్రిపాఠి (1). రాణా క్రీజులోకి అడుగు పెట్టగానే ఓ కళ్లు చెదిరే ఇన్‌స్వింగర్‌తో బౌల్డ్‌ చేసి వెనక్కి పంపించేశాడు సిరాజ్‌. అతడి తర్వాతి ఓవర్లో బాంటన్‌ (10) డ్రైవ్‌ షాట్‌ ఆడబోయి ఏబీకే దొరికిపోయాడు. మధ్యలో గిల్‌ (1)ను సైని ఔట్‌ చేశాడు. చాహల్‌ మిడిలార్డర్‌ పని పట్టాడు. మోర్గాన్‌ పట్టుదలతో క్రీజులో నిలిచి జట్టు మరీ కుప్పకూలిపోకుండా చూశాడు. 57 పరుగుల వద్ద ఏడో వికెట్‌ రూపంలో అతను వెనుదిరిగాడు. చివర్లో ఫెర్గూసన్‌ (19 నాటౌట్‌) కొన్ని షాట్లు ఆడబట్టి కోల్‌కతా ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది.
కోల్‌కతా ఇన్నింగ్స్‌: గిల్‌ (సి) మోరిస్‌ (బి) సైని 1; త్రిపాఠి (సి) డివిలియర్స్‌ (బి) సిరాజ్‌ 1; రాణా (బి) సిరాజ్‌ 0; బాంటన్‌ (సి) డివిలియర్స్‌ (బి) సిరాజ్‌ 10; కార్తీక్‌ ఎల్బీ (బి) చాహల్‌ 4; మోర్గాన్‌ (సి) గుర్‌కీరత్‌ (బి) సుందర్‌ 30; కమిన్స్‌ (సి) పడిక్కల్‌ (బి) చాహల్‌ 4; కుల్‌దీప్‌ రనౌట్‌ 12: ఫెర్గూసన్‌ నాటౌట్‌ 19; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 84; వికెట్ల పతనం: 1-3, 2-3, 3-3, 4-14,   5-32, 6-40, 7-57, 8-84; బౌలింగ్‌: మోరిస్‌ 4-1-16-0; సిరాజ్‌ 4-2-8-3;   సైని 3-0-23-1; ఉదాన 1-0-6-0; చాహల్‌ 4-0-15-2; సుందర్‌ 4-1-14-1
బెంగళూరు ఇన్నింగ్స్‌: పడిక్కల్‌ రనౌట్‌ 25; ఫించ్‌ (సి) కార్తీక్‌ (బి) ఫెర్గూసన్‌ 16; గుర్‌కీరత్‌ నాటౌట్‌ 21; కోహ్లి నాటౌట్‌ 18; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (13.3 ఓవర్లలో 2 వికెట్లకు) 85; వికెట్ల పతనం: 1-46, 2-46; బౌలింగ్‌: కమిన్స్‌ 3-0-18-0; ప్రసిద్ధ్‌ కృష్ణ 2.3-0-20-0; వరుణ్‌ 4-0-28-0; ఫెర్గూసన్‌ 4-0-17-1

ఇన్నాళ్లకు మళ్లీ..

2017 ఐపీఎల్‌ వేలంలో రూ.2.6 కోట్లకు సన్‌రైజర్స్‌కు అమ్ముడవడం ద్వారా వెలుగులోకి వచ్చిన బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌. అతడి తండ్రి ఆటో రిక్షా కార్మికుడు. పేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు పడి ఎదిగి, జూనియర్‌ క్రికెట్లో సత్తా చాటిన అతడికి సన్‌రైజర్స్‌ జట్టులో చోటు దక్కింది. తొలి సీజన్లో అతను మెరుగైన ప్రదర్శనే చేశాడు. 6 మ్యాచ్‌ల్లో 21.2 సగటుతో 10 వికెట్లు తీశాడు. టీమ్‌ఇండియాలో సైతం చోటు దక్కించుకున్నాడు. తర్వాతి సీజన్‌కు బెంగళూరు అతణ్ని తీసుకుంది. కానీ ఆ జట్టు తరఫున రెండు సీజన్లలో సిరాజ్‌ ఆకట్టుకోలేకపోయాడు. 20 మ్యాచ్‌లాడి 18 వికెట్లే తీశాడు. ధారాళంగా పరుగులిచ్చేడం బలహీనతగా మారిపోయింది. ఈ సీజన్లో ఇప్పటిదాకా ఆడింది మూడు మ్యాచ్‌లే. తీసింది 3 వికెట్లే. గత మ్యాచ్‌లో 3 ఓవర్లలో వికెట్‌ లేకుండా 44 పరుగులివ్వడంతో వేటు పడింది. అయితే ఈ మ్యాచ్‌కు షాబాజ్‌ స్థానంలో అతణ్ని తీసుకున్నాడు కోహ్లి. అంతే కాదు.. మోరిస్‌తో కలిసి కొత్త బంతిని పంచుకునే అవకాశమిచ్చాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంచలన బౌలింగ్‌తో జట్టుకు విజయాన్నందించాడు. బంతి బంతికీ అతడి బౌలింగ్‌ పదునెక్కింది. మరింత వేగంతో, కచ్చితత్వంతో బంతులేస్తూ కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించేశాడు. 2017 తర్వాత ఐపీఎల్‌లో సిరాజ్‌ పేరు చర్చనీయాంశమైంది ఇప్పుడే. ఈ ప్రదర్శన అతడి ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచుతుందనడంలో సందేహం లేదు.

1

ఐపీఎల్‌ చరిత్రలోనే ఒక మ్యాచ్‌లో రెండు మెయిడెన్లు వేసిన తొలి బౌలర్‌ మహ్మద్‌ సిరాజే.

84

కోల్‌కతా స్కోరు. ఈ ఐపీఎల్‌లో ఓ జట్టు చేసిన అత్యల్ప పరుగులివే. నైట్‌రైడర్స్‌కిది రెండో అత్యల్ప స్కోరు. 2008లో ఆ జట్టు 67 పరుగులకే ఆలౌటైంది.

‘‘కొత్త బంతితో ఎక్కువగా ప్రాక్టీస్‌ చేస్తున్నా. మ్యాచ్‌లో కొత్త బంతిని నేను పంచుకుంటానని అనుకోలేదు. అసలు అలాంటి ప్రణాళికే లేదు. మైదానంలో వెళ్లేముందు ‘మియా బౌలింగ్‌కు సిద్ధమవ్వు’ అని కోహ్లి అన్నాడు. ప్రణాళికను సరిగ్గా అమలు చేసి రాణా వికెట్‌ తీశాను’’

-  సిరాజ్‌

‘‘నిరుడు సిరాజ్‌కు కఠినంగా సాగింది. తీవ్ర విమర్శలకు గురయ్యాడు. ఈ ఏడాది అతడు చాలా కష్టపడ్డాడు. నెట్స్‌లోనూ బాగా బౌలింగ్‌ చేస్తున్నాడు. ఇప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి. ఇదే జోరు అతడు కొనసాగించాలని ఆశిస్తున్నాం’’

- విరాట్‌ కోహ్లి


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని