close

తాజా వార్తలు

Published : 01/11/2020 02:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సన్‌రైజర్స్‌ అదరహో..

ఆరో గెలుపుతో ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం
 బెంగళూరుపై ఘనవిజయం
 రాణించిన సందీప్‌, హోల్డర్‌

కీలక సమయంలో సన్‌రైజర్స్‌ సత్తా చాటింది. ఐపీఎల్‌-13 ప్లేఆఫ్స్‌ ఆశలు నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు బెంగళూరును చిత్తు చేసింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఆరో విజయం సాధించిన సన్‌రైజర్స్‌ ముందంజ వేయాలంటే ముంబయితో చివరి మ్యాచ్‌లోనూ గెలవాల్సిందే. వరుసగా మూడో మ్యాచ్‌ ఓడినా బెంగళూరు ప్లేఆఫ్స్‌ రేసులోనే ఉంది.
షార్జా: సన్‌రైజర్స్‌ అదరగొట్టింది. శనివారం ఆ జట్టు 5 వికెట్ల తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. బెంగళూరు మొదట 7 వికెట్లకు 120 పరుగులే చేయగలిగింది. ఫిలిప్‌ (32; 31 బంతుల్లో 4×4) టాప్‌ స్కోరర్‌. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సందీప్‌ శర్మ (2/20)తో పాటు రషీద్‌ ఖాన్‌ (1/24), హోల్డర్‌ (2/27) బెంగళూరుకు కళ్లెం వేశారు. సాహా (39; 32 బంతుల్లో 4×4, 1×6), హోల్డర్‌ (26 నాటౌట్‌; 10 బంతుల్లో 1×4, 2×6) మెరవడంతో లక్ష్యాన్ని హైదరాబాద్‌ 14.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
హోల్డర్‌ ధనాధన్‌: లక్ష్యం చిన్నదే అయినా సన్‌రైజర్స్‌కు ఉత్కంఠ క్షణాలు తప్పలేదు.వార్నర్‌ (8) త్వరగానే నిష్క్రమించినా సాహా, మనీష్‌ పాండే (26; 19 బంతుల్లో 3×4, 1×6) రాణించడంతో సన్‌రైజర్స్‌ 6 ఓవర్లకు 58/1తో మెరుగైన స్థితిలోనే నిలిచింది. అయితే చాహల్‌ (2/19).. ఏడో ఓవర్లో పాండేను ఔట్‌ చేయడంతో బెంగళూరు పోటీలోకొచ్చింది. ఉదాన కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో సన్‌రైజర్స్‌కు పరుగులు తేలిగ్గా రాలేదు. పైగా 11వ ఓవర్లో సాహాను చాహల్‌, 13వ ఓవర్లో విలియమ్సన్‌ (8)ను ఉదాన ఔట్‌ చేయడంతో.. సాధించాల్సిన పరుగులు తక్కువే (47 బంతుల్లో 34) ఉన్నా సన్‌రైజర్స్‌పై ఒత్తిడి పెరిగింది. అలాంటి పరిస్థితుల్లో హోల్డర్‌ దూకుడుతో ఆ జట్టు ఊపిరి పీల్చుకుంది. ఉదాన బౌలింగ్‌లో ఓ సిక్స్‌, సైని బౌలింగ్‌లో వరుసగా 6, 4 కొట్టి..  బెంగళూరు ఆశలపై హోల్డర్‌ నీళ్లు చల్లాడు. అతను దూకుడు కొనసాగించడంతో సన్‌రైజర్స్‌కు ఇబ్బంది లేకపోయింది.
ఆర్సీబీ కష్టాలు..: అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మొదట బెంగళూరుకు పరుగులు చేయడం కష్టమైపోయింది. సందీప్‌ శర్మ అద్భుత బౌలింగ్‌ కారణంగా 5 ఓవర్లలో 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బెంగళూరు తిరిగి కోలుకోలేకపోయింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న పడిక్కల్‌ (5)తో పాటు కెప్టెన్‌ కోహ్లి (7)ని అతడు వెనక్కి పంపాడు. ఫిలిప్‌తో కలిసి డివిలియర్స్‌ (24; 24 బంతుల్లో 1×4, 1×6) జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించాడు. కానీ పరుగులు కష్టంగానే వచ్చాయి. ఏబీ ఔటయ్యాక బెంగళూరు ఏమాత్రం పుంజుకోలేకపోయింది. రషీద్‌ ఖాన్‌ కూడా తన స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్‌ ఫిలిప్‌ను అతడు వెనక్కి పంపాడు. తర్వాతి బ్యాట్స్‌మెన్‌ అద్భుతాలేమీ చేయలేదు. బౌలర్లు ఏమాత్రం స్వేచ్ఛనివ్వకపోవడంతో బెంగళూరు చివరి 8 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 44 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఓవర్లలో మూడే బౌండరీలొచ్చాయి.
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: ఫిలిప్‌ (సి) పాండే (బి) రషీద్‌ 32; పడిక్కల్‌ (బి) సందీప్‌ శర్మ 5; కోహ్లి (సి) విలియమ్సన్‌ (బి) సందీప్‌ శర్మ 7; ఏబీ డివిలియర్స్‌ (సి) అభిషేక్‌ (బి) నదీమ్‌ 24; వాషింగ్టన్‌ సుందర్‌ (సి) అండ్‌ (బి) నటరాజన్‌ 21; గుర్‌కీరత్‌ నాటౌట్‌ 15; మోరిస్‌ (సి) వార్నర్‌ (బి) హోల్డర్‌ 3; ఉదాన (సి) విలియమ్సన్‌ (బి) హోల్డర్‌ 0; సిరాజ్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 120
వికెట్ల పతనం: 1-13, 2-28, 3-71, 4-76, 5-106, 6-113, 7-114
బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4-0-20-2; హోల్డర్‌ 4-0-27-2; నటరాజన్‌ 4-0-11-1; నదీమ్‌ 4-0-35-1; రషీద్‌ ఖాన్‌ 4-0-24-1
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) ఉదాన (బి) సుందర్‌ 8; సాహా (స్టంప్డ్‌) డివిలియర్స్‌ (బి) చాహల్‌ 39; పాండే (సి) మోరిస్‌ (బి) చాహల్‌ 26; విలియమ్సన్‌ (సి) కోహ్లి (బి) ఉదాన 8; అభిషేక్‌ (సి) గుర్‌కీరత్‌ (బి) సైని 8; హోల్డర్‌ నాటౌట్‌ 26; సమద్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (14.1 ఓవర్లలో 5 వికెట్లకు) 121
వికెట్ల పతనం: 1-10, 2-60, 3-82, 4-87, 5-114
బౌలింగ్‌: మోరిస్‌ 2-0-19-0; వాషింగ్టన్‌ సుందర్‌ 3-0-21-1; సైని 2-0-30-1; సిరాజ్‌ 1-0-12-0; చాహల్‌ 3.1-0-19-2; ఉదాన 3-0-20-1


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.