అందుకే గతేడాది ఐపీఎల్ ఆడలేదు: హర్భజన్‌
close

తాజా వార్తలు

Updated : 03/04/2021 12:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే గతేడాది ఐపీఎల్ ఆడలేదు: హర్భజన్‌

దిల్లీ: తాను కొత్తగా ఎవరికీ నిరూపించుకోవాల్సింది ఏం లేదని వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ అన్నాడు. ఐపీఎల్‌లో బెంగళూరు, ముంబయి, చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడిన అతడు ఈ ఏడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున తొలిసారి బరిలో దిగుతున్న నేపథ్యంలో ఇలా వ్యాఖ్యానించాడు. ‘‘చాలా మంది అనుకుంటూ ఉంటారు.. ఎందుకు అతడు ఇంకా ఆడుతున్నాడు అని? అది వారి అభిప్రాయం! నేను ఆడాలనుకుంటున్నా.. ఆడతా. ఎవరికీ నేనెంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. బాగా ఆడాలన్నదే నా ఉద్దేశం. నాకంటూ కొన్ని ప్రమాణాలు నెలకొల్పుకున్నా. వాటిని అందుకోలేకపోతే నన్ను నేనే నిందించుకుంటా. ఇప్పుడు నా వయసు 20 ఏళ్లు కాదు 40 ఏళ్లు. అయితే ఈ స్థాయిలో విజయవంతం కావాలంటే ఏం చేయాలో తెలుసు’’ అని భజ్జీ చెప్పాడు. తన కుటుంబ భద్రత గురించి ఆలోచించే గత ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నట్లు అతను పేర్కొన్నాడు. ‘‘2020లో దుబాయ్‌లో ఐపీఎల్‌ జరిగినప్పుడు కుటుంబ భద్రతను దృష్టిలో పెట్టుకునే టోర్నీ నుంచి వైదొలిగా. స్వదేశానికి వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు కఠిన క్వారంటైన్‌లో ఉన్నా. కానీ ఈ సంవత్సరం మన దేశంలోనే లీగ్‌ జరుగుతుండడం.. పరిస్థితులకు అలవాటు పడడంతో టోర్నీలో పాల్గొంటున్నా. కొవిడ్‌ టీకా కూడా రావడంతో నా భార్య గీతానే ఆడమని ప్రోత్సహించింది. 2019 ఐపీఎల్‌కు ముందు దేశవాళీ టోర్నీల్లో పెద్దగా పాల్గొనకపోయినా.. ఆ సీజన్లో రాణించా. ఇప్పుడు కూడా అంతే. పోటీ క్రికెట్లో పాల్గొని చాలా రోజులు అయింది. అయితే ఈ స్థాయిలో ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు’’ అని భజ్జీ తెలిపాడు. కోల్‌కతాకు మంచి జట్టు ఉందని.. రాహుల్‌ త్రిపాఠి, నితీష్‌ రాణా లాంటి మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారని అతనన్నాడు. భజ్జీని చెన్నై వదులుకోగా.. మినీ వేలంలో కోల్‌కతా రూ.2 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని