ఆ స్వర్ణం చూసేందుకు.. అమ్మ లేదు

తాజా వార్తలు

Updated : 24/09/2021 07:11 IST

ఆ స్వర్ణం చూసేందుకు.. అమ్మ లేదు

దిల్లీ

జాతీయ ఛాంపియన్‌షిప్‌లో పసిడి గెలిచి  కానుకగా ఇస్తానని తన తల్లికి ఆ బాక్సర్‌ మాటిచ్చాడు. అద్భుత ప్రదర్శనతో ఆ ఛాంపియన్‌షిప్‌లో తనకంటే మెరుగైన ప్రత్యర్థులను ఓడించి టైటిల్‌ గెలవడంతో పాటు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో దేశం కోసం పోటీపడే అవకాశమూ దక్కించుకున్నాడు. ఆ బంగారు పతకాన్ని తీసుకుని సంతోషంతో ఇంటికి చేరాడు. ఇంటి బయట బంధువులు ఉంటే.. తనకు ఆహ్వానం పలికేందుకు వచ్చారేమో అనుకున్నాడు. కానీ వాళ్ల ముఖాల్లో ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది. ఆ స్వర్ణాన్ని అమ్మ కాళ్ల దగ్గర పెడదామని ఇంట్లోకి వెళ్లాడు. ఎదురుగా చూస్తే ఆమె ఫొటోకు దండ వేసి ఉంది. అప్పుడే అతనికి అర్థమైంది.. తన తల్లి లేదని.. ఎంత పిలిచినా ఇక రాదని. ఛాంపియన్‌షిప్‌కు వెళ్లేముందు నవ్వుతూ మాట్లాడిన అమ్మ.. ఇప్పుడు ఈ లోకంలో లేదని, ఆమె చివరి చూపు కూడా తనకు దక్కలేదని ఆ కుర్రాడి హృదయం ముక్కలైంది. ఇది సినిమా కథ కాదు. హరియాణా యువ బాక్సర్‌ ఆకాశ్‌ కుమార్‌ నిజ జీవితంలో జరిగిన విషాదకరమైన సంఘటన. జాతీయ ఛాంపియన్‌షిప్‌ ఆరంభానికి ఒక రోజు ముందే (ఈ నెల 14న) వాళ్ల అమ్మ సంతోష్‌ మరణించింది. ఊపిరి తిత్తుల సమస్యతో ఆమె కన్నుమూసింది. కానీ ఆ విషయాన్ని ఆకాశ్‌కు తెలియకుండా ఉంచారు. ఛాంపియన్‌షిప్‌లో సర్వీసెస్‌ తరపున ప్రాతినిథ్యం వహించిన ఆకాశ్‌.. 54 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. అతను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాతే తన తల్లి మరణవార్త తెలిసింది. ‘‘ఆ పసిడి అమ్మకు సంతోషాన్ని ఇస్తుందని పతకాన్ని అందుకున్నప్పుడు సంబరాలు చేసుకున్నా.  పతకంతో ఇంటికి చేరితే.. అమ్మ చిత్రపటాన్ని చూపించారు. అమ్మ లేదనే విషయాన్ని ఎలా జీర్ణించుకోవాలో తెలియట్లేదు. చివరగా అమ్మతో మాట్లాడినపుడు పసిడి సాధించి రావాలని నాతో మాట తీసుకుంది. నా మంచి కోసం అమ్మ మరణవార్తను నాకు ఎవరూ చెప్పలేదు. ఒకవేళ తెలిసి ఉంటే వెంటనే వచ్చేసేవాణ్ని. టోర్నీ మధ్యలో ఒకసారి అమ్మ ఎలా ఉంది అని ఫోన్‌ చేసి అడిగితే.. అనారోగ్యంతోనే ఉంది.. కానీ భయపడాల్సిందేమీ లేదని చెప్పారు’’ అని 20 ఏళ్ల ఆకాశ్‌ కన్నీళ్లతో పేర్కొన్నాడు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని