close

తాజా వార్తలు

Published : 01/11/2020 02:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దిల్లీ.. మళ్లీ

ముంబయి ఇండియన్స్‌ చేతిలో చిత్తు

ఐపీఎల్‌-13లో ఇంకొక్క విజయం సాధించి ప్లేఆఫ్‌లో అడుగుపెట్టాలనే ఆశతో ఉన్న దిల్లీ క్యాపిటల్స్‌కు మరోసారి భంగపాటు తప్పట్లేదు. శనివారం మ్యాచ్‌లో అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైన ఆ జట్టు.. ముంబయి ఇండియన్స్‌ చేతిలో చిత్తుగా ఓడింది. వరుసగా నాలుగో ఓటమి మూటకట్టుకున్న దిల్లీ.. చివరి మ్యాచ్‌లో గెలిస్తే తప్ప ముందంజ వేయలేని స్థితికి చేరుకుంది. ఇప్పటికే ప్లేఆఫ్‌ చేరిన ముంబయి.. ఈ విజయంతో అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది.
దుబాయ్‌: ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ను ఎందుకు బలమైన జట్టుగా పరిగణిస్తారో మరోసారి రుజువైంది. శనివారం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఆ జట్టు 9 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. ఈ పోరును పూర్తి ఏకపక్షంగా మార్చేసిన ముంబయి.. అసలు ప్రత్యర్థికి ఏ దశలోనూ పోటీలోకి వచ్చే అవకాశమే ఇవ్వలేదు. మొదట బ్యాటింగ్‌ చేసిన దిల్లీ.. బుమ్రా (3/17), బౌల్ట్‌ (3/21) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లకు 110 పరుగులే చేసింది. కెప్టెన్‌ శ్రేయస్‌ (25) టాప్‌స్కోరర్‌. ఛేదనలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఇషాన్‌ కిషన్‌ (72 నాటౌట్‌; 47 బంతుల్లో 8×4, 3×6) చెలరేగడంతో ముంబయి ఒక వికెట్‌ కోల్పోయి 14.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. మొదట దిల్లీ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడానికి కష్టపడ్డ పిచ్‌పై ముంబయి అలవోకగా లక్ష్యాన్ని చేరుకుంది. డికాక్‌ (26)తో కలిసి ఆరంభంలో కాస్త జాగ్రత్తగా ఆడిన కిషన్‌.. కుదురుకున్నాక చెలరేగాడు. ముంబయి పేసర్లు విజృంభించిన పిచ్‌పై రబాడ, నార్జ్‌ సహా ప్రత్యర్థి బౌలర్లెవరూ అతణ్ని  ఇబ్బంది పెట్టలేకపోయారు. డికాక్‌ వికెట్‌ కూడా స్వీయ తప్పిదం వల్ల లభించిందే తప్ప దిల్లీ బౌలర్ల కష్టమేమీ లేదు.

పేస్‌కు విలవిల...: కీలకమైన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ ఎలాంటి పోరాట పటిమ చూపించలేకపోయింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ముంబయి పేసర్లు బౌల్ట్‌, బుమ్రాకు దిల్లీ బ్యాట్స్‌మెన్‌ దాసోహమన్నారు. ఏ దశలోనూ ఆ జట్టు కనీసం పోరాడే స్కోరైనా సాధించేలా కనిపించలేదు. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే వరుస ఓవర్లలో ధావన్‌ (0), పృథ్వీ షా (10)లను బౌల్ట్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఈ దశలో  పంత్‌ (21), శ్రేయస్‌ ఆచితూచి ఆడడంతో దిల్లీ తొలి ఆరు ఓవర్లు ముగిసేసరికి 22/2తో నిలిచింది. ఈ జోడీ పది ఓవర్ల వరకూ క్రీజులో ఉన్నప్పటికీ ధాటిగా ఆడలేకపోయింది. ఇక గేర్‌ మార్చే సమయంలో రాహుల్‌ చాహర్‌ (1/24) బౌలింగ్‌లో డికాక్‌ మెరుపు స్టంపింగ్‌కు శ్రేయస్‌ వెనుదిరిగాడు. ఒకే ఓవర్లో బుమ్రా.. స్టాయినిస్‌ (2)తో పాటు పంత్‌ను ఔట్‌ చేసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. 12 ఓవర్లకు 63/5తో నిలిచిన దిల్లీ.. ఆ తర్వాత ఏ దశలోనూ వేగాన్ని అందుకోలేదు.
దిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) డికాక్‌ (బి) బౌల్ట్‌ 10; ధావన్‌ (సి) సూర్యకుమార్‌ (బి) బౌల్ట్‌ 0; శ్రేయస్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 25; పంత్‌ ఎల్బీ (బి) బుమ్రా 21; స్టాయినిస్‌ (సి) డికాక్‌ (బి) బుమ్రా 2; హెట్‌మయర్‌ (సి) కృనాల్‌ (బి) కౌల్టర్‌నైల్‌ 11; హర్షల్‌ పటేల్‌ ఎల్బీ (బి) బుమ్రా 5; అశ్విన్‌ (సి) కృనాల్‌ (బి) బౌల్ట్‌ 12; ప్రవీణ్‌ దూబె నాటౌట్‌ 7; రబాడ రనౌట్‌ 12; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 110; వికెట్ల పతనం: 1-1, 2-15, 3-50, 4-57, 5-62, 6-73, 7-78, 8-96, 9-110; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-21-3; కృనాల్‌ 3-0-13-0; జయంత్‌ 3-0-18-0; బుమ్రా 4-0-17-3; కౌల్టర్‌నైల్‌ 2-0-14-1; రాహుల్‌ చాహర్‌ 4-0-24-1
ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ నాటౌట్‌ 72; డికాక్‌ (బి) నార్జ్‌ 26; సూర్యకుమార్‌ నాటౌట్‌ 12; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం: (14.2 ఓవర్లలో 1 వికెట్‌కు) 111; వికెట్ల పతనం: 1-68; బౌలింగ్‌: అశ్విన్‌ 4-0-18-0; రబాడ 3-0-27-0; నార్జ్‌ 2.2-0-25-1; స్టాయినిస్‌ 1-0-4-0; ప్రవీణ్‌ దూబె 3-0-29-0; హర్షల్‌ పటేల్‌ 1-0-8-0


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.