close

తాజా వార్తలు

Published : 24/10/2020 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెన్నైని చితక్కొట్టేశారు

మెరిసిన బుమ్రా, బౌల్ట్‌, ఇషాన్‌

పది వికెట్లతో ముంబయి ఘనవిజయం
షార్జా

3-3, 4-3 ఇవేమైనా ఫుట్‌బాల్‌ స్కోర్లా.. సామాజిక మాధ్యమాల్లో ఇలా జోకులు పేలాయి..! బెంగళూరు అత్యల్ప పరుగుల రికార్డు (49) బద్దలైనట్లేనన్న అంచనాలు మొదలయ్యాయి..! ముంబయితో మ్యాచ్‌లో చెన్నై పేక మేడను తలపించగా ఆ జట్టుపై ట్రోలింగ్‌తో అంతర్జాలం హోరెత్తిపోయింది. ఐపీఎల్‌లోనే అత్యంత చెత్త ప్రదర్శన చేసిన మూడుసార్లు ఛాంపియన్‌ మరో మూడు మ్యాచ్‌లుండగానే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఐపీఎల్‌లో ఎనిమిదిసార్లు ఫైనల్‌ చేరడంతో పాటు.. ఆడిన ప్రతీసారి ప్లేఆఫ్స్‌/సెమీఫైనల్లో ప్రవేశించిన ధోని బృందం ఈసారి అందరికంటే ముందే బ్యాగులను సర్దేసింది. ఈ సీజన్లో అత్యంత అధ్వాన ప్రదర్శన చేస్తూ.. అభిమానులను మరింత నిరాశలో ముంచెత్తుతూ సీఎస్‌కే.. ముంబయి ఇండియన్స్‌ చేతిలో 10 వికెట్లతో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ముంబయికి 10 మ్యాచ్‌ల్లో ఇది ఏడో విజయం కాగా.. చెన్నైకి 11 మ్యాచ్‌ల్లో ఇది ఎనిమిదో ఓటమి.
చెన్నైకు శరాఘాతం! వరుస ఓటములతో కుంగిపోయిన ఆ జట్టును ముంబయి మరింత గట్టిగా కొట్టింది. మొదట బౌలింగ్‌లో విజృంభించి, ఆ తర్వాత బ్యాటింగ్‌లో చెలరేగి ఘోర పరాజయం రుచిచూపించింది. శుక్రవారం మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బౌల్ట్‌ (4/18), బుమ్రా (2/25), రాహుల్‌ చాహర్‌ (2/22)ల దెబ్బకు 9 వికెట్లకు 114 పరుగులే చేయగలిగింది. ఆ మాత్రం స్కోరు చేసిందంటే కారణం సామ్‌ కరన్‌ (52; 47 బంతుల్లో 4×4, 2×6) చలవే. ఆరంభంలో పేస్‌కు చిత్తయిన చెన్నై 21కే 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ చేష్టలుడిగిన ఆ జట్టు.. అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. ఇషాన్‌ కిషన్‌ (68 నాటౌట్‌; 37 బంతుల్లో 6×4, 5×6), డికాక్‌ (46 నాటౌట్‌; 37 బంతుల్లో 5×4, 2×6) మెరుపులతో లక్ష్యాన్ని ముంబయి 12.2 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది.

ముంబయి మెరుపులా..: స్వింగ్‌లు, బౌన్సర్లు, యార్కర్లు.. ఇలా చెన్నై బ్యాట్స్‌మెన్‌ను ముంబయి బౌలర్లు భయపెట్టారు. 114 పరుగులు చేయడానికే ఆ జట్టు నానాకష్టాలు పడింది. ముంబయికి కూడా అంత తేలిగ్గా మ్యాచ్‌ దక్కకపోవచ్చన్న అంచనాలు సాగుతుండగానే మ్యాచ్‌ ఏకపక్షమే అని తేలిపోయింది. ముంబయి ఓపెనర్లు ఆరంభం నుంచి బాదడమే పనిగా పెట్టుకోగా.. లక్ష్యం ఇట్టే కరిగిపోయింది. ఇషాన్‌ కిషన్‌, డికాక్‌ ఏ బౌలర్‌నూ వదిలిపెట్టలేదు. సిక్సర్లతో హోరెత్తించిన ఇషాన్‌ పరుగుల వరద పారించాడు. అతనికి తోడు డికాక్‌ మెరవడంతో ఆ జట్టు 10 ఓవర్లకే 98/0తో లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. జోరు కొనసాగించిన ఈ జోడీ వికెట్‌ నష్టం లేకుండా మరో 46 బంతులు మిగిలివుండగానే జట్టుకు విజయాన్ని సాధించిపెట్టింది.

చెన్నై ఢమాల్‌: మామూలుగా బ్యాటింగ్‌కు సహకరించే షార్జా పిచ్‌పై చెన్నై ఇన్నింగ్స్‌ సైకిల్‌ స్టాండ్‌నే తలపించింది. ప్రణాళికబద్దంగా పదునైన బంతులతో విజృంభించిన బౌల్ట్‌, బుమ్రా చెన్నైకి ఊపిరాడనీయలేదు. తొలి ఓవర్లో కుర్రాడు రితురాజ్‌ గైక్వాడ్‌(0)ను బౌల్ట్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నది మొదలు.. చెన్నై అసలు కోలుకోలేకపోయింది. రాయుడు (2)ను షార్ట్‌ బంతితో బుమ్రా బోల్తాకొట్టించాడు. కొత్త కుర్రాడు జగదీశన్‌ (0) క్రీజులోకి రాగానే స్లిప్స్‌లో పొలార్డ్‌ ఫీల్డర్లను మొహరించగా.. బుమ్రా లోపలికి దూసుకొచ్చే బంతితో బ్యాట్స్‌మన్‌కు సవాల్‌ విసిరాడు. సరైన ఫుట్‌వర్క్‌ లేకుండానే ఆడిన అతడు పేస్‌ను అంచనా వేయలేక స్లిప్స్‌లో సూర్యకుమార్‌కు దొరికిపోయాడు. డుప్లెసిస్‌ (1) ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతిని ఆడే ప్రయత్నంలో బౌల్ట్‌ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఇలా బౌలర్లు వికెట్ల పండుగ చేసుకున్న వేళ చెనై 3 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. బౌల్ట్‌ తన తొలి మూడు ఓవర్లలో 5 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసి సీఎస్‌కేను గట్టిదెబ్బ కొట్టాడు. పవర్‌ప్లే ఆఖరికి సీఎస్‌కే 24/5తో మరింత కష్టాల్లో కూరుకుపోయింది. మరోవైపు రాహుల్‌ చాహర్‌ కూడా విజృంభించడంతో చెన్నై కష్టాలు మరింత పెరిగాయి. చాహర్‌ వేసిన ఏడో ఓవర్లో సిక్స్‌ బాది ఊపు మీద కనిపించిన కెప్టెన్‌ ధోని (16) ఆ తర్వాత బంతికే వికెట్‌ ఇచ్చుకున్నాడు. ఒక దశలో 43/7తో నిలిచిన చెన్నై.. ఐపీఎల్‌లో అత్యల్ప స్కోరు సాధించిన బెంగళూరు (49)ను రికార్డును బద్దలు కొడుతుందా అనిపించింది. కానీ వీలుచిక్కినప్పుడల్లా భారీ షాట్లు కొట్టిన కరన్‌.. సీఎస్‌కే పరువు కాపాడాడు. శార్దూల్‌ ఠాకూర్‌ (11), సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న తాహిర్‌ (13 నాటౌట్‌) జతగా సీఎస్‌కే స్కోరు 100 దాటించాడు.  46 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కరన్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి ఔటయ్యాడు.


చెన్నై ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ ఎల్బీ (బి) బౌల్ట్‌ 0; డుప్లెసిస్‌ (సి) డికాక్‌ (బి) బౌల్ట్‌ 1; రాయుడు (సి) డికాక్‌ (బి) బుమ్రా 2; జగదీశన్‌ (సి) సూర్యకుమార్‌ (బి) బుమ్రా 0; ధోని (సి) డికాక్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 16; జడేజా (సి) కృనాల్‌ (బి) బౌల్ట్‌ 7; కరన్‌ (బి) బౌల్ట్‌ 52; దీపక్‌ చాహర్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 0; శార్దూల్‌ (సి) సూర్య కుమార్‌ (బి) కౌల్టర్‌నీల్‌ 11; తాహిర్‌ నాటౌట్‌ 13; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 114; వికెట్ల పతనం: 1-0, 2-3, 3-3, 4-3, 5-21, 6-30, 7-43, 8-71, 9-114; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-1-18-4; బుమ్రా 4-0-25-2; కృనాల్‌ 3-0-16-0; రాహుల్‌ చాహర్‌ 4-0-22-2; కౌల్టర్‌నీల్‌ 4-0-25-1; పొలార్డ్‌ 1-0-4-0
ముంబయి ఇన్నింగ్స్‌: డికాక్‌ నాటౌట్‌ 46; ఇషాన్‌ నాటౌట్‌ 68; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (12.2 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా) 116; బౌలింగ్‌: దీపక్‌ 4-0-34-0; హేజిల్‌వుడ్‌ 2-0-17-0; తాహిర్‌ 3-0-22-0; శార్దూల్‌ 2.2-0-26-0; జడేజా 1-0-15-0


‘‘ఓటమి 10 వికెట్ల తేడాతోనా, 8 వికెట్ల తేడాతోనా అన్నది సమస్య కాదు. టోర్నీలో జట్టు ఎలాంటి స్థితిలో ఉందన్నది ఊహించుకుంటేనే చాలా బాధేస్తుంది. ఎక్కడ తప్పు జరిగింది అన్న దానిపై దృష్టి సారించాలి. సరైన ప్రదర్శన చేయనప్పుడు వైఫల్యానికి వంద కారణాలు కనిపిస్తాయి. అసలు సామర్థ్యం మేరకు ఆడామా అన్నది ఆటగాళ్లంతా ప్రశ్నించుకోవాలి. ఈ ఏడాది మా జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదన్నది వాస్తవం. వచ్చే ఏడాది సరైన ప్రణాళికతో బరిలో దిగడం చాలా ముఖ్యం. మిగతా మూడు మ్యాచ్‌ల్లో కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి.. వచ్చే ఏడాదికి సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తాం’’

- ధోని



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.