కోల్‌కతా బంతి మెరిసింది

తాజా వార్తలు

Updated : 27/04/2021 04:22 IST

కోల్‌కతా బంతి మెరిసింది

స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలుపు
సమష్టిగా సత్తా చాటిన బౌలర్లు
రాణించిన మోర్గాన్‌, త్రిపాఠి
అహ్మదాబాద్‌

అహ్మదాబాద్‌లోనూ అంతే. చెన్నై చెపాక్‌లో మాదిరే ఇక్కడా పరుగుల కోసం బ్యాట్స్‌మెన్‌ చెమటోడ్చాల్సి వచ్చింది. ఆధిపత్యం బౌలర్లదే. అయితే మోర్గాన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడటంతో స్వల్ప స్కోర్ల పోరులో పంజాబ్‌పై కోల్‌కతాదే పైచేయి అయింది. ప్రత్యర్థిని 123కే కట్టడి చేసినా.. ఛేదనలో నైట్‌రైడర్స్‌ శ్రమించక తప్పలేదు. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమితో ప్లేఆఫ్స్‌ రేసులో బాగా వెనుకబడ్డ ఆ జట్టుకు ఇది ఊరట విజయం. పంజాబ్‌కు ఇది నాలుగో ఓటమి.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మెరిసింది. సోమవారం అహ్మదాబాద్‌లోని    మొతెరాలో జరిగిన తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. మొదట కోల్‌కతా బౌలర్ల ధాటికి పంజాబ్‌ 9 వికెట్లకు 123 పరుగులే చేయగలిగింది. మయాంక్‌ (31; 34 బంతుల్లో 1×4, 2×6) టాప్‌ స్కోరర్‌. చివర్లో జోర్డాన్‌ (30; 18 బంతుల్లో 1×4, 3×6) బ్యాట్‌ ఝుళిపించాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ (3/30), నరైన్‌ (2/22), కమిన్స్‌ (2/31) ప్రత్యర్థిని దెబ్బతీశారు. ఛేదనలో కోల్‌కతా ఇబ్బంది  పడ్డా.. మోర్గాన్‌ (47 నాటౌట్‌; 40 బంతుల్లో 4×4, 2×6) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. రాహుల్‌ త్రిపాఠి (41; 32 బంతుల్లో 7×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.
నిలిచిన మోర్గాన్‌: లక్ష్యం చిన్నదే అయినా కోల్‌కతా ఛేదన సాఫీగా ఏమీ సాగలేదు. 3 ఓవర్లలో 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. తొలి ఓవర్లోనే నితీష్‌ రాణా (0)ను హెన్రిక్స్‌ ఔట్‌ చేయగా.. తర్వాతి ఓవర్లో శుభ్‌మన్‌ (9)ను షమి వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. నరైన్‌ను అర్ష్‌దీప్‌ ఖాతా తెరవనివ్వలేదు. ఆ దశలో రాహుల్‌ త్రిపాఠి, కెప్టెన్‌ మోర్గాన్‌ జట్టును ఆదుకున్నారు. చక్కగా స్ట్రైక్‌రొటేట్‌ చేసుకుంటూ వీలైనప్పుడల్లా బంతిని బౌండరీ దాటించారు. షమి ఓవర్లో మోర్గాన్‌ సిక్స్‌, ఫోర్‌ కొట్టగా.. ఆర్ష్‌దీప్‌ ఓవర్లో త్రిపాఠి రెండు బౌండరీలు సాధించాడు. 11 ఓవర్లలో స్కోరు 76/3. అయితే ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్న దశలో హుడా బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌కు యత్నించిన త్రిపాఠి లాంగాన్‌లో చిక్కడంతో 66 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. కోల్‌కతాపై ఒత్తిడి తేవడానికి పంజాబ్‌కు ఓ అవకాశమూ దక్కింది. కానీ మోర్గాన్‌ పట్టుదలగా నిలిచాడు. చక్కని బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ.. రసెల్‌ (10), కార్తీక్‌ (12 నాటౌట్‌)ల సాయంతో జట్టును గెలిపించాడు.

పంజాబ్‌ కష్టంగా..: అంతకుముందు మందకొడి పిచ్‌పై పంజాబ్‌ పరుగుల కోసం ఆద్యంతమూ చెమటోడ్చింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన ఆ జట్టు ఏ దశలోనూ బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. ఆరంభమే పేలవం. 8 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 44/4.  ఓపెనర్లు దూకుడుగా ఆడలేకపోయారు. మయాంక్‌ మొదట్లో కొన్ని షాట్లు ఆడినా..  రాహుల్‌ (19) మాత్రం బాగా ఇబ్బంది పడ్డాడు. ఆరో ఓవర్లో రాహుల్‌ను ఔట్‌ చేయడం ద్వారా పంజాబ్‌ పతనాన్ని మొదలెట్టాడు కమిన్స్‌. తర్వాతి ఓవర్లోనే గేల్‌ను శివమ్‌ మావి ఔట్‌ చేయగా.. ఆ వెంటనే దీపక్‌ హుడా (1)ను ప్రసిద్ధ్‌ కృష్ణ ఔట్‌ చేశాడు. ఏకబికిన నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసిన శివమ్‌ మావి కేవలం 13 పరుగులే ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. మయాంక్‌ క్రీజులో ఉన్నా ఇన్నింగ్సేమీ జోరందుకోలేదు. 12 ఓవర్లు ముగిసే సరికి అతణ్ని కూడా కోల్పోయిన పంజాబ్‌ 63/4తో నిలిచింది. తర్వాత కూడా పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో మార్పేమీ లేదు. కోల్‌కతా బౌలర్లు విజృంభించడంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. 18 ఓవర్లకు స్కోరు 98/7. కానీ ఆఖర్లో జోర్డాన్‌ చెలరేగడంతో పంజాబ్‌ స్కోరు 120 దాటింది. కమిన్స్‌ వేసిన 19వ ఓవర్లో 4, 6 బాదిన అతడు.. ప్రసిద్ధ్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో రెండు సిక్స్‌లు దంచి ఔటయ్యాడు.
 

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) నరైన్‌ (బి) కమిన్స్‌ 19; మయాంక్‌ (సి) త్రిపాఠి (బి) నరైన్‌ 31; గేల్‌ (సి) కార్తీక్‌ (బి) శివమ్‌ మావి 0; దీపక్‌ హుడా (సి) మోర్గాన్‌ (బి) ప్రసిద్ధ్‌ కృష్ణ 1; పూరన్‌ (బి) వరుణ్‌ 19; హెన్రిక్స్‌ (బి) నరైన్‌ 2; షారుక్‌ ఖాన్‌ (సి) మోర్గాన్‌ (బి) ప్రసిద్ధ్‌కృష్ణ 13; జోర్డాన్‌ (బి) ప్రసిద్ధ్‌కృష్ణ 30; రవి బిష్ణోయ్‌ (సి) మోర్గాన్‌ (బి) కమిన్స్‌ 1; షమి నాటౌట్‌ 1; అర్ష్‌దీప్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 5

మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 123;

వికెట్ల పతనం: 1-36, 2-38, 3-42, 4-60, 5-75, 6-79, 7-95, 8-98, 9-121;

బౌలింగ్‌: శివమ్‌ మావి 4-0-13-1; కమిన్స్‌ 3-0-31-2; నరైన్‌ 4-0-22-2; ప్రసిద్ధ్‌ కృష్ణ 4-0-30-3; రసెల్‌ 1-0-2-0; వరుణ్‌ చక్రవరి 6-0-24-1

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: శుభ్‌మన్‌ ఎల్బీ (బి) షమి 9; రాణా (సి) షారుక్‌ (బి) హెన్రిక్స్‌ 0; రాహుల్‌ త్రిపాఠి (సి) షారుక్‌ (బి) హుడా 41; నరైన్‌ (సి) రవి బిష్ణోయ్‌ (బి) అర్ష్‌దీప్‌ 0; మోర్గాన్‌ నాటౌట్‌ 47; రసెల్‌ రనౌట్‌ 10; కార్తీక్‌ నాటౌట్‌ 12; ఎక్స్‌ట్రాలు 7

మొత్తం: (16.4 ఓవర్లలో 5 వికెట్లకు) 126;

వికెట్ల పతనం: 1-5, 2-9, 3-17, 4-83, 5-98;

బౌలింగ్‌: హెన్రిక్స్‌ 1-0-5-1; షమి 4-0-25-1; అర్ష్‌దీప్‌ 2.4-0-27-1; రవి బిష్ణోయ్‌ 4-0-19-0; జోర్డాన్‌ 3-0-24-0; దీపక్‌ హుడా 2-0-20-1


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని