పాక్‌కు షాక్‌

తాజా వార్తలు

Published : 18/09/2021 03:39 IST

పాక్‌కు షాక్‌

పర్యటన రద్దు చేసుకుని స్వదేశానికి కివీస్‌

తొలి వన్డే ముంగిట అనూహ్య నిర్ణయం

రావల్పిండి స్టేడియంలో కాసేపట్లో పాక్‌-న్యూజిలాండ్‌ తొలి వన్డే మొదలు కావాలి. చాలా ఏళ్ల తర్వాత ఓ పెద్ద జట్టుతో పాక్‌ సొంతగడ్డపై మ్యాచ్‌ ఆడబోతోందని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కానీ మ్యాచ్‌ సమయం దగ్గరపడుతున్నా హోటల్‌ నుంచి న్యూజిలాండ్‌ ఆటగాళ్లు బయటికి రాలేదు. స్టేడియంలోకి అభిమానులను అనుమతించలేదు. నిర్ణీత సమయానికి మ్యాచ్‌ ఆరంభం కాలేదు. ఏం జరుగుతోందో తెలియక అంతా అయోయం. అప్పుడే సంచలన సమాచారం బయటికొచ్చింది. భద్రత కారణాలతో ఈ పర్యటనను రద్దు చేసుకుని న్యూజిలాండ్‌ జట్టు స్వదేశానికి పయనమైంది.

రావల్పిండి: పాకిస్థాన్‌ క్రికెట్‌కు దిమ్మదిరేగే షాక్‌. ఇప్పుడిప్పుడే దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తుపై ఎంతో ఆశతో ఉన్న ఆ దేశానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్‌ పర్యటనను న్యూజిలాండ్‌ భద్రత కారణాలతో రద్దు చేసుకుంది. ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే ఆ జట్టు ఈ నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల విరామం తర్వాత పాకిస్థాన్‌కు వచ్చిన కివీస్‌.. తొలి వన్డే ఆరంభానికి కొని నిమిషాల ముందు తన నిర్ణయాన్ని ప్రకటించింది. దీనిపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రత ముప్పు లేనే లేదని, న్యూజిలాండ్‌ ఏకపక్షంగా వ్యవహరించిందని చెప్పింది. పాక్‌ పర్యటనలో కివీస్‌ మూడు వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సివుంది. దేశానికి అంతర్జాతీయ జట్లను రప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న పాకిస్థాన్‌కు న్యూజిలాండ్‌ నిష్క్రమణ పెద్ద ఎదురుదెబ్బే.

శుక్రవారం రావల్పిండిలో తొలి మ్యాచ్‌ కోసం స్టేడియం సామర్థ్యంలో 25 శాతం మందిని అనుమతించాలని నిర్ణయించారు కూడా. కానీ మ్యాచ్‌ ఆరంభ సమయమైనా రెండు జట్లు హోటల్‌ గదుల్లోనే ఉండిపోయాయి. ఏం జరిగిందో వెంటనే ఎవరికీ అర్థం కాలేదు. కానీ తర్వాత న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారి డేవిడ్‌ వైట్‌ ఓ ప్రకటన విడుదల చేశాడు. భద్రత కారణాలతో పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపాడు. ‘‘జట్టు భద్రతకు ముప్పు పెరిగిందని న్యూజిలాండ్‌ ప్రభుత్వం చెప్పడంతోపాటు పాక్‌లోనే ఉన్న న్యూజిలాండ్‌ క్రికెట్‌ భద్రత అధికారుల సలహా మేరకు పర్యటనను కొనసాగించరాదని నిర్ణయించాం. పీసీబీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు. మాకు గొప్ప ఆతిథ్యం ఇచ్చారు. కానీ మా మొదటి ప్రాధాన్యత ఆటగాళ్ల భద్రతకే. ఈ పరిస్థితుల్లో పర్యటనను ముగించడం తప్ప మరో మార్గం లేదు’’ అని అన్నాడు. న్యూజిలాండ్‌ పర్యటన కొనసాగేలా చూడడం కోసం పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌.. న్యూజిలాండ్‌ ప్రధాని జసిందాతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. న్యూజిలాండ్‌ జట్టు ఈ నెల 11న పాకిస్థాన్‌కు వచ్చింది.

మండిపడ్డ పీసీబీ: న్యూజిలాండ్‌ క్రికెట్‌ (ఎన్‌జెడ్‌సీ) నిర్ణయాన్ని పీసీబీ తప్పు పట్టింది. ‘‘అన్ని పర్యటక జట్ల కోసం పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు, పాకిస్థాన్‌ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తాయి. న్యూజిలాండ్‌ క్రికెర్లకూ అలాంటి భద్రతనే కల్పిస్తామని మేం హామీ ఇచ్చాం. స్వయంగా పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌.. న్యూజిలాండ్‌ ప్రధానితో మాట్లాడారు. పర్యటక జట్టుకు ఎలాంటి భద్రత ముప్పు లేదని చెప్పారు. కానీ చివరి క్షణాల్లో న్యూజిలాండ్‌ బోర్డు తీసుకున్న నిర్ణయం పాకిస్థాన్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు నిరాశ కలిగించేదే. న్యూజిలాండ్‌ బోర్డుది ఏకపక్ష నిర్ణయం’’ అని పీసీబీ చెప్పింది. ‘‘భద్రత ముప్పు పొంచి ఉందంటూ పాకిస్థాన్‌ పర్యటన నుంచి న్యూజిలాండ్‌ తప్పుకోవడం అసహనం కలిగిస్తోంది. న్యూజిలాండ్‌ ఏకపక్షంగా వ్యవహరించింది’’ అని పీసీబీ కొత్త ఛైర్మన్‌ రమీజ్‌ రాజా అన్నాడు.

మళ్లీ మొదటికి?: దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ పునరుద్ధరణ మొదలైన నేపథ్యంలో సంతోషంగా ఉన్న పాకిస్థాన్‌కు ఇది చాలా పెద్ద దెబ్బే. 2009లో లాహోర్‌లో గదాఫీ స్టేడియానికి వెళ్తుండగా శ్రీలంక జట్టుపై దాడి జరిగిన తర్వాత పాకిస్థాన్‌కు అంతర్జాతీయ జట్లు వెళ్లడం మానేశాయి. ఆ తర్వాత తాను ఆతిథ్యమివ్వాల్సిన సిరీస్‌లను పాకిస్థాన్‌ చాలా వరకు యూఏఈలో ఆడింది. అయితే పీసీబీ గట్టిగా కృషి చేయడంతో గత కొన్నేళ్లలో పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు కాస్త ఊపొచ్చింది. 2017లో పాకిస్థాన్‌లో పీఎస్‌ఎల్‌ ఫైనల్‌ తర్వాత... శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా జట్లు ఆ దేశంలో పర్యటించాయి. 2019 పీఎస్‌ఎల్‌ అంతా పాకిస్థాన్‌లో జరిగింది. 2019లో పాక్‌లో శ్రీలంక టెస్టు సిరీస్‌ ఆడడంతో పీసీబీ ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇకపై తాము ఆతిథ్యమివ్వాల్సిన సిరీస్‌లన్నింటినీ యూఏఈ నుంచి పాకిస్థాన్‌కు తరలించాలని భావించింది. కానీ ఇప్పుడు న్యూజిలాండ్‌ నిర్ణయంతో పాకిస్థాన్‌ ప్రయత్నాలకు గట్టి దెబ్బ తగిలినట్లయింది.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని