close

తాజా వార్తలు

Published : 23/10/2020 02:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాండే ధనాధన్‌

తిరిగి గెలుపు బాటలో సన్‌రైజర్స్‌
రాజస్థాన్‌కు ఏడో ఓటమి

దుబాయ్‌

డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో.. సన్‌రైజర్స్‌ గెలవాలంటే వీరిద్దరిలో ఒకరైనా రాణించడం ఎంతో ఆవశ్యకం. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఛేదనలో వీరిద్దరూ 16 పరుగులకే నిష్క్రమించారు. అయినా మరో 11 బంతులుండగానే 155 లక్ష్యాన్ని అలవోకగా అందుకుంది హైదరాబాద్‌. మరో వికెట్‌ కోల్పోకుండానే ఛేదించింది. కారణం మనీష్‌ పాండే. లీగ్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడని మనీష్‌ రాజస్థాన్‌పై సిక్సర్లతో చెలరేగిపోయాడు. విజయ్‌ శంకర్‌ కూడా అర్ధసెంచరీతో అతడికి అండగా నిలవడంతో.. వార్నర్‌ బృందం నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ఏడో ఓటమితో రాజస్థాన్‌ తర్వాతి దశకు చేరుకోవడమిక చాలా కష్టం.
 

న్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తిరిగి గెలుపు బాట పట్టింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ జట్టు గురువారం 8 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను మట్టికరిపించింది. మొదట రాజస్థాన్‌ 6 వికెట్లకు 154 పరుగులే చేయగలిగింది. సంజు శాంసన్‌ (36; 26 బంతుల్లో 3×4, 1×6) టాప్‌ స్కోరర్‌. హోల్డర్‌ (3/33), రషీద్‌ ఖాన్‌ (1/20), విజయ్‌ శంకర్‌ (1/15) ఆ జట్టును దెబ్బతీశారు. మనీష్‌ పాండే (83 నాటౌట్‌; 47 బంతుల్లో 4×4, 8×6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విజయ్‌ శంకర్‌ (52 నాటౌట్‌; 51 బంతుల్లో 6×4) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.
మనీష్‌ దంచేశాడు..: ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్‌ను మనీష్‌ పాండే గట్టెక్కించాడు. ఛేదనలో అతడి ఇన్నింగ్సే హైలైట్‌. లక్ష్యం చిన్నదే అయినా కేవలం 16 పరుగులకే ఓపెనర్లు వార్నర్‌ (4), బెయిర్‌ స్టో (10) వికెట్లు చేజార్చుకుని ఒత్తిడిలో పడ్డ సన్‌రైజర్స్‌ను పాండే ఆదుకున్నాడు. లేదంటే ఆ జట్టు పరిస్థితి భిన్నంగా ఉండేదే. దూకుడుగా ఆడిన అతడు.. చక్కని షాట్లతో అలరించాడు. చాలా రోజుల తర్వాత విజయ్‌ శంకర్‌ కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. శంకర్‌ అండగా నిలవగా.. పాండే ధనాధన్‌ ఆటతో స్కోరు బోర్డును నడిపించాడు. కార్తీక్‌ త్యాగి బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతడు.. వెంటనే స్టోక్స్‌ బౌలింగ్‌లో డీప్‌ స్క్వేర్‌, డీప్‌ మిడ్‌వికెట్లో సిక్స్‌లు బాదాడు. త్యాగి తర్వాతి ఓవర్లో పాండే మరింత రెచ్చిపోయి ఓ ఫోర్‌, రెండు సిక్స్‌లు బాదేశాడు. 10 ఓవర్లకు స్కోరు 79/2. అయితే చాలా నెమ్మదిగా ఆడుతూ సింగిల్స్‌కే పరిమితమైన శంకర్‌ కూడా క్రమంగా బ్యాట్‌ ఝుళిపించడంతో సన్‌రైజర్స్‌ లక్ష్యం దిశగా వడివడిగా సాగింది. గోపాల్‌ ఓవర్లో శంకర్‌ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. 15 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 118/2 కాగా.. ఆర్చర్‌ వేసిన తర్వాతి ఓవర్లో శంకర్‌ వరుసగా మూడు ఫోర్లు బాది సన్‌రైజర్స్‌ పని మరింత తేలిక చేశాడు. చివరి నాలుగు ఓవర్లలో కేవలం 24 పరుగులే అవసరమైన దశలో ఆ జట్టు విజయం దాదాపు ఖాయమైపోయింది. ఆ తర్వాత పాండే, శంకర్‌ అలవోకగా పని పూర్తి చేశారు.

రాయల్స్‌కు కళ్లెం: దాదాపు బ్యాట్స్‌మెనంతా పరుగుల బాటపట్టినా ఎవరూ పెద్ద ఇన్నింగ్స్‌ ఆడకపోవడంతో రాజస్థాన్‌కు తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకోక తప్పలేదు. హోల్డర్‌తో పాటు రషీద్‌ ఖాన్‌, విజయ్‌ శంకర్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆ జట్టుకు కళ్లెం వేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌.. పరుగుల కోసం కష్టపడింది. సందీప్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో ఓ సిక్స్‌, ఫోర్‌తో జోరందుకున్నట్లు కనిపించిన ఉతప్ప (19; 13 బంతుల్లో 2×4, 1×6) తర్వాతి ఓవర్లోనే రనౌటయ్యాడు. శాంసన్‌, స్టోక్స్‌ (30; 32 బంతుల్లో 2×4) నిలిచారు కానీ వేగంగా ఆడలేకపోయారు. బౌండరీలు సాధించడం కష్టమైంది. 11 ఓవర్లకు స్కోరు 77 పరుగులు. ఇక బ్యాట్‌ ఝుళిపిస్తారనుకున్న దశలో ఇద్దరూ వరుస ఓవర్లలో ఔట్‌ కావడంతో రాయల్స్‌ పెద్ద స్కోరు ఆశలకు కళ్లెం పడింది. 12వ ఓవర్లో హోల్డర్‌ ఓ చక్కని ఆఫ్‌ కట్టర్‌తో శాంసన్‌ను బౌల్డ్‌ చేయగా.. స్టోక్స్‌ను రషీద్‌ బౌల్డ్‌ చేశాడు. పరుగులు చేయడానికి ఇబ్బందిపడ్డ బట్లర్‌ (12 బంతుల్లో 9) కూడా ఎక్కువసేపు నిలవలేదు. అయితే సన్‌రైజర్స్‌ పేసర్‌ నటరాజన్‌ (0/46) మాత్రం రాజస్థాన్‌కు దొరికిపోయాడు. అతడు వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో పరాగ్‌ వరుసగా 4, 6, 4 బాదేశాడు. స్మిత్‌ (19), పరాగ్‌ (20) 19వ ఓవర్లో హోల్డర్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔటయ్యారు. ఆర్చర్‌ (16 నాటౌట్‌) కాస్త బ్యాట్‌ ఝుళిపించడంతో స్కోరు 150 దాటింది.

140


మనీష్‌, శంకర్‌ మధ్య నమోదైన భాగస్వామ్యం.


ఇద్దరు మేటి బ్యాట్స్‌మన్‌
త్వరగానే ఔటైపోయారు. ఇప్పటికే సన్‌రైజర్స్‌
మిడిలార్డర్‌పై చాలా చర్చ జరుగుతోంది. నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం అనిపించింది.  

- మనీష్‌ పాండే

రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: ఉతప్ప రనౌట్‌ 19; స్టోక్స్‌ (బి) రషీద్‌ 30; సంజు శాంసన్‌ (బి) హోల్డర్‌ 36; బట్లర్‌ (సి) నదీమ్‌ (బి) శంకర్‌ 9; స్మిత్‌ (సి) పాండే (బి) హోల్డర్‌ 19; పరాగ్‌ (సి) వార్నర్‌ (బి) హోల్డర్‌ 20; తెవాతియా నాటౌట్‌ 2; ఆర్చర్‌ నాటౌట్‌ 16; ఎక్స్‌ట్రాలు 3

మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 154;

వికెట్ల పతనం: 1-30, 2-86, 3-86, 4-110, 5-134, 6-135;

బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4-0-31-0; హోల్డర్‌ 4-0-33-3; విజయ్‌ శంకర్‌ 3-0-15-1; నటరాజన్‌ 4-0-46-0; రషీద్‌ ఖాన్‌ 4-0-20-1; నదీమ్‌ 1-0-9-0
సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) స్టోక్స్‌ (బి) ఆర్చర్‌ 4; బెయిర్‌స్టో (బి) ఆర్చర్‌ 10; పాండే నాటౌట్‌ 83; శంకర్‌ నాటౌట్‌ 52; ఎక్స్‌ట్రాలు 7;

మొత్తం: (18.1 ఓవర్లలో 2 వికెట్లకు) 156;

వికెట్ల పతనం: 1-4, 2-16;

బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-21-2; రాజ్‌పుత్‌ 1-0-11-0; త్యాగి  3.1-0-42-0; స్టోక్స్‌ 2-0-24-0; గోపాల్‌ 4-0-32-0; తెవాతియా 4-0-25-0


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.